21 రోజులు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌

25 Mar, 2020 02:58 IST|Sakshi

ఇంట్లో ఉండండి... ఇంట్లోనే ఉండండి

మంగళవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి..

కరోనాను ఎదుర్కోవటానికి వేరే మార్గం లేదు

దేశమంతా పాటిస్తేనే దీన్ని అదుపు చేయగలం

వ్యాధి లక్షణాలు లేవని విచ్చలవిడిగా ఉండొద్దు

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో భారతదేశ వ్యాప్తంగా మంగళవారం రాత్రి 12 గంటల నుంచి 21 రోజుల పాటు లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. మంగళవారం రాత్రి ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు. 21 రోజులు ఎక్కువేనన్న సంగతి తనకూ తెలుసునని... కానీ మనల్ని, మన కుటుంబాల్ని రక్షించుకోవటానికి ఇంతకన్నా మార్గం లేదని ఆయన స్పష్టంచేశారు. ‘‘బాగా అభివృద్ధి చెంది, అత్యుత్తమ వైద్య సదుపాయాలున్న ఇటలీ, అమెరికా వంటి దేశాల్లో సైతం ఇది బీభత్సం సృష్టిస్తోంది. దీన్ని నివారించడానికి నిపుణులు చెబుతున్న మార్గం ఒక్కటే. అది సామాజిక దూరం. మీరు ఆరోగ్యంగా ఉన్నారు కదా... విదేశాల నుంచి రాలేదు కదా అని ఈ దూరం పాటించక్కరలేదనుకుంటే పొరపాటే. ఎందుకంటే కరోనా వచ్చిన వ్యక్తులు చాలా రోజుల పాటు మామూలుగానే ఉంటున్నారు. లక్షణాలు కొన్ని రోజుల తరవాతే బయటపడుతున్నాయి. అందుకే దాన్ని ఆపలేకపోతున్నాం. ఈ లోపే అది వారి నుంచి మరికొందరికి వ్యాపించేస్తోంది. కాబట్టి ఈ వలయాన్ని అడ్డుకోవాలి. దానికి సామాజిక దూరం ఒక్కటే మార్గం. 21 రోజుల పాటు ఇంట్లో ఉండండి... ఇంట్లోనే ఉండండి. మీరే కాదు. నేను  దీన్ని పాటించాల్సిందే. దీన్ని పాటించకపోతే మనం, మన పిల్లలు, మన మిత్రులు... ఇలా యావద్భారతం ఇబ్బందులు పడుతుంది’అని ప్రధాని స్పష్టం చేశారు. (మరో ఆరు కరోనా పాజిటివ్‌ కేసులు)

ఎక్కడి వారు అక్కడే
గత రెండు రోజులుగా దేశంలోని అనేక ప్రాంతాల్ని రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో లాక్‌డౌన్‌ చేశామని, ఇపుడు దీన్ని దేశమంతటికీ విస్తరించి మరో 21 రోజులు కొనసాగిస్తున్నామని మోదీ ప్రకటించారు. కేంద్రపాలిత ప్రాంతాలతో సహా అన్ని రాష్ట్రాల్లోనూ సంపూర్ణంగా ఇది అమలవుతుందన్నారు.  ‘చేతులు జోడించి అర్థిస్తున్నా. ఇప్పుడు మీరు ఎక్కడున్నారో అక్కడే మరో 21 రోజులు ఉండండి. కరోనా వైరస్‌ సంక్రమించే సైకిల్‌ను విడగొట్టాలంటే 21 రోజుల సమయం అవసరం. దీన్ని మనం పాటించకపోతే మనం, మన కుటుంబాలు 21 ఏళ్లు వెనక్కి వెళ్లిపోతాం. మీ కుటుంబంలో వ్యక్తిగా చెబుతున్నా. ఇంట్లోనే ఉండండి. మీ ఇంటి ద్వారం వద్ద లక్ష్మణ రేఖ గీసుకోండి. మీరు ఇంటి నుంచి బయటకు అడుగేస్తే... అది కరోనా మహమ్మారిని మీ ఇంటికి ఆహ్వానిస్తుందని గుర్తుంచుకోండి’అని హెచ్చరించారాయన.

కరోనా వేగం... అనూహ్యం 
ప్రపంచంలో కరోనా కేసులు లక్షకు చేరటానికి మొదట 67 రోజులు పట్టిందని, తరవాత మరో లక్ష పెరిగి 2 లక్షలకు చేరటానికి 11 రోజులు...  మూడో లక్షకు నాలుగు రోజులే  పట్టిందని ప్రధాని గుర్తుచేశారు. దీన్ని బట్టి ఈ మహమ్మారి వేగాన్ని అర్థం చేసుకోవాలన్నారు. చైనా, అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, ఇరాన్‌ వంటి పలు దేశాలు కరోనా విలయాన్ని చూస్తున్నాయని, పలుదేశాలు రోజుల తరబడి ఒక్కరు కూడా రాకపోవటం వల్లే... ప్రభుత్వ ఆదేశాలను పాటించడం వల్లే కరోనా నుంచి బయటపడ్డాయని చెప్పారు. ఈ సందర్భంగా ప్రాణాలు సైతం పణంగా పెట్టి వైద్యులు, నర్సులు, పారా మెడికల్‌ సిబ్బంది అందిస్తున్న సేవల్ని కొనియాడారు. పారిశుద్ధ్య కార్మికులను ఆయన ప్రశంసించారు. మీడియా, పోలీసు పాత్రలను కూడా గుర్తుచేశారు. వారి ఆరోగ్యం గురించి ఇళ్లలో ఉన్నవారు ప్రార్థించాలన్నారు.(హుబేలో లాక్‌డౌన్‌ ఎత్తివేత?)

వైద్య పరికరాలకు రూ.15,000 కోట్లు 
నిత్యావసర సరుకులపై ఎవరికీ ఎలాంటి సందేహాలూ వద్దని, దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తున్నాయని మోదీ చెప్పారు. అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటున్నట్లు తెలియజేశారు. కరోనా టెస్టింగ్‌ కిట్లు, వెంటిలేటర్లు, అదనపు బెడ్ల వంటి అత్యవసర మౌలిక సదుపాయాల్ని సమకూర్చుకోవటానికి కేంద్రం రూ.15,000 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రధాని తెలియజేశారు. ‘‘మా నిర్ణయంతో నిరుపేదలకు చాలా ఇబ్బందే. కాకపోతే ఇది జీవన్మరణ సమస్య. బతికి ఉంటేనే తరవాత ఏదైనా చేయగలం’’అన్నారాయన. ప్రయివేటు ఆసుపత్రులు, ల్యాబ్‌లు కూడా ప్రభుత్వంతో కలిసి పనిచేయటానికి ముందుకొస్తున్నాయని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు.

లాక్‌డౌన్‌తో నిర్మానుష్యంగా మారిన పట్నా రైల్వే స్టేషన్‌

మరిన్ని వార్తలు