స్వదేశీ సీకర్‌తో ‘బ్రహ్మోస్‌’ పరీక్ష సక్సెస్‌

23 Mar, 2018 00:51 IST|Sakshi

అభివృద్ధి చేసిన డీఆర్‌డీవో శాస్త్రవేత్తలు

అభినందనలు తెలిపిన రక్షణమంత్రి సీతారామన్‌  

సాక్షి, హైదరాబాద్‌/పోఖ్రాన్‌/న్యూఢిల్లీ: రక్షణ రంగంలో స్వావలంబన దిశగా భారత్‌ మరో ముందడుగు వేసింది. అత్యాధునిక బ్రహ్మోస్‌ సూపర్‌సోనిక్‌ క్రూయిజ్‌ క్షిపణులకు అనువైన ఆర్‌ఎఫ్‌ సీకర్ల తయారీలో భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) శాస్త్రవేత్తలు విజయం సాధించారు. రాజస్తాన్‌లోని పోఖ్రాన్‌ టెస్ట్‌రేంజ్‌లో గురువారం ఉదయం ఈ సీకర్లను అమర్చిన బ్రహ్మోస్‌ క్షిపణిని విజయవంతంగా పరీక్షించారు. క్షిపణులు తమ లక్ష్యాన్ని కచ్చితత్వంతో గుర్తించడంలో ఈ సీకర్లు అత్యంత కీలకమైనవి.

హైదరాబాద్‌ శివార్లలో ఉన్న డీఆర్‌డీవో కేంద్రంలో తయారైన ఈ సీకర్లను గురువారం తొలిసారి బ్రహ్మోస్‌ క్షిపణిలో ప్రయోగించి మంచి ఫలితాలు రాబట్టారు. మూడు నెలల క్రితం ఈ క్షిపణులను సుఖోయ్‌ –30 యుద్ధవిమానాల ద్వారా విజయవంతంగా పరీక్షించిన విషయం తెలిసిందే. 2.5 టన్నుల బరువుతో 8.4 మీటర్ల పొడవుండే బ్రహ్మోస్‌ 300 కేజీల వార్‌హెడ్లను మోసుకుపోగలదు. భూమి, సముద్రం, ఆకాశం నుంచి ప్రయోగించగల ఈ క్షిపణి 290 కి.మీ పరిధిలోని లక్ష్యాలను ఛేదించగలదు. గంటకు 3457.44 కి.మీ(2.8 మ్యాక్‌) వేగంతో దూసుకెళ్లే ఈ క్షిపణిని గంటకు 6,174 కి.మీ(5 మ్యాక్‌) వేగంతో వెళ్లేలా ఇటీవల అప్‌గ్రేడ్‌ చేశారు. గతేడాది భారత్‌ మిసైల్‌ టెక్నాలజీ కంట్రోల్‌ రెజీమ్‌(ఎంటీసీఆర్‌)లో చేరిన నేపథ్యంలో బ్రహ్మోస్‌ పరిధిని 400 కిలోమీటర్లకు పెంచడంపై శాస్త్రవేత్తలు ప్రస్తుతం దృష్టి సారించారు.

స్వావలంబన దిశగా..
రక్షణ రంగంలో స్వావలంబన అన్నది భారత్‌ చిరకాల వాంఛ. పోఖ్రాన్‌లో అణు పరీక్షలు నిర్వహించడంతో అగ్రరాజ్యాలు భారత్‌కు సాంకేతిక బదిలీపై ఆంక్షలు విధించాయి. దీంతో దేశరక్షణకు సంబంధించి పరిజ్ఞానాన్ని సొంతంగా అభివృద్ధి చేసుకోవాలని భారత్‌ నిర్ణయించింది. ఈ దిశగా ప్రయత్నాలు ప్రారంభించినప్పటకీ అవి పూర్తిస్థాయిలో సత్ఫలితాలు ఇవ్వలేదు. ఇప్పటికీ మనం క్షిపణులకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని, విడిభాగాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం.

ఈ నేపథ్యంలో స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన ఆర్‌ఎఫ్‌ సీకర్ల ద్వారా బ్రహ్మోస్‌ క్షిపణులను ప్రయోగించడం ప్రాధాన్యత సంతరించుకుంది. సరిహద్దులో పాకిస్తాన్, చైనాలు కయ్యానికి కాలు దువ్వుతున్న నేపథ్యంలో బ్రహ్మోస్‌ క్షిపణుల్ని సుఖోయ్‌–30 యుద్ధవిమానాలకు అమర్చడం సరైన నిర్ణయమేనని రక్షణరంగ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు స్వదేశీ సీకర్‌ అమర్చిన బ్రహ్మోస్‌ పరీక్ష విజయవంతం కావడంపై రక్షణమంత్రి నిర్మలా సీతారామన్‌ డీఆర్‌డీవో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు.  

మరిన్ని వార్తలు