బ్రిటీష్‌ ఎంపీని వెనక్కి పంపిన భారత్‌

12 Jul, 2018 11:56 IST|Sakshi

న్యూఢిల్లీ : బ్రిటీష్‌ పార్లమెంటేరియన్‌ లార్డ్‌ అలెగ్జాండర్‌ కార్లిలేను ఢిల్లీ ఎయిర్‌పోర్టు అధికారులు భారత్‌లోకి అనుమతించలేదు. సరైన వీసా పత్రాలు లేని కారణంగా ఎయిర్‌పోర్టు అధికారులు అతన్ని తిరిగి వెనక్కి పంపించారు. ఈ ఘటనపై భారత విదేశాంగ అధికార ప్రతినిధి రవీశ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. కార్లిలే పర్యటన ఉద్దేశం, అతను వీసాలో సమర్పించిన వివరాలు వేర్వేరుగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. దీంతో అతన్ని తిరిగి ఇంగ్లండ్‌ పంపించామన్నారు. కార్లీలే ప్రస్తుతం బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని ఖలీదా జియాకు న్యాయ సలహాదారునిగా ఉన్నారు.

ఈ ఏడాది ఫిబ్రవరిలో ఓ అవినీతి కేసులో బంగ్లా కోర్టు ఆమెకు ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించిన సంగతి తెలిసిందే. దీంతో ఆమె న్యాయ సలహాదారుడిగా ఉన్న కార్లిలేను బంగ్లాదేశ్‌లోని రానివ్వబోమని ప్రధాని షేక్‌ హసీనా ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఆయన జియాకు మద్దతుగా ఇండియాలో మీడియా సమావేశం నిర్వహించనున్నట్టు గతంలోనే తెలిపారు. దీని ద్వారా అంతర్జాతీయ మీడియాకు జియా కేసులోని వాస్తవాలను వివరిస్తానని కూడా అన్నారు. కానీ వీసాలో పర్యటన ఉద్దేశాని​ వేరే విధంగా పేర్కొనడంతో ఎయిర్‌పోర్ట్‌ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు