ప్రభుత్వానికి ఆ హక్కు ఉందా?

27 Dec, 2019 17:38 IST|Sakshi

ఏడాదిలో 100సార్లు ఇంటర్‌నెట్‌ నిలిపివేత

ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పౌరులు

ఇంటర్‌నెట్‌ పౌరుల ప్రాథమిక హక్కు: కేరళ హైకోర్టు

సాక్షి, న్యూఢిల్లీ : ఇంటర్‌నెట్‌ మా జన్మహక్కు అంటూ యంగ్‌ జనరేషన్‌ నినదిస్తోంది. ఇంటర్‌నెట్‌ సేవలను నిలిపివేస్తే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామంటూ యువత ప్రభుత్వాలకు సవాలు విసురుతోంది. ఇంటర్‌నెట్‌ను పౌరుల ప్రాథమిక హక్కుగా గుర్తిస్తూ కేరళ హైకోర్టు ఇటీవల సంచలన తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కోర్టు తీర్పు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే దేశంలో తాజాగా నెలకొన్న పరిస్థితుల కారణంగా కేంద్ర ప్రభుత్వం అంతర్జాల సేవలను తొలగిస్తోంది. దీనిపై యువత తీవ్ర ఆందోళన, ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దేశ వ్యాప్తంగా ఎక్కడ ఎలాంటి అల్లర్లు, ఆందోళనలు చోటుచేసుకున్నా.. ప్రభుత్వం వెంటనే చేపడుతున్న అత్యవసర చర్య ఇంటర్‌నెట్‌ నిలిపివేత. ముఖ్యంగా కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేశంలో అత్యధికంగా ఇంటర్‌నెట్‌ సేవలను నిలిపివేసిన ఘటనలు అందరికీ తెలిసిందే.

ఆర్టికల్‌ 370తో మొదలుకొని ఎన్‌ఆర్‌సీ, పౌరసత్వ సవరణ చట్టంపై ప్రజాగ్రహం కారణంతో ప్రభుత్వం ఇంటర్‌నెట్‌ను నిలిపివేస్తోంది. 2012 నుంచి దేశ వ్యాప్తంగా 374 సార్లు ఈ సేవలను ప్రభుత్వం కట్‌చేసింది. ముఖ్యంగా గడిచిన ఏడాదిలో కాలంలో (2019)  వివిధ ప్రాంతాల వారిగా చూస్తే 100 సార్లకుపైగా ఇంటర్‌నెట్‌ సేవల నుంచి పౌరులను దూరం చేసింది. ఆర్టికల్‌ 370 రద్దుతో ఆగస్ట్‌ 5న కశ్మీర్‌ వ్యాప్తంగా అంతర్జాల సేవలను అక్కడి పౌరులకు ప్రభుత్వం నిరాకరించింది (కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కొనసాగుతోంది). ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తమవుతుండటం, సోషల్‌ మీడియా వేదికగా అల్లర్లకు పిలువునివ్వడం వంటి చర్యలను నివారించడానికే ఈ నిర్ణయమని ప్రభుత్వం చెబుతోంది. తాజాగా ఎన్‌ఆర్‌సీ, సీఏఏకు  ఆందోళనల నడుమ ఎక్కడ నిరసనలు వినిపించినా ప్రభుత్వం వెంటనే ఇంటర్‌ నెట్‌ను నిలిపివేస్తోంది.

ఉత్తర ప్రదేశ్‌ వ్యాప్తంగా సీఏఏపై ఆందోళనలు కొనసాగుతున్న క్రమంలో శుక్రవారం ప్రార్థనల దృష్ట్యా యూపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 12 జిల్లాల్లో ఇంటర్‌నెట్‌ కనెక్టివిటీని నిలిపివేసింది. నిరసనలను పర్యవేక్షించేందుకు డ్రోన్‌లను రంగంలోకి దింపింది. పశ్చిమ యూపీలోని బిజ్నోర్‌, బులంద్‌ షహర్‌, ముజఫర్‌నగర్‌, మీరట్‌, ఆగ్రా, ఫిరోజాబాద్‌, సంభల్‌, అలీగఢ్‌, ఘజియాబాద్‌, రాంపూర్‌, సీతాపూర్‌, కాన్పూర్‌ జిల్లాల్లో ఇంటర్‌నెట్‌ను కట్‌చేశారు. దీంతో ప్రభుత్వ చర్యలపై పౌరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు కల్పించిన హక్కులను పాలకులు కాలరాస్తున్నారని మండిపడుతున్నారు. ఇంటర్‌నెట్‌ సేవలకు పౌరుల ప్రాథమిక హక్కు అని 2016లో ఐక్యరాజ్యసమితి ప్రకటించిన విషయాన్ని సోషల్‌మీడియా వేదికగా పలువురు గుర్తుచేస్తున్నారు. దీని ద్వారా ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో నష్టం కూడా చేకూరుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇంటర్‌నెట్‌ ప్రాథమిక హక్కు..
కాగా ఇంటర్‌ నెట్‌ పౌరులకు కల్పించిన ప్రాథమిక హక్కుగా కేరళ హైకోర్టు ఇటీవల సంచలన తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. ఇంటర్‌ నెట్‌ నిలిపివేయడం అంటే పౌర హక్కులకు విఘాతం కల్పించడమే అని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలోనే కేరళ ప్రభుత్వం 20 లక్షల మంది పేద కుటుంబాలకు ఉచిత ఇంటర్‌నెట్‌ కనెక్షన్‌ ఇస్తున్నట్లు ప్రకటించింది. రూ.1548 కోట్ల ఖర్చుతో చేపట్టిన కేరళ ఫైబర్‌ ఆప్టిక్‌ నెట్‌వర్క్‌ ప్రాజెక్టు 2020 డిసెంబరు నాటికి పూర్తికానుంది. కాగా 2018 నాటికి దేశంలో 48 కోట్ల మందికిపైగా ప్రజలు ఇంటర్‌నెట్‌ ఉపయోగిస్తున్నారు.

2023 నాటికి ఇంటర్‌నెట్‌ వినియోగదారుల సంఖ్య 68 కోట్లకు పెరిగే అవకాశం ఉంది. అంటే దేశంలో సగానికిపైగా జనాభా ఇంటర్నెట్‌ యాక్సెస్‌ చేస్తుంది. ఈ నేపథ్యంలో కేరళ హైకోర్టు తీర్పు ప్రాధాన్యత సంతరించుకుంది. ఎవరికైనా ఎక్కడైనా ఇంటర్నెట్‌ నిరాకరించడం అంటే..పౌరుల ప్రాథమిక హక్కును కాలరాయడమే అని పేర్కొంది. భవిష్యత్తులో దేశంలోని ప్రతి రాష్ర్ట ప్రభుత్వం ఇంటర్నెట్‌ సేవల్ని ప్రాథమిక హక్కుగా గుర్తించాల్సి ఉంటుందని సంకేతాలిచ్చింది. కాగా ఇంటర్‌నెట్‌ను ప్రజల ప్రాథమిక హక్కుగా గుర్తించిన తొలి రాష్ట్రంగా కేరళ నిలిచింది.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా