పాక్‌తో యుద్ధం తప్ప.. మరో ఆప్షన్ లేదు!

10 Feb, 2018 15:30 IST|Sakshi
పాకిస్తాన్, భారత్ చిహ్నాలు (ఫైల్ ఫొటో)

పాక్ ఉగ్రవాదానికి ముగింపు పలకాలి

లేని పక్షంలో యుద్ధంతోనే సమాధానం చెబుతాం

పాక్‌ను హెచ్చరించిన ఫరూఖ్ అబ్దుల్లా

సాక్షి, శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో నిత్యం పాకిస్తాన్ ఉగ్రమూకలు దాడులకు తెగబడటంపై నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు, ఆ రాష్ట్ర మాజీ సీఎం ఫరూఖ్ అబ్దుల్లా తీవ్రంగా స్పందించారు. ఉగ్రవాదానికి ముగింపు పలకపోతే పాక్ భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు. ఉగ్రవాద శక్తులను ప్రోత్సహించడం, వారికి ఆశ్రయమిస్తూ భారత్‌పై దాడులు ఇలాగే కొనసాగిస్తే పాక్‌పై యుద్ధం తప్ప మనకు మరో ఆప్షన్ లేదన్నారు. శనివారం తెల్లవారుజామున సంజ్వాన్‌లోని ఆర్మీ శిబిరంపైనే పాక్ ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు జవాన్లు మృతి చెందగా, మరో నలుగురికి గాయాలైన విషయం తెలిసిందే.


నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు, మాజీ సీఎం ఫరూఖ్ అబ్దుల్లా

ఈ ఘటనపై ఫరూఖ్ అబ్దుల్లా మీడియాతో మాట్లాడారు. పాక్ ప్రతిరోజు జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడులకు పాల్పడుతోందని, అసలు దాయాది ఉగ్రవాదులు దాడులు భారత్‌పై దాడులు చేయని రోజే లేదని ఫరూఖ్ అబ్దుల్లా మండిపడ్డారు. భారత్ నుంచి కేవలం శాంతిని మాత్రమే కోరుకున్నట్లయితే పాక్ ఉగ్రవాదానికి ముగింపు పలకాలని పిలుపునిచ్చారు. లేనిపక్షంలో భారత్ నుంచి యుద్ధమే సమాధానం అవుతుందని పేర్కొన్నారు. భారత్‌తో సంబంధాలు మెరుగు చేసుకోవాలంటే పాక్ తన వైఖరిని మార్చుకుని, ఉగ్రవాదానికి దూరంగా ఉండటమే ఉత్తమమని చెప్పారు.. యుద్ధం వల్ల రెండు దేశాలకూ తీవ్ర నష్టం వాటిల్లుతుందని, కానీ పాక్ చర్యల వల్ల యుద్ధ వాతావరణం నెలకొంటుందన్నారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు