నేటి నుంచి యూఎస్‌కు విమానాలు

17 Jul, 2020 04:50 IST|Sakshi

ఈరోజు నుంచి 31 వరకు అమెరికాకు విమానాలు

రేపటి నుంచి ఆగస్ట్‌ 1 వరకు ఫ్రాన్స్‌కు.. త్వరలో బ్రిటన్‌కు..

న్యూఢిల్లీ: అంతర్జాతీయ విమాన సర్వీసులను మళ్లీ ప్రారంభించే దిశగా భారత ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. విమాన సర్వీసు లను ప్రారంభించేందుకు వీలుగా అమెరికా, ఫ్రాన్స్, జర్మనీలతో ప్రత్యేక ద్వైపాక్షిక ఒడంబడికలను కుదుర్చుకుంది. త్వరలో యూకేతోనూ ఈ తరహా ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు పౌర విమానయాన శాఖ ప్రకటించింది. ఈ వివరాలను విమానయాన మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురి గురువారం వెల్లడించారు.

ఆ వివరాల ప్రకారం.. పారిస్‌ నుంచి ఢిల్లీ, బెంగళూరు, ముంబైలకు జూలై 18 నుంచి ఆగస్టు 1 వరకు ఎయిర్‌ ఫ్రాన్స్‌ సంస్థ 28 విమాన సర్వీసులను నడుపుతుంది. అలాగే, ఈరోజు నుంచి 31 వరకు ఇరుదేశాల మధ్య అమెరికాకు చెందిన యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌ 18 విమాన సర్వీసులను నడుపుతుంది. ఆ సంస్థ ఢిల్లీ– నెవార్క్‌ల మధ్య ప్రతీరోజు ఒక సర్వీసును, ఢిల్లీ– శాన్‌ఫ్రాన్సిస్కోల మధ్య వారానికి మూడు సర్వీసులను నడుపుతుంది.

యూకేతో ఒప్పందం కుదిరిన తరువాత.. ఢిల్లీ, లండన్‌ల మధ్య రోజుకు రెండు సర్వీసులు ఉంటాయని పురి తెలిపారు. జర్మనీ నుంచి లుఫ్తాన్సా సర్వీసులుంటాయన్నారు. భారత్‌ నుంచి ఎయిర్‌ ఇండియా సంస్థ ఆయా దేశాలకు విమాన సర్వీసులను నడుపుతుందని వివరించారు. అంతర్జాతీయ సర్వీసులపై భారత్‌ ఇప్పటికే యూఏఈతో ఒప్పందం కుదుర్చుకుంది. కరోనా మహమ్మారి విస్తృతి నేపథ్యంలో  దీపావళి నాటికి దేశీయ ట్రాఫిక్‌ కరోనా ముందున్న స్థాయితో పోలిస్తే.. 55 శాతానికి చేరుకుంటుందని ఆశిస్తున్నామని తెలిపారు.

భౌతిక దూరంపై ప్రయాణికుల ఆందోళన
కరోనా సమయంలో కొందరు విమాన ప్రయాణికులు భౌతిక దూరం నిబంధనను సరిగ్గా పాటించకపోవడాన్ని మిగతావారు ప్రధాన సమస్యగా భావిస్తున్నారని ఒక సర్వేలో తేలింది. జూన్‌ 20 నుంచి జూన్‌ 28 వరకు ఆన్‌లైన్‌లో సుమారు 25 వేల మంది ప్రయాణికులను సర్వే చేశామని ఇండిగో ప్రకటించింది.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు