ప్రపంచంలో భారత్‌ మూడో నిఘా దేశం

22 Oct, 2019 13:48 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా గుర్తింపు పొందిన భారత్, పౌరులపై నిఘా కొనసాగిస్తున్న ప్రపంచ దేశాల్లో మూడవ దేశంగా కూడా గుర్తింపు పొందింది. రష్యా, చైనాల తర్వాత ఆ స్థానం భారత్‌దేనని బ్రిటన్‌లోని ‘క్రాంపిటెక్‌’ అధ్యయన సంస్థ ఓ నివేదికలో పేర్కొంది. వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన ఐదు పాయింట్లలో భారత్‌కు 2.5 పాయింట్లు లభించాయి. వ్యక్తిగత స్వేచ్ఛ తక్కువున్న దేశాల్లో చైనా, రష్యాల తర్వాత భారత దేశమే. ఆ తర్వాత థాయ్‌లాండ్, మలేసియా దేశాలుండగా, 2.7 పాయింట్లతో అమెరికా ఏడవ స్థానంలో కొనసాగుతోంది. అమెరికాలో పౌరులు ప్రైవసీకి ముప్పు ఎక్కువగా ఉండడానికి కారణం అక్కడ పౌరుల బయోమెట్రిక్‌ సమాచారం డాటా బేస్‌ ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ అవడంతోపాటు వివిధ సంస్థల ద్వారా ఆ డేటా లీక్‌ కూడా ఎక్కువగానే జరుగుతోంది.

ప్రపంచంలోని మొత్తం 47 దేశాలను ఎంపిక చేసుకొని, ఆ దేశాల్లోని బయోమెట్రిక్‌ డేటా ఆప్‌డేటింగ్, పౌరుల డేటాకు అక్కడి ప్రభుత్వాలు ఏ మేరకు అందుబాటులో ఉన్నాయి ? డేటా పరిరక్షణకు రాజ్యాంగపరంగా, చట్టపరంగా ఉన్న రక్షణలు ఏమిటీ? అన్న అంశాల ప్రాతిపదికన ర్యాంకింగ్‌లు కేటాయించినట్లు క్రాంపిటెక్‌ తెలియజేసింది. ప్రజల డెటా పరిరక్షణకు యూరప్‌ దేశాల్లో ప్రత్యేక చట్టాలు ఉన్నప్పటికీ ప్రజల ప్రైవసీకి ప్రాధాన్యత తక్కువగానే ఉంటోంది.

భారత్‌లో ప్రజల డేటా పరిరక్షణకు ప్రత్యేక చట్టాలు లేకపోయినా ప్రైవసీ అనేది రాజ్యాంగంలోని ప్రాథిమిక హక్కుగా కొనసాగుతోంది. అయినప్పటికీ భారత్‌లో ప్రైవసీకి రక్షణ లేకపోవడానికి పలు కారణాలు ఉన్నాయి. ఆధార్‌ గుర్తింపు కార్డు కింద దాదాపు 123 కోట్ల మంది డేటా ఒకే చోటా నిక్షిప్తమై ఉంది. ఈ డేటా పూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి అందుబాటులో ఉంది. ఆ డేటా రక్షణకు ప్రత్యేక చట్టాలేమీ లేవు. వాట్సాప్‌ లాంటి సోషల్‌ మీడియాలకు కూడా ప్రైవసీ లేదు. ఎవరు, ఏ సందేశం పంపారో సులభంగానే తెలుసుకోవచ్చు. సీసీటీవీ కెమేరాల ద్వారా సమాచార మార్పిడికి పటిష్టమైన చట్టాలు లేవు. వీటిలోని సమాచారం కూడా సులభంగానే లీక్‌ అవుతుంది. ప్రజల డేటా పంపిణీ, పర్యవేక్షణకు భారత్‌కు దాదాపు పది దేశాలతో ఒప్పందం ఉంది. ఇన్ని కారణాల వల్ల భారత్‌లో ప్రైవసీ తక్కువే!

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా