రక్షణ రంగంలో పటిష్ట బంధం

9 Aug, 2014 02:12 IST|Sakshi
రక్షణ రంగంలో పటిష్ట బంధం

భారత్, అమెరికా నిర్ణయం
ఇరు దేశాల రక్షణ మంత్రులు జైట్లీ, హేగెల్ చర్చలు
{పధాని మోడీతోనూ హేగెల్ భేటీ

 
న్యూఢిల్లీ: రక్షణ పరికరాల అభివృద్ధి, వాటి ఉత్పత్తిలో పరస్పరం మరింతగా సహకరించుకోవాలని భారత్, అమెరికాలు నిర్ణయించాయి. డిఫెన్స్ టెక్నాలజీ, ట్రేడ్ ఇనిషియేటివ్(డీటీటీఐ) కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి రెండు వైపులా నోడల్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కూడా ఇరు దేశాలు అంగీకారానికి వచ్చాయి. మూడు రోజుల పర్యటన కోసం భారత్‌కు వచ్చిన అమెరికా రక్షణ మంత్రి చక్  హేగెల్ శుక్రవారం ఇక్కడ రక్షణ మంత్రి అరుణ్ జైట్లీతో సమావేశమైన సందర్భంగా ఈ అంశంపై చర్చించారు. రక్షణ రంగంలో అమెరికాతో సంబంధాలను మరింత పటిష్టం చేసుకోవాలనుకుంటున్నట్లు జైట్లీ తెలిపారు.

మిలటరీ హార్డ్‌వేర్ తయారీ రంగంలో అమెరికాతో కలిసి పనిచేయాలని, సైనిక పరికరాలను ఉమ్మడిగా ఉత్పత్తి చేయాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. దేశ శక్తి సామర్థ్యాలను పెంపొందించుకోడానికి వీలుగానే రక్షణ రంగంలో విదేశీ పెట్టుబడుల పరిమితిని 26 శాతం నుంచి 49 శాతానికి పెంచామన్నారు. అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్‌ను సందర్శించాలని మంత్రిని హేగెల్ ఆహ్వానించారు. ఇందుకు జైట్లీ అంగీకరించారు. అంతకుముందు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌తో పాటు ప్రధాని నరేంద్ర మోడీని కూడా హేగెల్ కలుసుకున్నారు. ప్రధానితో భేటీలో ఇరాక్ సంక్షోభం  ప్రస్తావనకు వచ్చింది. ఇరాక్‌లో శాంతిభద్రతలు దిగజారిపోతుండటంపై మోడీ ఆందోళన వ్యక్తం చేశారు.
 
 

మరిన్ని వార్తలు