గల్వాన్‌ లోయ మాదే

21 Jun, 2020 04:16 IST|Sakshi

చైనా వాదన ఏమాత్రం ఆమోదనీయం కాదని భారత్‌ స్పష్టీకరణ

కొందరి పెడార్థాలపై ఘాటుగా స్పందించిన ప్రధాని కార్యాలయం

న్యూఢిల్లీ/బీజింగ్‌: గల్వాన్‌ లోయ తమదేనంటూ శనివారం చైనా చేసిన ప్రకటనను భారత్‌ తీవ్రంగా ఖండించింది. అతిశయోక్తితో కూడిన చైనా వాదన ఏమాత్రం ఆమోదయోగ్యంకాదని స్పష్టం చేసింది. విదేశాంగ శాఖ ప్రతినిధి అనురాగ్‌ శ్రీవాస్తవ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘గల్వాన్‌ లోయ చారిత్రకంగా భారత్‌దే. గతంలో ఎన్నడూ ఇది చైనా భూభాగం కాదు. రెండు దేశాల బలగాలు ఈ ప్రాంతంలో గస్తీ చేపడుతున్నా చాలాకాలంగా ఎటువంటి ఘటనలు జరగలేదు. ఇదే తీరును చైనా కొనసాగించాలి. ఉల్లంఘించేందుకు చేసే ఎలాంటి ప్రయత్నాన్నైనా భారత బలగాలు తగిన విధంగా తిప్పికొడతాయి’ అని అన్నారు. ఇటీవల రెండు దేశాల విదేశాంగ మంత్రుల మధ్య కుదిరిన అవగాహన మేరకు చైనా వ్యవహరిస్తుందని భావిస్తున్నామన్నారు.

చైనా ట్విట్టర్‌లో కనిపించని మోదీ ప్రసంగం
గల్వాన్‌ ఘటనపై ఈనెల 18వ తేదీన ప్రధాన మంత్రి మోదీ చేసిన ప్రసంగంతోపాటు, విదేశాంగ శాఖ ప్రతినిధి శ్రీవాస్తవ చేసిన వ్యాఖ్యలను చైనాలోని ప్రధాన సోషల్‌ మీడియా సైట్లు తొలగించాయి. వీబో, వుయ్‌చాట్‌ సైట్లలో వీటిని తమకు కనిపించకుండా చేశారని చైనాలోని భారత దౌత్యాధికారులు తెలిపారు.  చైనా ట్విట్టర్‌ ‘సినావీబో’, ‘ఉయ్‌చాట్‌’కు కోట్లాదిగా యూజర్లున్నారు. అన్ని దౌత్య కార్యాలయాలు, ప్రధాని మోదీ వంటి పలువురు ప్రపంచ నేతలకు ఇందులో అకౌంట్లున్నాయి. వీబో, వుయ్‌చాట్‌ల్లో భారత్‌తో సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలకు సంబంధించి ఎలాంటి పోస్టులు లేవు.

అది దుర్మార్గమైన భాష్యం
భారత, చైనా సరిహద్దుల్లో పరిస్థితులపై ప్రధాని మోదీ ఇచ్చిన వివరణకు కొందరు దుర్మార్గపూరితంగా పెడార్థాలు తీస్తున్నారని ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) పేర్కొంది. ‘తూర్పు లద్దాఖ్‌లోని భారత భూభాగంలోకి ఎవరూ అడుగు పెట్టలేదు. భారత సైనిక పోస్టులను ఎవరూ ఆక్రమించుకోలేదు.. ’అంటూ శుక్రవారం ప్రతిపక్షాలతో భేటీలో ప్రధాని మోదీ ఇచ్చిన వివరణపై కాంగ్రెస్‌ నేతల నుంచి వచ్చిన వ్యాఖ్యలపై పీఎంవో వివరణ ఇచ్చింది. ‘మన జవాన్ల వీరోచిత పోరాటం ఫలితంగానే భారత్‌ వైపునున్న వాస్తవ నియంత్రణ రేఖ దాటి చైనా బలగాలు అడుగుపెట్టలేదని ప్రధాని మోదీ శుక్రవారం ప్రతిపక్షాలకు చెప్పారు.

బిహార్‌ రెజిమెంట్‌లోని 16 మంది జవాన్ల త్యాగాల ఫలితంగానే ఆరోజు చైనా సైన్యం ఎల్‌ఏసీ దాటి వచ్చి, నిర్మాణాలు చేపట్టేందుకు చేసిన ప్రయత్నం సాగలేదు. మన జవాన్లు వారికి తగిన బుద్ధి చెప్పారు. దేశ సరిహద్దులు కాపాడేందుకు ఉన్న ఏ ఒక్క అవకాశాన్నీ భారత్‌ వదులుకోదని ప్రధాని అన్నారు. కానీ, కొన్ని వర్గాలు ప్రధాని మోదీ వ్యాఖ్యలకు దుర్మార్గపూరితంగా వక్రభాష్యాలు చెప్పేందుకు ప్రయత్నించాయి’అని శనివారం పీఎంవో పేర్కొంది.

మన భూభాగాన్ని చైనాకు అప్పగించారు: రాహుల్‌
భారత భూభాగాన్ని ప్రధాని మోదీ చైనాకు అప్పగించారని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. భారత భూభాగంలోకి ఎవరూ అడుగుపెట్టలేదనీ, సైనిక పోస్టులను ఎవరూ ఆక్రమించుకోలేదని శుక్రవారం ప్రధాని మోదీ ఇచ్చిన వివరణపై ఆయనతోపాటు పలువురు కాంగ్రెస్‌ నేతలు ఈ మేరకు స్పందించారు. ‘ప్రధాని మోదీ భారతీయ భూభాగాన్ని చైనా దురాక్రమణకు అప్పగించారు. అది చైనా ప్రాంతమే అయితే మన సైనికులు ఎందుకు, ఎక్కడ ప్రాణాలర్పించారు’అని ట్విట్టర్‌లో రాహుల్‌ ప్రశ్నలు సంధించారు.

చిల్లర రాజకీయాలు వద్దు: అమిత్‌ షా
గల్వాన్‌ లోయలోని భారత భూభాగాన్ని ప్రధాని మోదీ చైనాకు అప్పగించారంటూ కాంగ్రెస్‌ నేత రాహుల్‌ చేసిన వ్యాఖ్యలపై హోంమంత్రి అమిత్‌ షా తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్‌ పార్టీ చిల్లర రాజకీయాలకు పాల్పడుతోందని ఆయన ట్విట్టర్‌లో విమర్శించారు. గల్వాన్‌ ఘటనలో గాయపడిన జవాను తండ్రి.. సరిహద్దు ఉద్రిక్తతలను రాజకీయం చేయొద్దంటూ రాహుల్‌ను కోరుతున్నట్లుగా ఉన్న వీడియోను పోస్ట్‌ చేశారు. ‘రాహుల్‌ గాంధీకి సాహస సైనికుడి తండ్రి ఒక స్పష్టమైన సందేశం ఇచ్చారు. జాతి యావత్తూ కలిసికట్టుగా ఉండాల్సిన ఈ క్లిష్ట సమయంలో చిల్లర రాజకీయాలను పక్కనబెట్టి, జాతి ప్రయోజనాల కోసం సంఘీభావంగా నిలవాలి’అని హోం మంత్రి పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు