ఇంటర్నెట్‌ షట్‌డౌన్‌తో లక్షల కోట్ల నష్టం

28 Dec, 2019 16:48 IST|Sakshi

న్యూఢిల్లీ : భారత్‌లో ప్రజాందోళనలు చెలరేగినప్పుడల్లా ఇంటర్నెట్‌ సేవలను రద్దు చేయడం పరిపాటిగా మారిపోయింది. దీనివల్ల వినియోగదారులకు అసౌకర్యం ఏర్పడడమే కాకుండా టెలికామ్‌ కంపెనీలకు కొన్ని లక్షల కోట్ల రూపాయల రెవెన్యూ న ష్టం వాటిల్లుతోంది. దేశంలో 2012 నుంచి 2019 వరకు ఏడేళ్ల కాలంలో 374 సార్లు ఇంటర్నెట్‌ సౌకర్యాలను రద్దు చేశారు. 2012లో ఒక్క జమ్మూ కశ్మీర్‌లో మాత్రమే నెట్‌ సేవలను నిలిపివేయగా, ఈ రోజుకు దేశంలోని 14 రాష్ట్రాల్లో వీటి సేవలను నిలిపివేశారు.

తాజాగా ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో గురువారం నుంచి ఇంటర్నెట్‌ను రద్దు చేయగా, జమ్మూ కశ్మీర్‌లో గత ఆగస్టు ఐదవ తేదీ నుంచి మొబైల్‌ ఇంటర్నెట్‌ సదుపాయాలు పనిచేయడం లేదు. ఇదివరకు ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేస్తోన్న దేశాల్లో ఇరాక్, సిరియా దేశాలు మొదటి స్థానంలో, పాకిస్థాన్‌ రెండో స్థానంలో ఉండగా, నేడు భారత్‌ మొదటి స్థానాన్ని ఆక్రమించింది. 2017లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘టెంపరరీ సస్పెన్షన్‌ ఆఫ్‌ టెలికమ్‌ సర్వీసెస్‌ (పబ్లిక్‌ ఎమర్జెన్సీ ఆర్‌ పబ్లిక్‌ సేఫ్టీ)’ చట్టం కింద ప్రభుత్వం తరచూ ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేస్తోంది.

2015, జూలై నెల నుంచి 2016, జూన్‌ మధ్య ఇంటర్నెట్‌ సేవలను దేశంలో నిలిపి వేయడం వల్ల 968 మిలియన్‌ డాలర్ల రెవెన్యూను, అదే 2012 నుంచి 2017 మధ్య ఐదేళ్ల కాలంలో మూడు బిలియన్‌ డాలర్లు, అంటే దాదాపు రెండు లక్షల పదిహేను వేల కోట్ల రూపాయల రెవెన్యూను భారత్‌ టెలికామ్‌ కంపెనీలు కోల్పోయాయని ఢిల్లీలోని ‘ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ రీసర్చ్‌ ఆన్‌ ఇంటర్నేషనల్‌ ఎకనామిక్‌ రిలేషన్స్‌’ అంచనావేసింది. ఇంటర్నెట్‌ సౌకర్యాన్ని కల్పించడం పౌరుల ప్రాథమిక హక్కు అని ఐక్యరాజ్య సమతి 2016లో పేర్కొంది. ఈ హక్కును భారత దేశంలో ఒక్క కేరళ రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే గుర్తిస్తోంది. 2017లో కేరళ హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఇంటర్నెట్‌ సేవలను పౌరుల ప్రాథమిక హక్కుగా గుర్తిస్తున్నట్లు అప్పటి కేరళ ప్రభుత్వం గుర్తించింది. (చదవండి: రావత్‌ వ్యాఖ్యలపై చర్యలు తీసుకోరా?)

>
మరిన్ని వార్తలు