ఆరోగ్యానికి ‘టెన్‌’షన్‌

24 Jan, 2019 01:33 IST|Sakshi

పది ముప్పులను గుర్తించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ

ఆరోగ్య పరిరక్షణ కోసం పంచవర్ష వ్యూహం

యాంటీబయోటిక్స్‌ వినియోగంలో భారత్‌ టాప్‌

ఇది ప్రమాదమే అంటున్న డబ్ల్యూహెచ్‌ఓ

శాస్త్ర సాంకేతికత, విజ్ఞానం పెరుగుతున్న కొద్దీ ఆరోగ్య సమస్యలూ పెరిగిపోతున్నాయ్‌. మొండిరోగాలకు చికిత్స అందుబాటులోకి వస్తున్నా.. ప్రాణాంతక రోగాలూ పెరిగిపోతున్నాయ్‌. ఈ నేపథ్యంలో మానవాళి ఆరోగ్య పరిరక్షణకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) నడుం బిగించింది. 2019లో ప్రపంచవ్యాప్తంగా 300కోట్ల మంది ఆరోగ్య సంరక్షణ కోసం ఐదేళ్ల వ్యూహాత్మక ప్రణాళికను ప్రారంభించింది. సార్వత్రిక ఆరోగ్య పథకాల కింద 100 కోట్ల మంది లబ్ధి పొందేలా ఈ ప్రణాళికను రచించింది. అత్యవసర చికిత్సలందించడం ద్వారా మరో 100 కోట్ల మందిని కాపాడటం, ఇంకో 100 కోట్ల మంది ఆయురారోగ్యాలతో వర్ధిల్లేలా చేయడమే ఈ ప్రణాళిక లక్ష్యం. 2019 సంవత్సరంలో డబ్ల్యూహెచ్‌వోతోపాటుగా ఎన్జీవోలు దృష్టి సారించాల్సిన పది ముప్పులను గుర్తించడం జరిగింది. 

1 వాయు కాలుష్యం,వాతావరణ మార్పు
వాయు కాలుష్యం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఏటా 70 లక్షల మంది చనిపోతున్నారు. మరో వంద కోట్లమందికి పైగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. గాలి కాలుష్యానికి సంబంధించి సురక్షిత స్థాయి అంటూ లేదు. కాలుష్యం ఏమాత్రం ఉన్నా అది ఆరోగ్యసమస్యలకు దారితీస్తుంది. అందుకే.. వాయు కాలుష్యం ‘సరికొత్త పొగాక’ంటూ డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ ట్రెడాస్‌ అధన్మన్‌ అభివర్ణించారు. 

2 ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ లేమి
భారతదేశంలో చాలా చోట్ల ప్రజలకు ప్రాథమిక ఆరోగ్య సదుపాయాలు అందుబాటులో లేవని ఇండియా స్పెండ్‌ నివేదిక వెల్లడించింది. ఆరోగ్యంగా ఉండడమన్నది కేవలం రోగాలు రాకుండా ఉండేందుకు మాత్రమే కాదు. కనీస వైద్య సదుపాయం ప్రజల హక్కు 40 ఏళ్ల క్రితమే 1978 నాటి ‘అల్మా–అటా డిక్లరేషన్‌’ ప్రకటించింది. 2018 అక్టోబర్‌ 26న ఈ డిక్లరేషన్‌ను పునరుద్ఘాటిస్తూ 197 దేశాలు సంతకాలు చేశాయి. సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ సాధించేందుకు ప్రాథమిక ఆరోగ్య సంరక్షణను పటిష్టం చేస్తామని ఆ దేశాలు ప్రతినబూనాయి. 

3 ఇన్‌ఫ్లూయెంజా (ఫ్లూ వైరస్‌)  
ఈ వైరస్‌ ఎవరిపై ఎప్పుడు విజృంభిస్తుందో అంచనాకు చిక్కడం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేసింది. వర్ధమాన దేశాల్లో ఈ వ్యాధి వైరస్‌ నిర్మూలనకు డబ్ల్యూహెచ్‌వో వివిధ దేశాలతో కలిసి ఉమ్మడి కార్యక్రమాన్ని చేపట్టింది. 

4 ఆరోగ్య సదుపాయాల లేమి
ప్రపంచ జనాభాలో 22% మంది సరైన వైద్యసదుపాయాలు అందని ప్రాంతాల్లో ఉన్నారు. వీరికి ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కూడా అందడం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. దుర్భిక్షం, కరువు, అంతర్గత ఘర్షణల కారణంగా వీరు కనీస ఆరోగ్య సంరక్షణ పొందలేకపోతున్నారని, ఫలితంగా వివిధ వ్యాధులబారిన పడుతున్నారని తెలిపింది. 

5 యాంటీబయోటిక్‌లు పనిచేయకపోవడం
రోగాల నివారణ కోసం అధిక మోతాదులో యాంటీబయోటిక్స్‌ను వాడటం వల్ల కొంత కాలానికి రోగ కారక క్రిములు వాటిని తట్టుకునే శక్తిని సంపాదించుకుంటాయి. ప్రపంచంలో యాంటీబయోటిక్‌లను దుర్వినియోగం చేస్తున్న దేశాల్లో భారత్‌ అగ్రస్థానంలో ఉంది. 2000–2015 మధ్య కాలంలో భారత్‌లో యాంటీబయోటిక్‌ల వినియోగం 103% పెరిగిందని ‘ప్రొసీడింగ్స్‌ ఆఫ్‌ ద నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌’ (పీఎన్‌ఏఎస్‌) నివేదిక పేర్కొంది. ప్రస్తుతం మన దేశంలో వివిధ ఔషధాలను తట్టుకునే బ్యాక్టీరియా విస్తరిస్తోందని ఆ నివేదిక వెల్లడించింది. 

6 ఎబోలా వంటి ప్రాణాంతక వ్యాధులు
2018 నవంబర్‌లో కాంగోలో ఎబోలా వ్యాధి ప్రబలి 426 మంది చనిపోయారు. కాంగోకు ఎబోలా ముప్పు పొంచి ఉందని 2018 మేలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. పెద్ద సంఖ్యలో ప్రజల ప్రాణాలు తీసే ఎబోలా వంటి వ్యాధులను డబ్ల్యూహెచ్‌వో ముందే గుర్తించి హెచ్చరిస్తోంది. 

7 అంటువ్యాధులు కానివి
ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల మంది ఈరకమైన వ్యాధులకు గురవుతున్నారు. బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు ఏ వయసులోనైనా ఈ వ్యాధులు రావచ్చునని డబ్ల్యూహెచ్‌వో ఓ నివేదికలో పేర్కొంది. గుండె జబ్బులు, కేన్సర్, మధుమేహం, ఊపిరితిత్తుల సమస్యలు, మానసిక అనారోగ్యం వంటివి ఈ కోవలోకి వస్తాయి. వీటివల్ల ఏటా 4.1 కోట్ల మంది చనిపోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏటా సంభవించే మరణాల్లో 71% వాటా ఈ వ్యాధులదేనని ఆ నివేదిక తెలిపింది. మద్యం, పొగాకు వినియోగాన్ని మానేయడం, శారీక శ్రమ/వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వంటి జాగ్రత్తలతో ఈ వ్యాధులకు దూరంగా ఉండొచ్చు. 

8 డెంగ్యూ
ప్రపంచ జనాభాలో సగానికిపైగా డెంగ్యూ బారిన పడే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. ఏటా 5 నుంచి 10 కోట్ల మంది డెంగ్యూ బారిన పడుతున్నట్లు వెల్లడించింది. 2020 నాటికి డెంగ్యూ మరణాలను 50% తగ్గించేందుకు డబ్ల్యూహెచ్‌వో ఓ వ్యూహాన్ని అమలుపరుస్తోంది. 

9 హెచ్‌ఐవీ
ఎయిడ్స్‌గా పిలిచే మహమ్మారి హెచ్‌ఐవీ నివారణకు ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయి. 2030 నాటికి ఎయిడ్స్‌ రహిత ప్రపంచంగా అన్ని దేశాలు కృషిచేస్తున్నాయని యునిసెఫ్‌ గతేడాది నివేదికలో పేర్కొంది. 2018–2030 మధ్య కాలంలో ప్రపంచ వ్యాప్తంగా 3.6 లక్షల మంది ఎయిడ్స్‌తో మరణించే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేసింది. తగిన నివారణ చర్యలు తీసుకుంటే ఏటా 20 లక్షల మందిని ఈ వ్యాధి బారిన పడకుండా కాపాడొచ్చని పేర్కొంది. 

10 టీకాలంటే భయం 
వివిధ వ్యాధుల నివారణకు ముందస్తుగా టీకాలు వేయడం సాధారణం. అయితే.. చాలా మంది అపోహలు, భయాల వల్ల టీకాలు వేయించుకోవడానికి వెనకాడుతున్నారని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. టీకాల ద్వారా ఏటా 20–30 లక్షల మరణాలను నివారించవచ్చని పేర్కొంది. 2019లో హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ ద్వారా ప్రపంచవ్యాప్తంగా సెర్వికల్‌ కేన్సర్‌ను రూపుమాపాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రణాళికలు వేస్తోంది. 

మరిన్ని వార్తలు