అగ్ని–5 పరీక్ష విజయవంతం

19 Jan, 2018 02:43 IST|Sakshi

అత్యాధునిక సాంకేతికతతో తయారీ

5వేల కిలోమీటర్లు దూసుకుపోయే సామర్థ్యం

అబ్దుల్‌ కలాం దీవి నుంచి పరీక్ష

 

బాలాసోర్‌/చెన్నై: భారత్‌ మరో విజయం సాధించింది. అణ్వాయుధాలను మోసుకెళ్లే సామర్థ్యమున్న బాలిస్టిక్‌ క్షిపణి అగ్ని–5 పరీక్ష విజయవంతమైంది. ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే ఈ క్షిపణి 5 వేల కిలోమీటర్ల దూరానికి పైగా ఉన్న లక్ష్యాన్ని చేధించగలదు. ఎన్నో అత్యాధునిక సాంకేతికతలున్న ఈ క్షిపణి ప్రయోగంవిజయవంతం కావడంతో క్షిపణి తయారీలో దేశీయ సాంకేతికతకు నూతనోత్సాహం వచ్చింది. అన్ని రాడార్లు, ట్రాకింగ్‌ వ్యవస్థలు క్షిపణి పనితీరును పరిశీలించినట్లు రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి.

పరీక్ష పూర్తిగా విజయవంతమైందని, 19 నిమిషాల పాటు ప్రయాణించిన క్షిపణి 4,900 కిలోమీటర్లు దూసుకెళ్లిందని వెల్లడించాయి. ఒడిశా తీరంలోని అబ్దుల్‌ కలాం దీవి నుంచి కానిస్టర్‌ ద్వారా గురువారం ఈ క్షిపణిని పరీక్షించారు. అగ్ని శ్రేణిలో ‘అగ్ని–5’మరింత ఆధునికమైంది. కొత్త సాంకేతికతలతో అభివృద్ధిచేశారు. విస్తారమైన నావిగేషన్‌ వ్యవస్థ (ఆర్‌ఐఎన్‌ఎస్‌), అత్యాధునికమైన మైక్రో నావిగేషన్‌ వ్యవస్థ (ఎంఐఎన్‌ఎస్‌)లు ఉండటం వల్ల ఈ క్షిపణి చాలా కచ్చితత్వంతో లక్ష్యాన్ని చేధించగలదు.

తమిళనాడు పాత్ర కీలకం..: అగ్ని–5 క్షిపణి పరీక్ష విజయవంతం కావడంలో తమిళనాడు పాత్ర మరువలేనిదని రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. బాలిస్టిక్‌ క్షిపణిలో అవసరమయ్యే ముఖ్యమైన పరికరాలు తమిళనాడు పరిశ్రమల నుంచే వచ్చాయని చెప్పారు. గురువారం చెన్నైలో జరిగిన రక్షణ పరిశ్రమల అభివృద్ధి సదస్సులో ఆమె పాల్గొన్నారు.  

అగ్ని శ్రేణిలో క్షిపణులు..
క్షిపణి లక్ష్యాన్ని చేధించగలిగే సామర్థ్యం,
♦  అగ్ని–1,700 కి.మీ.,
♦  అగ్ని–2, 2000 కి.మీ.,
♦  అగ్ని–3, 42,500 నుంచి 3,500 కి.మీ.,
♦  అగ్ని–5 5,000 కి.మీ.

మరిన్ని వార్తలు