కరోనా: విదేశీ​ విరాళాలు కోరనున్న కేంద్రం!

2 Apr, 2020 12:34 IST|Sakshi
ఫైల్‌ ఫోటో

సాక్షి, న్యూఢిల్లీ: చైనాలో ఉద్భవించిన మహమ్మారి కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలపై పంజా విసురుతోంది. దీని దెబ్బకు ప్రపంచదేశాలు అతలాకుతలం అవుతున్నాయి. ప్రస్తుతం భారత్‌లో కోవిడ్‌-19 బారిన పడినవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాణాంతకమైన కరోనాను ఎదుర్కొవడంలో భాగంగా లాక్‌డౌన్‌ విధించాయి. ఇక కరోనాను ఎదుర్కొంటున్న క్లిష్ట సమయంలో పేద ప్రజలను ఆదుకోవడానికి ప్రాముఖుల నుంచి సామాన్యుల వరకు తమకు తోచిన విరాళాలు అందించాలని ప్రధాని నరేంద్రమోదీ కోరారు. అందులో భాగంగానే ‘ పీఎం కేర్స్‌’  అనే అకౌంట్‌ను రూపొందించారు. (కరోనా: ‘చైనా నమ్మదగ్గ భాగస్వామి కాదు’)

దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు ముందుకు వచ్చి భూరి విరాళాలను అందించి తమ ఔదర్యాన్ని చాటుకుంటున్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా స్వదేశంలో ఉన్న ప్రముఖులతో పాటు విదేశాల్లో ఉన్న భారత సంతతికి  చెందిన వారిని కూడా విరాళాలు అందిచాలని కోరనున్నట్లు తెలుస్తోంది.  కోవిడ్‌-19 నేపథ్యంలో ప్రపంచదేశాల్లో ఉన్న భారతీయుల కోసం విదేశాంగ శాఖ ప్రత్యేక సహాయక కేంద్రాన్ని మార్చి 16న ఏర్పాటు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సెల్‌కు 3300 ఫోన్‌ కాల్స్‌, 2200  ఈ-మెయిల్స్‌ వచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు  భారత సంతతికి చెందిన మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల సతీమణి అనుపమ నాదెళ్ల ‘పీఎం కేర్స్’ ఫండ్‌కు రూ. 2 కోట్ల విరాళాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. భారత్‌లో ఇప్పటి వరకు 1980 మంది కరోనా బారిన పడగా.. 59 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే 144 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు.

మరిన్ని వార్తలు