కరోనా ఎఫెక్ట్‌: రూ.10 లక్షల కోట్ల నష్టం

11 Jun, 2020 08:40 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి దేశ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసింది. కరోనా కట్టడి కోసం దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించారు. ఫలితంగా దేశం ఆర్థికంగా ఎంతో నష్టపోయింది. కరోనా కారణంగా భారత్‌ రూ.10 లక్షల కోట్ల నష్టాన్ని చవి చూడనున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలో కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ మాట్లాడుతూ.. ‘కరోనా వైరస్ సంక్షోభం కారణంగా భారత్ రూ .10 లక్షల కోట్ల ఆదాయాన్ని కోల్పోతుంది. పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. వచ్చే నెలలో జీతాలు చెల్లించడానికి కూడా కొన్ని రాష్ట్రాల వద్ద డబ్బు లేదు’ అని తెలిపారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘భారత ప్రభుత్వ ఆదాయం దెబ్బతిన్నది. మన దేశ జీడీపీ రూ .200 లక్షల కోట్లు. అందులో పది శాతం అంటే సుమారు 20 లక్షల కోట్ల రూపాయలు పరిశ్రమలు, రైతుల కోసం కేటాయించారు’ అని గడ్కరీ గత నెలలో ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీని ప్రస్తావించారు. రూ .10 లక్షల కోట్ల రెవెన్యూ లోటు ఉంది. కాబట్టి రూ .200 లక్షల కోట్లలో (జీడీపీ) రూ. 30 లక్షల కోట్లు ఈ విధంగా వెళితే.. ఎంత తీవ్రమైన పరిస్థితికి దారితీస్తుందో చూడండి’ అన్నారు. ప్రస్తుత పరిస్థితిని సానుకూలతతో పరిష్కరించుకోవలసి ఉంటుందన్నారు. ‘మనమందరం కఠినమైన సమయాన్ని, సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాము. ప్రతికూలత, నిరాశ, భయంతో మనం దాన్ని ఎదుర్కోలేము. ఆత్మవిశ్వాసం, సానుకూల వైఖరితో కరోనాపై పోరాడాలి’ అని గడ్కరీ పిలుపునిచ్చారు. (ఆశావహంగా ఫార్మా)

ఇదిలా ఉండగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ 5 శాతం తగ్గిపోతుందని ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్ అంచనా వేసింది. అయితే జీడీపీ వృద్ధి రేటు 2021-22లో 8.5 శాతంగా, 2022-23లో 6.5 శాతంగా ఉంటుందని తెలిపింది. దీర్ఘకాల లాక్‌డౌన్‌ వల్ల కుప్పకూలిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి కేంద్రం ఇప్పటికే పలు సడలింపులు ఇచ్చింది. అయితే కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టడానికి అనేక రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను తిరిగి అమలు చేసే యోచనలో ఉన్నాయని సదరు నివేదిక తెలిపింది. బుధవారం 9,985 కేసులు నమోదయ్యి.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 2.76 లక్షలకు చేరుకుంది. రాజకీయ, ఆర్థిక రాజధానులైన ఢిల్లీ, ముంబైలు ఒకే రోజులో 1,500కు పైగా కేసులను నమోదు చేశాయి. ఢిల్లీ ప్రభుత్వం జూలై 31 నాటికి రాష్ట్రంలో  కరోనా కేసులు 1.5 లక్షలకు పెరుగుతాయని అంచనా వేసింది. ప్రజలు నియమాలను పాటించకపోతే తిరిగి లాక్డౌన్ అమలు చేయవలసి ఉంటుందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే హెచ్చరించారు. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు