జయహో జెండా పండుగ

27 Jan, 2018 01:41 IST|Sakshi
ఢిల్లీలోని రాజ్‌పథ్‌ వద్ద జరిగిన గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న రాష్ట్రపతి కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య, ప్రధాని మోదీ, ఆసియాన్‌ దేశాధినేతలు

కన్నుల పండువగా 69వ రిపబ్లిక్‌ డే వేడుకలు

పతాకావిష్కరణ చేసిన రాష్ట్రపతి.. అనంతరం సైనిక వందనం స్వీకరణ

తొలిసారి ముఖ్య అతిథులుగా ఆసియాన్‌ దేశాధినేతలు

వివిధ దేశాల దౌత్య కార్యాలయాల్లో ఘనంగా వేడుకలు

న్యూఢిల్లీ: భారత దేశభక్తిని, అస్త్ర శక్తిని ప్రతిబింబించేలా 69వ గణతంత్ర వేడుకలు ఢిల్లీలో ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథులుగా హాజరైన ఆసియాన్‌ దేశాధినేతల సమక్షంలో భారత సంప్రదాయాలు, సైనిక పాటవ ప్రదర్శనల నడుమ వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. రాజ్‌పథ్‌ రోడ్డులో జరిగిన ఈ కార్యక్రమానికి వేలమంది ప్రజలు,  ప్రముఖులు హాజరయ్యారు. త్రివర్ణపతాక ఆవిష్కరణ అనంతరం భారత త్రివిధ దళాల అధిపతి, రాష్ట్రపతి రామ్‌నాథ్‌ పరేడ్‌లో సైనిక వందనం స్వీకరించారు. రాష్ట్రపతిగా  కోవింద్‌కు ఇదే తొలి గణతంత్ర దినోత్సవ వేడుక.

చీఫ్‌ గెస్ట్‌లుగా..
ఆసియాన్‌ దేశాల వ్యూహాత్మక సంబంధాలతో బలమైన కూటమిగా ఎదిగే క్రమంలో భారత్‌లో జరుగుతున్న జాతీయ వేడుకలకు ఈ 10 దేశాల అధినేతలు ముఖ్య అతిథులుగా హాజరవటం ఇదే తొలిసారి. మయన్మార్‌ కౌన్సెలర్‌ ఆంగ్‌సాన్‌ సూచీ, వియత్నాం ప్రధాని ఎన్‌గెయెన్‌ జువాన్, ఫిలిప్పీన్స్‌ అధ్యక్షుడు రోడ్రిగో డ్యుటర్టె, థాయలాండ్‌ ప్రధాని ప్రయుత్‌ చానోచా, సింగపూర్‌ చీఫ్‌ సీన్‌ లూంగ్, బ్రూనై సుల్తాన్‌ హాజీ బోల్‌కయా, ఇండోనేసియా అధ్యక్షుడు జోకో విడోడో, మలేసియా ప్రధాని నజీబ్‌ రజాక్, లావోస్‌ పీఎం థాంగ్‌లౌన్‌ సిసౌలిత్, కంబోడియన్‌ అధ్యక్షుడు హున్‌సేన్‌ ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

వేడుకల ప్రారంభానికి ముందు ప్రధాని.. రక్షణ మంత్రి, త్రివిధ దళాల చీఫ్‌లతో కలిసి ఇండియా గేట్‌ వద్ద అమర జవాన్‌ జ్యోతి వద్ద నివాళులర్పించారు. గణతంత్ర వేడుకల్లో.. కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్, జైట్లీ, జేపీ నడ్డా, రవిశంకర్‌ ప్రసాద్‌ సహా కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్, మాజీ ప్రధాని మన్మోహన్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆహ్వానం మేరకు దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 61 మంది గిరిజన ప్రముఖులు ఈ వేడుకలను ప్రత్యక్షంగా వీక్షించారు.  

కళ్లన్నీ ఆకాశంలోనే..
పరేడ్‌ చివర్లో ఎమ్‌ఐ–17 యుద్ధ విమానాలు, రుద్ర హెలికాప్టర్లు, ఐఏఎఫ్‌ విమానాలతో వైమానికదళం చేసిన విన్యాసాలు అబ్బురపరిచాయి. ఎల్‌హెచ్, ఎంకే–4, డబ్ల్యూఎస్‌ఐ హెలికాప్టర్లు, సీ–130జే సూపర్‌ హెర్క్యులస్‌ యుద్ధ విమానం చేసిన విన్యాసాలు వీక్షకులను ఆకట్టుకున్నాయి.  

21 గన్‌ సెల్యూట్‌
సంప్రదాయం ప్రకారం త్రివర్ణ పతాకావిష్కరణ తర్వాత జాతీయగీతం ఆలాపనతోపాటు 52 సెకన్లపాటు 21 గన్‌ సెల్యూట్‌ నిర్వహించారు. 2281 రెజిమెంట్‌కు చెందిన ఏడు ఫిరంగుల ద్వారా ఈ గన్‌ సెల్యూట్‌ నిర్వహించారు. గణతంత్ర దినోత్సవంతోపాటు, ఆగస్టు 15, ఆర్మీడే (జనవరి 15), అమరవీరుల దినం (జనవరి 30)న ఈ రకమైన గన్‌సెల్యూట్‌ చేస్తారు. హిమాచల్‌ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌ సహా 13 రాష్ట్రాలు, పలు మంత్రిత్వ శాఖలు తమ శకటాలను ప్రదర్శించాయి. డీఆర్‌డీవో సంస్థ.. నిర్భయ్‌ క్షిపణిని, అశ్విని రాడార్‌ వ్యవస్థతో కూడిన శకటంతో పరేడ్‌లో పాల్గొంది.   

‘జగమంత’ వేడుకలు
ఢిల్లీతోపాటు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోనూ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఆయా రాష్ట్రాల్లో గవర్నర్లు త్రివర్ణ పతాకాలను ఆవిష్కరించారు. ప్రజలు ప్రాథమిక హక్కులను పొందటంతోపాటు తమ బాధ్యతలు గుర్తెరిగి మసలుకోవాలని ప్రజలకు సూచించారు. రాజస్తాన్‌లోని పోఖ్రాన్‌లో ఓ భారతీయుడు, ఇద్దరు సౌదీ జాతీయులు శాటిలైట్‌ ఫోన్లతో సంచరిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చైనా, రష్యా, యూకే, ఈజిప్ట్, ఇండోనేసియా, సింగపూర్, బంగ్లాదేశ్, నేపాల్‌ తదితర దేశాల్లోని దౌత్యకార్యాలయాల్లోనూ పతాకావిష్కరణ ఘనంగా జరిగింది.

భద్రతను పక్కనపెట్టి..
గణతంత్ర దినోత్సవ సంబరాల అనంతరం ప్రధాని మోదీ భద్రతను పక్కనపెట్టి వేడుకలను చూసేందుకు రాజ్‌పథ్‌కు వచ్చిన ప్రేక్షకులకు బారికేడ్ల వద్దకెళ్లి అభివాదం చేశారు. తలపై కాషాయం, ఎరుపు, ఆకుపచ్చని సంప్రదాయ తలపాగాతో ప్రత్యేకంగా కనిపించిన మోదీ.. తమ వద్దకు వస్తుండటంతో ప్రేక్షకుల్లో హర్షం వ్యక్తమైంది. మోదీ, మోదీ నినాదాలతో వాతావరణాన్ని వారంతా మరింత హుషారుగా మార్చారు. గతేడాది స్వాతంత్య్ర దినోత్సవం అనంతరం కూడా ప్రజల వద్దకెళ్లి వారితో కరచాలనం చేశారు. ఆసియాన్‌ దేశాల అధినేతలు పాల్గొన్న ఈ వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 60వేల మంది ఢిల్లీ పోలీసు, ఆర్మీ బలగాలు, షార్ప్‌ షూటర్లతో భద్రతను కట్టుదిట్టం చేశారు.  

ఆకట్టుకున్న పరేడ్‌
మార్చ్‌పాస్ట్‌లో ఆసియాన్‌ జెండాతోపాటుగా 10 దేశాల జాతీయజెండాలనూ ప్రదర్శించారు.బీఎస్‌ఎఫ్‌ మహిళా సైనికుల ‘సీమా భవానీ’ బృందం చేసిన మోటార్‌ సైకిల్‌ విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భారత ఆర్మీ యుద్ధ ట్యాంకు టీ–90 (భీష్మ), బ్రహ్మోస్‌ మిసైల్‌ వ్యవస్థ, శత్రువుల ఆయుధాలను పసిగట్టే రాడార్, బ్రిడ్జ్‌ లేయింగ్‌ ట్యాంక్‌ టీ–72, ఆకాశ్‌ ఆయుధ వ్యవస్థ సహా తదితర భారత మిలటరీ సామర్థ్యాలను పరేడ్‌లో ప్రదర్శించారు. ఆర్మీ అశ్వికదళం, పంజాబ్‌ రెజిమెంట్, మరాఠా లైట్‌ ఇన్‌ఫాంట్రీ, డోగ్రా రెజిమెంట్, నౌక, వైమానిక దళాలూ మార్చ్‌ఫాస్ట్‌ నిర్వహించాయి. ఢిల్లీ, నాగ్‌పూర్‌లోని  పాఠశాలల విద్యార్థుల నృత్యప్రదర్శన ఆకట్టుకుంది.  

రాష్ట్రపతి ఉద్వేగం
ఈ వేడుకల్లో భారత అత్యుత్తమ మిలటరీ సేవా పురస్కారం (శాంతి సమయాల్లో ఇచ్చే) అశోకచక్రను ఐఏఎఫ్‌ గరుడ్‌ కమాండో కార్పొరల్‌ జ్యోతి ప్రకాశ్‌ నిరాలా (మరణానంతరం)కు అందజేశారు. ఈ అవార్డు ఇస్తున్న సమయంలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఉద్వేగానికి గురయ్యారు. గతేడాది నవంబర్‌లో జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులతో పోరాడుతూ అమరుడైన ఎయిర్‌ఫోర్స్‌ గరుడ్‌ కమాండో, కార్పొరల్‌ జ్యోతి ప్రకాశ్‌ నిరాలా ఈ ఏడాది అశోకచక్ర అవార్డుకు ఎంపికయ్యారు. నిరాలా భార్య సుష్మానంద్, ఆయన తల్లి మాలతీ దేవీ ఈ అవార్డును అందుకున్నారు. అశోక చక్ర అందిస్తున్న సందర్భంగా రాష్ట్రపతి ఉద్వేగానికి గురయ్యారు. తన సీట్లో తిరిగి కూర్చోగానే చెమ్మగిల్లిన కళ్లను తుడుచుకుంటూ కనిపించారు.



                           పరేడ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఆసియాన్‌ దేశాల శకటం


                                   రాజ్‌పథ్‌ పరేడ్‌లో పాల్గొన్న సైనిక వాహనాలు


                              నిరాలా కుటుంబానికి అశోకచక్రను ప్రదానం చేస్తున్న రాష్ట్రపతి కోవింద్‌

మరిన్ని వార్తలు