అయోధ్య తీర్పు : పాక్‌ స్పందనపై ఫైర్‌

10 Nov, 2019 11:03 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : రామజన్మభూమి-బాబ్రీమసీద్‌ వివాద కేసుపై సుప్రీం కోర్టు తీర్పు పట్ల పాకిస్తాన్‌ స్పందనను భారత్‌ తీవ్రంగా ఖండించింది. పాక్‌ స్పందన అవాంఛనీయం, అసందర్భమని తోసిపుచ్చింది. భారత అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుని విద్వేషపూరిత వాతావరణం వ్యాప్తిం చేసేందుకే పాకిస్తాన్‌ ఇలా వ్యవహరిస్తోందని దుయ్యబట్టింది. భారత్‌కు సంబంధించిన అంతర్గత వ్యవహారంపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు పట్ల పాక్‌ వ్యాఖ్యానించిన తీరు దురుద్దేశపూరితంగా ఉందని, అసందర్భంగా ఉందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రవీష్‌ కుమార్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. కర్తార్‌పూర్‌ కారిడార్‌ ప్రారంభోత్సవం సందర్భంగా పాక్‌ విదేశాంగ మంత్రి షా మహ్మద్‌ ఖురేషీ మాట్లాడుతూ సంతోషకర సమయాన సున్నితత్వం లేని వైఖరి చూపడం పట్ల విచారం వెలిబుచ్చుతున్నట్టు పేర్కొన్నారు. కాగా అయోధ్యలో వివాదాస్పద భూమిని రామజన్మ న్యాస్‌కు అప్పగిస్తూ మసీదుకు ప్రత్యామ్నాయంగా ఐదెకరాల స్థలం ఇవ్వాలని ఆదేశిస్తూ సుప్రీం కోర్టు శనివారం చారిత్రక తీర్పును వెల్లడించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు