ప్రపంచ మీడియాకు హెడ్‌లైన్స్‌

6 Aug, 2019 03:40 IST|Sakshi

భారత ప్రభుత్వ చర్యలపై నిశిత పరిశీలన

న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్‌ 370 రద్దు నిర్ణయం తీసుకున్న నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని భారత మీడియా ఆకాశానికెత్తేస్తూ సోమవారం రోజంతా ప్రత్యేక కథనాలు ప్రసారం చేసింది. ఆర్టికల్‌ 370 రద్దుతో పరోక్షంగా ప్రభావం పడే పాకిస్తాన్‌ మీడియా మోదీ ప్రభుత్వ నిర్ణయంపై వ్యతిరేక కథనాలు వండి వారుస్తోంది. ఈ అంశంపై ప్రపంచ మీడియా సంస్థలు ఎలా రిపోర్ట్‌ చేశాయో ఓసారి చూద్దాం.

ది గార్డియన్‌: జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తోన్న ఆర్టికల్‌ 370ని తొలగించడానికి ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం తీవ్రమైన నిర్ణయం తీసుకుందని లండన్‌ కేంద్రంగా పనిచేస్తున్న ది గార్డియన్‌ వెల్లడించింది. జమ్మూ కశ్మీర్‌ను విభజించాలన్న నిర్ణయం కూడా నాటకీయ మైన ఎత్తుగడ అని తెలిపింది. ఈ నిర్ణయం తో పాకిస్తాన్‌ వల్ల ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉందంది.
బీబీసీ: జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దు చేయాలన్న భారత ప్రభుత్వ నిర్ణయం అత్యంత ముఖ్యమైన చర్యగా ప్రముఖ వార్తా సంస్థ బీబీసీ అభివర్ణించింది. అయితే ఈ నిర్ణయం వల్ల ఉద్రిక్తతలు రాజేసే అవకాశం ఉందంది.

సీఎన్‌ఎన్‌: ఆర్టికల్‌ 370ని రద్దు చేయాలన్న భారత ప్రభుత్వ చర్య కశ్మీరీలకు మానసికంగా పెద్ద షాక్‌ కలిగించిందని అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న సీఎన్‌ఎన్‌ సంస్థ పేర్కొంది. భారత్‌ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ఆ రాష్ట్రం పూర్తిగా స్తంభించిపోయిందని తెలిపింది.

ది వాషింగ్టన్‌ పోస్ట్‌: ‘కలహాలకు కొత్త వేదిక’అంటూ భారత ప్రభుత్వ ఆర్టికల్‌ 370 రద్దు నిర్ణయాన్ని వాషింగ్టన్‌ పోస్ట్‌ రిపోర్ట్‌ చేసింది. భారత్‌లో కశ్మీర్‌ విలీనమవ్వడానికి ఆర్టికల్‌ 370 మూలమైందని పేర్కొంది.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా