అగ్ని–5 గ్రాండ్‌ సక్సెస్‌

4 Jun, 2018 01:41 IST|Sakshi
నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్తున్న అగ్ని–5

5 వేల కి.మీ దూరంలోని లక్ష్యాలను ఛేదించగల బాలిస్టిక్‌ క్షిపణి

అత్యాధునిక సాంకేతికత దీని సొంతం

బాలసోర్‌: దేశీయంగా అభివృద్ధి చేసిన, అణ్వాయుధాలను మోసుకెళ్లే సామర్థ్యమున్న అత్యాధునిక అగ్ని–5 ఖండాంతర బాలిస్టిక్‌  క్షిపణిని రక్షణ శాఖ ఆదివారం విజయవంతంగా పరీక్షించింది. 5 వేల కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఇది ఛేదించగలదు. ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే ఈ క్షిపణిని ఒడిశాలోని ఏపీజే అబ్దుల్‌ కలాం దీవి నుంచి ఉదయం 9.45 గంటలకు మొబైల్‌ లాంచర్‌ ద్వారా ప్రయోగించి పరీక్షించామని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. క్షిపణి పరీక్ష విజయవంతం అవడంతో రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) శాస్త్రజ్ఞులు, సిబ్బందికి రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ అభినందనలు చెప్పారు.

2012 ఏప్రిల్‌ 19 నుంచి ఇప్పటివరకు మొత్తంగా ఆరుసార్లు అగ్ని–5 క్షిపణిని పరీక్షించగా, అన్నిసార్లూ విజయవంతంగా క్షిపణి తన లక్ష్యాన్ని ఛేదించింది. ఇప్పటికే అగ్ని–1 (700 కిలోమీటర్ల పరిధి), అగ్ని–2 (2 వేల కి.మీ), అగ్ని–3 (2,500 కి.మీ) క్షిపణులు రక్షణ శాఖ వద్ద ఉన్నాయి. అగ్ని–5 పరిధిని 5వేల కిలోమీటర్లకు పెంచడంతోపాటు దిక్సూచి వ్యవస్థ, ఇంజిన్, వార్‌హెడ్‌ తదితరాలకు సంబంధించి అత్యాధునిక సాంకేతికతను జోడించి దీనిని అభివృద్ధి చేశారు. అన్ని వ్యవస్థలూ సరిగ్గా పనిచేస్తున్నట్లు పరీక్షలో తేలిందని ఓ అధికారి తెలిపారు. క్షిపణి కచ్చితంగా సరైన మార్గంలోనే వెళ్లేలా   చేయడం కోసం రింగ్‌ లేజర్‌ గైరో ఆధారిత దిక్సూచి వ్యవస్థను, మిసైల్‌లో ప్రత్యేక కంప్యూటర్‌ను వినియోగించారు.   

చైనా ముందు దిగదుడుపే
అగ్ని–5 క్షిపణి ప్రస్తుతం భారత్‌ వద్ద ఉన్నవాటిల్లోకెల్లా అత్యాధునికమైనదే. అయితే చైనా క్షిపణులతో పోలిస్తే దీని సామర్థ్యాలు చాలా తక్కువనే చెప్పాలి. చైనా వద్దనున్న ‘సీఎస్‌ఎస్‌–10 మోడ్‌ 2’            క్షిపణి పరిధి 11,200 కిలో మీటర్లు. అమెరికాలోని దాదాపు అన్ని ప్రాంతాలకు ఇది చేరుకోగలదు. డీఎఫ్‌–41 అనే మరో క్షిపణిని కూడా చైనా అభివృద్ధి చేస్తోంది. ఇది ఒకేసారి 10 అణు వార్‌హెడ్‌లను మోసుకెళ్లగలదు. దీని పరిధి 12 వేల నుంచి 15 వేల కిలోమీటర్ల   వరకు ఉండనుందని అంచనా. డీఎఫ్‌–41 క్షిపణితో ప్రపంచంలోని ఏ దేశంపైనైనా దాడి చేయగల సామర్థ్యం చైనా సొంతం కానుంది.

‘అగ్ని–5’ ప్రత్యేకతలు
► ఇంటిగ్రేటెడ్‌ గైడెడ్‌ మిస్సైల్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌లో భాగంగా డీఆర్‌డీవో ఈ క్షిపణిని పూర్తిగా దేశీయంగా అభివృద్ధి చేసింది.
► 17 మీటర్ల పొడవు, 2 మీటర్ల వెడల్పు, 50 ట న్నుల బరువుండే ఈ అత్యాధునిక క్షిపణి 1500 కేజీల అణు వార్‌హెడ్‌లను మోసుకెళ్లగలదు.
► ఇది సైన్యానికి అందుబాటులోకి వస్తే.. 5000–5500 కిలో మీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగల ఖండాతర క్షిపణులను కలిగి ఉన్న అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, బ్రిటన్‌ల సరసన భారత్‌ చేరుతుంది.
► అగ్ని–1, అగ్ని–2, అగ్ని–3 క్షిపణులు ఇప్పటికే భారత సైన్యంలో చేరి సేవలందిస్తున్నాయి.  
► ప్రస్తుతం భారత్‌కు ఉన్న అన్ని క్షిపణిల్లోకెల్లా అత్యధిక పరిధి కలిగిన క్షిపణి ఇదే.
► తూర్పున చైనా మొత్తం, పడమరన యూరప్‌ మొత్తం దీని పరిధిలోకి వస్తుంది. ఆసియా, యూరప్‌ల్లోని అన్ని ప్రాంతాలు, ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాలపై దాడులు చేయగలదు.
► మొత్తంగా 800 కిలో మీటర్ల ఎత్తు వరకు వెళ్లి అక్కడి నుంచి మళ్లీ భూమిపైకి తిరిగొచ్చి లక్ష్యాలను ఢీకొట్టగలిగే సామర్థ్యం ఉంది. 

మరిన్ని వార్తలు