పాక్‌ చర్యలపై స్పందించిన భారత విదేశీ వ్యవహారాల శాఖ

9 Aug, 2019 19:32 IST|Sakshi

న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌ విభజన, ఆర్టికల్‌ 370 రద్దు తదితర పరిణామాల నేపథ్యంలో పాకిస్తాన్ తీసుకుంటున్న చర్యలపై భారత ప్రభుత్వం మరోసారి స్పందించింది. ఇది భారత్‌ అంతర్గత వ్యవహారమని.. దీన్ని అవకాశంగా తీసుకుని ఎలాంటి భయానక వాతావరణం సృష్టించవద్దని పాక్‌ను హెచ్చరించింది. ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత పాక్‌ పలు దుందుడుకు చర్యలకు పాల్పడగా.. తాజాగా ఇరుదేశాల మధ్య నడిచే థార్‌ ఎక్స్‌ప్రెస్‌ను కూడా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అది రెండు దేశాల మధ్య నడిచే చివరి రైలు లింక్‌.

దీనిపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రవీశ్‌ కుమార్ మాట్లాడుతూ.. ‘భారత్‌తో ఎలాంటి సంప్రదింపులు జరపకుండా పాక్‌ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటోంది. చూడబోతే ఆ దేశం ఆందోళనకు గురవుతున్నట్లు కనిపిస్తోంది. పాక్‌ తీసుకొనే నిర్ణయాలను ఓసారి సమీక్షించుకోవాలని కోరుతున్నాం. ద్వైపాక్షిక సంబంధాల్లోని ఒడిదుడుకులను ప్రపంచానికి చూపాలన్న తీరే పాక్‌ చర్యల్లో ప్రధానంగా కనిపిస్తోంది. పాక్ వాస్తవాలను అంగీకరించే సమయం ఆసన్నమైంది. ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం మానేయాలి’ అని సూచించారు.

పాకిస్తాన్‌లోని భారత రాయబారి గురించి ప్రశ్నించగా.. ‘ప్రస్తుతం ఆయన ఢిల్లీలో లేరు. ఆయనను వెనక్కి పంపే నిర్ణయాన్ని సమీక్షించుకోవాలని పాకిస్తాన్‌ను కోరాం. ఆయన తిరిగి వచ్చే సమయంపై తరవాత నిర్ణయం తీసుకుంటాం’ అని వెల్లడించారు. అలాగే పాకిస్తాన్ తన గగనతలాన్ని మూసివేయలేదని, విమానాల రాకపోకలకు అందుబాటులోనే ఉందని ఆయన తెలిపారు. పాక్‌ ఏకపక్షంగా తీసుకుంటున్న చర్యలను మనదేశం తప్పుపడుతోన్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు