స్క్రామ్‌జెట్‌ పరీక్ష సక్సెస్‌

13 Jun, 2019 03:11 IST|Sakshi

బాలాసోర్‌: హైపర్‌సోనిక్‌ టెక్నాలజీ డెమానిస్ట్రేటర్‌ వెహికల్‌(హెచ్‌ఎస్‌టీడీవీ) అనే మానవరహిత విమానాన్ని భారత్‌ విజయవంతంగా పరీక్షించింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ఈ స్క్రామ్‌జెట్‌ విమానాన్ని ఒడిశాలోని కలామ్‌ ద్వీపం నుంచి బుధవారం ఉదయం డీఆర్‌డీవో శాస్త్రవేత్తలు ప్రయోగించారు. హెచ్‌ఎస్‌టీడీవీ ఓ పునర్వినియోగ వాహనమనీ, దీంతో ఉపగ్రహాలను చవకగా అంతరిక్ష కక్ష్యలోకి ప్రవేశపెట్టవచ్చని రక్షణరంగ నిపుణుడొకరు చెప్పారు.

దీంతో శత్రుదేశాలపై క్రూయిజ్‌ క్షిపణులనూ ప్రయోగించవచ్చన్నారు. హెచ్‌ఎస్‌టీడీవీ 20 సెకన్లలో 32.5 కి.మీ ఎత్తుకు చేరుకోగలదనీ, గంటకు 7,408 కి.మీ(6 మ్యాక్‌ల) వేగంతో దూసుకుపోగలదన్నారు. తాజాగా ప్రయోగంతో ఇలాంటి సాంకేతికత ఉన్న అతికొద్ది దేశాల సరసన భారత్‌ చేరిందన్నారు. హెచ్‌ఎస్‌టీడీ తొలుత ఘనఇంధన మోటార్‌తో నిర్ణీత ఎత్తులోకి చేరుకుంటుంది. సరైన వేగం అందుకున్నాక హెచ్‌ఎస్‌టీడీలోని క్రూయిజ్‌ వాహనం విడిపోతుందనీ, స్క్రామ్‌జెట్‌ ఇంజిన్‌ను మండించడం ద్వారా ఇది లక్ష్యం దిశగా దూసుకెళుతుందని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు