కరోనా కేసుల్లో కొత్త రికార్డు

20 Jul, 2020 03:36 IST|Sakshi
ఢిల్లీలో ఆదివారం కరోనా వైరస్‌ సోకి కోవిడ్‌ కేర్‌ సెంటర్‌ చికిత్స పొందుతున్న బాలుడితో కలిసి ఆడుకుంటున్న ఆరోగ్య కార్యకర్త

ఒక్కరోజులో 38,902 కేసులు 

24 గంటల్లో 543 మంది మృతి

మొత్తం కేసులు 10,77,618.. మరణాలు 26,816  

న్యూఢిల్లీ/సాక్షి, ముంబై: కరోనా రక్కసి దేశం మొత్తం శరవేగంగా విస్తరిస్తోంది. పాజిటివ్‌ కేసుల విషయంలో రోజుకో కొత్త రికార్డు నమోదవుతోంది. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు.. ఒక్క రోజు వ్యవధిలో రికార్డు స్థాయిలో 38,902 కేసులు బయటపడ్డాయి. గత 24 గంటల్లో 543 మంది కరోనా బాధితులు కన్నుమూశారు. అలాగే 23,672 మంది బాధితులు చికిత్సతో కోలుకున్నారు. దేశంలో ఒక్క రోజులో ఇంతమంది కోలుకోవడం ఇదే తొలిసారి.

ఇండియాలో ఇప్పటిదాకా మొత్తం కేసులు 10,77,618కు, మరణాలు 26,816కి చేరుకున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం ప్రకటించింది. ప్రస్తుతం కరోనా యాక్టివ్‌ కేసులు 3,73,379 కాగా, ఇప్పటిదాకా మొత్తం 6,77,422 మంది పూర్తిగా కోలుకున్నారు. ప్రపంచంలో కరోనా తీవ్రత అత్యధికంగా ఉన్న అమెరికా, బ్రెజిల్, రష్యా, పెరూ, చిలీ, మెక్సికో, దక్షిణాఫ్రికా, యూకే, ఇరాన్, పాకిస్తాన్, స్పెయిన్‌ల్లో నమోదైన మొత్తం కరోనా కేసులు భారత్‌లోని కేసుల కంటే 8 రెట్లు అధికం. మొత్తం మరణాలు 14 రెట్లు అధికం అని కేంద్రం తెలిపింది

మహారాష్ట్రలో మూడు లక్షలకుపైగా కేసులు  
 మహారాష్ట్రలో ఇప్పటిదాకా 3,00,937 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 11,596 మంది మృతి చెందారు. ముంబైలో కరోనా బాధితుల సంఖ్య ఒక లక్ష దాటింది.  

దేశవ్యాప్తంగా తగ్గుతున్న మరణాల రేటు  
కరోనా మరణాల రేటు క్రమంగా తగ్గుతోందని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. ప్రస్తుతం మరణాల రేటు కేవలం 2.49 శాతం మాత్రమేనని తెలిపింది.   దేశంలో 29 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో మరణాల రేటు జాతీయ సగటు కంటే తక్కువగా ఉందని తెలిపింది.  నెల క్రితం దేశంలో కోవిడ్‌ మరణాల రేటు 2.82 శాతం కాగా, జూలై 10కి 2.72 శాతానికి, జూలై 19 నాటికి 2.49 శాతానికి పడిపోయింది.  

మరిన్ని వార్తలు