మిలటరీ నవీకరణకు 9.32 లక్షల కోట్లు

10 Sep, 2019 03:45 IST|Sakshi

కేంద్రం భారీ ప్రణాళిక

ఫైటర్‌ జెట్లు, యుద్ధ నౌకలు, సబ్‌మెరైన్ల కొనుగోలుకు నిర్ణయం

న్యూఢిల్లీ: ఓవైపు పాకిస్తాన్, మరోవైపు చైనా నుంచి భద్రతాపరమైన సవాళ్లు ఎదురవుతున్న వేళ భారత్‌ కీలక నిర్ణయం తీసుకుంది. సాయుధ బలగాల శక్తిసామర్థ్యాలను పెంపొందించేందుకు వీలుగా రాబోయే 5–7 ఏళ్లలో ఏకంగా రూ.9.32 లక్షల కోట్ల(130 బిలియన్‌ డాలర్ల)ను ఖర్చుపెట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు అధికారిక పత్రాన్ని విడుదల చేసింది. ఈ విషయమై కేంద్ర ఉన్నతాధికారి ఒకరు మట్లాడుతూ.. భారత సైన్యం, వాయుసేన, నౌకాదళంలో ఆధునీకరణ ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు కీలకమైన ఆయుధాలు, మిస్సైళ్లు, యుద్ధ విమానాలు, సబ్‌మెరైన్లు, యుద్ధ నౌకలను సమకూర్చుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ఇందులో భాగంగా పదాతి దళాలను ఆధునీకరించడంతో పాటు ఆర్మీ కోసం 2,600 పదాతిదళ పోరాట వాహనాలు(ఐఎఫ్‌వీ), 1,700 అత్యాధునిక పోరాట వాహనాలను సమకూర్చుకోనున్నట్లు పేర్కొన్నారు.
 
ఐఏఎఫ్‌కు 110 ఫైటర్‌ జెట్లు..
అలాగే వాయుసేన(ఐఏఎఫ్‌) కోసం 110 మల్టీరోల్‌ ఫైటర్‌ జెట్లను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఢిల్లీ, ముంబై సహా దేశంలోని ముఖ్యమైన నగరాలపై శత్రుదేశాల క్షిపణి దాడులు జరగకుండా గగనతలాన్ని సురక్షితంగా ఉంచేందుకు మరో మెగా ప్రాజెక్టుకు కేంద్రం శ్రీకారం చుట్టిందని సీనియర్‌ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అలాగే 5,000 కి.మీ దూరం లోని శత్రు లక్ష్యాలను ఛేదించే అణ్వస్త్ర సామర్థ్యమున్న ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణి ‘అగ్ని–5’ భారత అమ్ములపొదిలో చేరనుందన్నారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా