కనికరం చూపని కరోనా

24 May, 2020 04:52 IST|Sakshi

దేశంలో ఒక్కరోజులోనే 6,654 పాజిటివ్‌ కేసులు..

137 మంది మృతి 

న్యూఢిల్లీ: దేశంలో లాక్‌డౌన్‌ నిబంధనల నుంచి మినహాయింపులు ఇచ్చిన తర్వాత కరోనా మహమ్మారి జడలు విప్పుతోంది. వరుసగా రెండో రోజు రికార్డు స్థాయిలో పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు.. కేవలం 24 గంటల వ్యవధిలోనే 6,654 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇప్పటిదాకా ఒక్కరోజులో నమోదైన కేసుల్లో ఈ సంఖ్యే అత్యధికం కావడం గుబులు పుట్టిస్తోంది. తాజాగా 137 మందిని కరోనా వైరస్‌ బలితీసుకుంది. దీంతో ఇప్పటివరకు మొత్తం కేసులు 1,25,101కు, మరణాలు 3,720కు చేరాయి. ఇండియాలో ప్రస్తుతం కరోనా యాక్టివ్‌ కేసులు 69,597 కాగా, 51,783 మంది బాధితులు చికిత్సతో కోలుకున్నారని కేంద్ర ఆర్థిక ఆరోగ్య శాఖ శనివారం విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది. రికవరీ రేటు 41.39 శాతానికి పెరిగిందని తెలియజేసింది. దేశంలో ప్రధానంగా మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, రాజస్తాన్, మధ్యప్రదేశ్‌ తదితర రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి ఆందోళనకర స్థాయిలో పెరిగిపోతోంది.

>
మరిన్ని వార్తలు