సియాచిన్‌లో రోజుకు మూడున్నర కోట్ల ఖర్చు

5 Feb, 2016 13:11 IST|Sakshi
సియాచిన్‌లో రోజుకు మూడున్నర కోట్ల ఖర్చు

కశ్మీర్: మంచు తుఫాను కారణంగా పది మంది భారత సైనికులు మరణించడంతో కశ్మీర్‌కు ఆవల మంచు పర్వతాలతో కూడిన ‘సియాచిన్’ ప్రాంతం మళ్లీ వార్తల్లోకి ఎక్కింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన (సముద్ర మట్టానికి ఇరవై వేల అడుగుల ఎత్తులో) యుద్ధ క్షేత్రంగా గుర్తింపు పొందిన సియాచిన్ ప్రాంతాన్ని కాపల కాసేందుకు భారత ప్రభుత్వం రోజుకు అక్షరాల మూడున్నర కోట్ల రూపాయలను ఖర్చు పెడుతోంది. సియాచిన్‌లో భారత్, పాకిస్తాన్ సైనికుల మధ్య ఇంతవరకు జరిగిన సంఘర్షణ, యుద్ధాల్లో 900 మంది మరణించారు. వారిలో ఎక్కువ మంది మంచు తుఫానుల కారుణంగానే మరణించడం గమనార్హం.  

2012లో సంభవించిన భారీ హిమపాతంలో పాకిస్తాన్‌కు చెందిన 140 మంది సైనికులు మరణించారు. అప్పుడు భారత్ అందిస్తానన్న సహాయ సహకారాలను పాకిస్తాన్ స్వీకరించలేదు. ఇప్పుడు గల్లంతయిన పది మంది భారత సైనికులను కాపాడేందుకు పాకిస్తాన్ అందిస్తానన్న సహాయాన్ని భారత్ స్వీకరించలేదు. ఇరు దేశాలు ఇలాంటి వైఖరిని అనుసరిస్తూ వస్తుండడం వల్లనే ఇంతవరకు సియాచిన్ సమస్య పరిష్కారం కాలేదు.

భారత్, పాకిస్తాన్ దేశాలు రెండుగా విడిపోయిన తర్వాత 1949లో కుదిరిన కరాచి ఒప్పందంలో ఇరుదేశాల మధ్య సియాచిన్ సరిహద్దులను నిర్దేషించలేదు. 1972లో కుదిరిన సిమ్లా ఒప్పందంలో కూడా సరిహద్దులను నిర్దేశించకుండా కేవలం కాల్పుల విరమణ హద్దులను మాత్రమే నిర్ణయించారు. మానవ నివాసానికి గానీ, మరే ఇతర అవసరాలకుగానీ ఉపయోగపడే ప్రాంతం కాకపోవడం వల్లనే ఆ ప్రాంతాన్ని అలా వదిలేశారు. తరచు దట్టమైన మంచు కురిసే సియాచిన్‌లో ఉష్ణోగ్రత మైనస్ 60 డిగ్రీల వరకు పడిపోతుంది. ఈ ప్రాంతం గుండా అటు పాకిస్తాన్‌లోకి, అక్కడి నుంచి ఇటు భారత్‌లోకి రావడం దాదాపు అసాధ్యం.

వేసవి కాలంలో పాకిస్తాన్ నుంచి టెర్రరిస్టులు సియాచిన్ ప్రాంతం గుండా కశ్మీర్‌లోకి ప్రవేశిస్తున్నారన్న ఆరోపణలతో భారత సైన్యం 1984, ఏప్రిల్ 13వ తేదీన ‘మేఘదూత్ ఆపరేషన్’ పేరిట సైనిక చర్యను చేపట్టింది. ఇక అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య సియాచిన్ యుద్ధం కొనసాగుతోంది. ఇరువైపుల సైనిక దళాలు దాదాపు 19,600 అడుగుల ఎత్తులో సైనిక శిబిరాలను ఏర్పాటు చేసుకొని కాపలాగాస్తున్నాయి. 2012లో హిమపాతం వల్ల 140 మంది పాక్ సైనికులు మరణించిన నేపథ్యంలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ పర్వేజ్ కయానీ సియాచిన్ ప్రాంతం నుంచి సైన్యాన్ని ఇరువైపుల ఉపసంహరించుకుందామన్న ప్రతిపాదన తీసుకొచ్చారు. ఇరు దేశాలకు పరస్పర విశ్వసనీయత లేకపోవడం, కవ్వింపు చర్యలకు పాల్పడుతుండడం వల్ల ఈ ప్రతిపాదన కార్యరూపానికి దారి తీయలేదు.

అందుకు భారత్ కూడా భారీ మూల్యమే చెల్లించాల్సి వస్తోంది. మన సైనికుల ప్రాణాలను కోల్పోవడమే కాకుండా రోజుకు మూడున్నర కోట్ల రూపాయలను అనవసరంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. సియాచిన్ లాంటి చిన్న సరిహద్దు సహస్యలను ముందుగా పరిష్కరించుకోవడం మున్ముందు సంక్లిష్ట సమస్యల పరిష్కారానికి దారితీయవచ్చని నేడు పది మంది భారత సైనికులు అమరులంటూ జోహార్లు అర్పించిన ప్రభుత్వ పెద్దలు గ్రహించాలి.

మరిన్ని వార్తలు