కేసులు 3,041.. మరణాలు 90

4 Apr, 2020 04:10 IST|Sakshi

దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా బాధితులు

మహారాష్ట్రలో అత్యధికంగా కేసులు, మరణాలు

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య శుక్రవారానికి 3041కి, మరణాల సంఖ్య 90కి చేరింది. రాష్ట్రాలవారీగా ప్రకటించిన గణాంకాల మేరకు శుక్రవారం ఒక్కరోజే 534 కొత్త కేసులు, 14 మరణాలు నమోదయ్యాయి. ఇప్పటివరకు మహారాష్ట్రలో అత్యధిక సంఖ్యలో మరణాలు చోటు చేసుకున్నాయి. ఇక్కడ కోవిడ్‌–19తో 26 మంది మరణించగా, గుజరాత్‌(8), మధ్యప్రదేశ్‌(6), పంజాబ్‌(5), ఢిల్లీ(6), కర్నాటక(3), పశ్చిమబెంగాల్‌(3), జమ్మూకశ్మీర్‌(2), ఉత్తరప్రదేశ్‌(2), కేరళ(2) తదితర రాష్ట్రాల్లోనూ మరణాలు చోటు చేసుకున్నాయి.

అయితే, కేంద్రం పేర్కొంటున్న గణాంకాలకు, రాష్ట్రాలు ప్రకటిస్తున్న వివరాలకు మధ్య అంతరం ఉంటోంది. మహారాష్ట్రలో కేసుల సంఖ్య కూడా భారీగానే ఉంది. అక్కడ మొత్తం 490 కేసులు నమోదయ్యాయి. ఆ తరువాత స్థానంలో తమిళనాడు(411) ఉంది. ఢిల్లీలో శుక్రవారానికి కేసుల సంఖ్య 386కి చేరింది. వీటిలో శుక్రవారం ఒక్కరోజులోనే 93 కొత్త కేసులు నమోదయ్యాయి.  దేశవ్యాప్తంగా 211 మంది కరోనా నుంచి కోలుకున్నారని శుక్రవారం సాయంత్రం కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. 

కరోనా బాధితుల్లో 55 మంది విదేశీయులున్నారని తెలిపింది. శుక్రవారం నాటికి ఉత్తరప్రదేశ్‌లో 172, తమిళనాడులో 309, రాజస్తాన్‌లో 167, కర్నాటకలో 124, మధ్యప్రదేశ్‌లో 104, గుజరాత్‌లో 95, జమ్మూకశ్మీర్లో 75, పశ్చిమబెంగాల్‌లో 63, బిహార్‌లో 29 కేసులు నమోదయ్యాయి. కాగా, కరోనా హాట్‌స్పాట్స్‌గా గుర్తించిన ప్రాంతాలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక ఐసోలేషన్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే, అక్కడి అనుమానితులపై కరోనా నిర్ధారణ పరీక్షలు జరపడాన్ని వేగవంతం చేశారు. గత రెండు రోజులుగా దేశవ్యాప్తంగా నమోదైన కేసుల్లో 647 కేసులు ఢిల్లీలో జరిగిన తబ్లిగి జమాత్‌ మత కార్యక్రమంలో పాల్గొన్నవారికి సంబంధించినవేనని ఆరోగ్య శాఖ జాయింట్‌ సెక్రటరీ లవ్‌ అగర్వాల్‌ వెల్లడించారు. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా