అమెరికాకు నచ్చజెబుతున్నాం

22 Nov, 2019 12:06 IST|Sakshi

హెచ్‌1–బీ వీసాలపై కేంద్ర మంత్రి జైశంకర్‌

న్యూఢిల్లీ: భారతీయుల నైపుణ్యాన్ని వాడుకోవడం ఇరువురకూ మంచిదని తాము అమెరికాకు నచ్చజెబుతున్నట్లు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్‌ గురువారం పార్లమెంటుకు తెలిపారు. అమెరికా ఏడు భారతీయ ఐటీ కంపెనీలను హెచ్‌1బీ వీసాలు పొందేందుకు అనర్హులను చేసిందా? అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ అలాంటిదేదీ లేదని, కాకపోతే ఆ కంపెనీలకు జారీ అవుతున్న హెచ్‌1బీ వీసాల సంఖ్యే తగ్గిందన్నారు. రెండేళ్లుగా వారు దరఖాస్తు చేసుకున్న వీసాల్లో తిరస్కరణలు ఎక్కువగా ఉన్నాయని, మిగిలిన కంపెనీల విషయంలోనూ ఇదే జరుగుతోందని వివరించారు. గత ఏడాది ఈ ఏడు ఐటీ కంపెనీలకు మొత్తం 3828 హెచ్‌1బీ వీసాలు జారీ కాగా, 15,230 వీసాలను పునరుద్ధరించారని చెప్పారు.

భారతీయ ఉద్యోగుల జీవిత భాగస్వాములు ఉద్యోగం చేయడం గురించి మాట్లాడుతూ అమెరికా వీరి కోసం 2015 నుంచి హెచ్‌4 వీసాలను అందుబాటులోకి తెచ్చిందని మంత్రి చెప్పారు. హెచ్‌1బీ వీసాలనేవి ఒక్క భారతీయ కంపెనీలకు మాత్రమే కాకుండా.. ప్రపంచంలోని అన్ని కంపెనీలకు సంక్లిష్టంగా మారిపోయాయని, కార్యక్రమంలో చేసిన పరిపాలన పరమైన మార్పుల కారణంగా దరఖాస్తుదారులు మరిన్ని దస్తావేజులను సమర్పించాల్సిన పరిస్థితి ఏర్పడిందని వివరించారు. ఈఏడాది 1,16031 కొత్త హెచ్‌1బీ వీసాల ప్రాసెసింగ్‌ పూర్తయిందని, వీటిల్లో సుమారు 27, 707 తిరస్కరణకు గురయ్యాయని మంత్రి వివరించారు.   

మరిన్ని వార్తలు