బహుళ ప్రయోజనకర వ్యాక్సిన్‌కు కసరత్తు

17 Apr, 2020 19:38 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కుష్టువ్యాధిని నిర్మూలించి రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో గతంలో నిరూపితమైన బహుళ ప్రయోజన వ్యాక్సిన్‌ కరోనా మహమ్మారి నియంత్రణకు ఉపకరిస్తుందా అని భారత శాస్త్రవేత్తలు పరీక్షించనున్నారు. భారత ఔషధ నియంత్రణ మండలి అనుమతితో కుష్టు వ్యాధిపై విజయవంతంగా ప్రయోగించిన ఎండబ్ల్యూ వ్యాక్సిన్‌పై పరీక్షలు ప్రారంభించామని శాస్ర్తీయ, పారిశ్రామిక పరిశోధనా మండలి (సీఎస్‌ఐఆర్‌) డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ శేఖర్‌ మందే వెల్లడించారు.

వ్యాక్సిన్‌ తయారీ సుదీర్ఘ ప్రక్రియని..కుష్టు వ్యాధిని సమర్ధంగా అరికట్టిన వ్యాక్సిన్‌పై పరిశోధన సాగుతోందని, మరో రెండు అనుమతుల కోసం తాము వేచిచూస్తున్నామని ఆయన చెప్పారు. అనుమతులు రాగానే పరీక్షలను చేపట్టి ఆరువారాల్లో ఫలితాలను రాబడతామని వెల్లడించారు. కోవిడ్‌-19పై వ్యాక్సిన్‌ తయారీకి ఏడాదికి పైగా సమయం పడుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) పేర్కొన్న సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా 21 లక్షల మందికి సోకిన ఈ మహమ్మారి నిరోధానికి అమెరికా, చైనా సహా పలు దేశాలు వ్యాక్సిన్‌ రూపొందించేందుకు కసరత్తును వేగవంతం చేశాయి.

చదవండి : వ్యాక్సిన్‌.. వెలకట్టలేనిది

మరోవైపు కరోనా మహమ్మారి ఎక్కడ పుట్టింది, దాని వ్యాప్తికి సంబంధించిన పూర్తి ప్రయాణాన్ని అన్వేషించేందుకు జన్యు సీక్వెన్సింగ్‌పై భారత్‌ పరిశోధన చేపట్టిందని డాక్టర్‌ శేఖర్‌ పేర్కొన్నారు. వైరస్‌ స్వభావం, మహమ్మారిపై ప్రయోగించే మందులను తట్టుకునేలా నిరోధక శక్తిని అది పొందుతుందా అనే విషయాలు దీనిద్వారా అర్థం అవుతాయని ఓ వార్తా ఛానెల్‌తో మాట్లాడుతూ ఆయన చెప్పారు.

>
మరిన్ని వార్తలు