పాక్ తీర్మానం నిరాధారం: భారత్

15 Aug, 2013 05:29 IST|Sakshi

న్యూఢిల్లీ: నియంత్రణ రేఖ వద్ద భారత ఆర్మీ కవ్వింపు చర్యలకు పాల్పడిందంటూ పాక్ పార్లమెంటు మంగళవారం చేసిన ఖండన తీర్మానాన్ని భారత పార్లమెంటు తోసిపుచ్చింది. పాక్ తీర్మానంలో నిరాధారమైన, పసలేని ఆరోపణలు ఉన్నాయని గర్హించింది. ఎల్‌ఓసీలో దాడికి దిగింది పాక్ ఆర్మీనే అని తేల్చి చెప్పింది. ఈమేరకు బుధవారం ఉభయ సభలు పాక్ ఆర్మీ దాడులను ఖండిస్తూ తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించాయి.
 
 తమ దేశం ఎల్‌ఓసీని గౌరవిస్తుందని, 2003 నాటి కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ ప్రభుత్వం అమలు చేయాలని ఏకరూప తీర్మానాల్లో కోరాయి. రాజ్యసభలో చైర్మన్ హమీద్ అన్సారీ, లోక్‌సభలో స్పీకర్ మీరాకుమార్‌లు వీటిని చదివారు. భారత్‌పై పాక్ జాతీయ అసెంబ్లీ చేసిన తీర్మానాలను తోసిపుచ్చుతున్నట్లు ఈ తీర్మానాలు పేర్కొన్నాయి. ‘జమ్మూకాశ్మీర్‌తోపాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్ కూడా భారత్‌లో అంతర్భాగం. అవి ఇకముందూ ఇలాగే ఉంటాయి’ అని ప్రకటించాయి. తీర్మానాలను సభ్యులు బల్లలు చరిచి ఆమోదించారు. ఈ నెల 6న పూంంచ్ సెక్టార్‌లో పాక్ ఆర్మీ జరిపిన కాల్పుల్లో చనిపోయిన భారత జవాన్లకు లోక్‌సభ నివాళి అర్పించింది.

మరిన్ని వార్తలు