ఒక్కరోజే 8171 కేసులు

2 Jun, 2020 10:47 IST|Sakshi

5598కి పెరిగిన కోవిడ్‌-19 మరణాలు

సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. తొలి లక్ష కేసులకు మూడున్నర మాసాలు పడితే.. రెండో లక్ష కేసులకు కేవలం 14 రోజులే పట్టింది. జనవరి 30న దేశంలో తొలి  కేసు నమోదవగా.. మే 7 నాటికి 52,952 కేసులు నమోదయ్యాయి. మే 19 నాటికి 1,01,139 కేసులు నమోదయ్యాయి. కానీ ఈ 14 రోజుల్లోనే ఈ సంఖ్య 2 లక్షలకు చేరువైంది. జూన్‌ 1 ఉదయం 8 గంటల సమయానికి 1,90,535 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీటిలో 93,322 కేసులు యాక్టివ్‌ కేసులు కాగా, మరో 91,818 కేసుల్లో బాధితులు కోలుకున్నారు. 5,394 మంది కోవిడ్‌ కారణంగా మరణించారు. ఒక వ్యక్తి తను పాజిటివ్‌ అని తెలిసేలోపే విదేశాలకు వెళ్లారు. గడిచిన నాలుగు రోజుల్లో సగటున రోజుకు 8 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. ఈ లెక్కన జూన్‌ 2వ తేదీ నాటికే రెండు లక్షల కేసులు నమోదు కానున్నాయి. మరణాల సంఖ్య గడిచిన నాలుగు రోజుల్లో రోజుకు సగటున 200 ఉంటోంది. మే 30న అత్యధికంగా 265 మరణాలు సంభవించాయి.


కేసుల సంఖ్యలో ఏడో స్థానం
కేసుల సంఖ్యలో మన దేశం ఏడో స్థానంలో ఉంది. కానీ మరణాల సంఖ్యలో టాప్‌ 10 జాబితాలో లేదు. కేసుల సంఖ్యలో టాప్‌10లో లేని దేశాలు మరణాల సంఖ్యలో మాత్రం టాప్‌10 జాబితాలో చోటు చేసుకున్నాయి. ఫ్రాన్స్, మెక్సికో, బెల్జియం, ఇరాన్, కెనడా, నెదర్లాండ్స్‌ వంటి దేశాలు మరణాల టాప్‌10 జాబితాలో ఉన్నాయి. ప్రతి మిలియన్‌ జనాభాకు కేసుల సంఖ్యలో కూడా మన దేశం టాప్‌ 10 జాబితాలో లేదు. అయితే గడిచిన 24 గంటల్లో అత్యధిక కేసులు నమోదైన దేశాల్లో బ్రెజిల్, అమెరికా, రష్యన్‌ ఫెడరేషన్‌తోపాటు ఇండియా కూడా ఉంది. గడిచిన 7 రోజుల్లో అత్యధిక కేసులు నమోదైన దేశాలు కూడా ఇవే. గడిచిన వారం రోజుల్లో అత్యధిక మరణాలు సంభవించిన దేశాల్లో భారత్‌ ఐదో స్థానంలో ఉంది.

మూడు రాష్ట్రాల్లోనే లక్షకు పైగా కేసులు
కేంద్ర ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం మూడు రాష్ట్రాల్లోనే లక్ష కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ రాష్ట్రాల్లో అత్యధికంగా కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 67,655, తమిళనాడులో 22,333, ఢిల్లీలో 19,844 కేసులు నమోదయ్యాయి. ఈ మూడు రాష్ట్రాల్లో మొత్తంగా ఇప్పటివరకు 1,09,832 కేసులు నమోదయ్యాయి. తదుపరి 16,779 కేసులతో గుజరాత్‌ నాలుగోస్థానంలో నిలిచింది.

అత్యధిక మరణాలు ఎక్కడ?
కేసుల సంఖ్యలో గుజరాత్‌ నాలుగో స్థానంలో ఉండగా.. మరణాల సంఖ్యలో మాత్రం రెండోస్థానంలో ఉంది. మహారాష్ట్రలో ఇప్పటివరకు 2286 మరణాలు సంభవించగా, గుజరాత్‌లో 1038 మంది మరణించారు. కేసుల సంఖ్యలో రెండోస్థానంలో ఉన్న తమిళనాడులో 173 మరణాలు సంభవించాయి. కేసుల సంఖ్యలో మూడోస్థానంలో ఉన్న ఢిల్లీలో 473 మంది చనిపోయారు. పశ్చిమ బెంగాల్‌లో కేవలం 5,501 కేసులే నమోదు కాగా.. 317 మంది మరణించారు.  మధ్యప్రదేశ్‌లో కూడా మరణాలు రేటు ఎక్కువగా ఉంది. కేసుల సంఖ్య కేవలం 8,089 ఉండగా.. మరణాలు మాత్రం 350 నమోదవడం గమనార్హం. యూపీలో నమోదైన కేసుల సంఖ్య 7,823 కాగా, మరణాల సంఖ్య మాత్రం 213గా ఉంది. రాజస్థాన్‌లో కూడా కేసులు 8,831 ఉండగా.. మరణాలు మాత్రం 194 ఉన్నాయి.

చదవండి : క‌రోనా సోకిన 63 ఏళ్ల వ్య‌క్తి ఆత్మ‌హ‌త్య‌

మరిన్ని వార్తలు