‘పెద్దన్న’పాత్ర దిశగా భారత్‌ అడుగులు..

15 Feb, 2018 21:13 IST|Sakshi
ఫ్రీడం ఇన్‌ ది వరల్డ్‌ రిపోర్టులో 77వ స్థానంలో నిలిచిన భారత్‌

ప్రజాస్వామ్య పురోగతిలో భారత్‌ ముందంజ

ప్రపంచదేశాల్లో తగ్గుతున్న అమెరికా స్థాయి

ఫ్రీడమ్‌ ఇన్‌ది వరల్డ్‌–2018 నివేదిక

సాక్షి,న్యూఢిల్లీ : ప్రపంచ దేశాల్లో ప్రజాస్వామ్య పురోగతి, స్వేచ్ఛాయుత వాతావరణం విషయంలో భారత్‌ ముందడుగేస్తోంది. ప్రపంచస్థాయిలో ప్రజాస్వామ్యానికి చేదోడు వాదోడుగా నిలిచే కృషిలో భాగస్వామి అవుతోంది. ఇరవయ్యో శతాబ్దం చివరి వరకు ప్రపంచ ప్రజాస్వామ్యానికి, ఆర్థికాభివృద్ధికి దారిచూపే దీపస్తంభంగా నిలిచిన అమెరికా పాత్ర ఇప్పుడు మారింది. ఒకప్పుడు అమెరికా పోషించిన పాత్రను ఇప్పుడు ఇండియా నిర్వహిస్తోంది. ఆర్థికాభివృద్ధిలో ఇతర దేశాలను భాగస్వాములను చేయడంతో పాటు సమ్మిళిత అభివృద్ధి నినాదానికి భారత్‌ చేయూతనిస్తోంది.

రోజు రోజుకు వివిధ దేశాల్లో ప్రజాస్వామ్యం ఒడిదుడుకులకు గురవుతున్న నేపథ్యంలో ప్రజాస్వామ్యాన్ని మరింత పటిష్టపరచి, మరింత ఉజ్వల భవిష్యత్‌ సాధనకు ప్రణాళికలు సిద్ధం చేయడంలో భారత్‌ ముందుందని ఫ్రీడం హౌస్‌ వార్షిక నివేదిక వెల్లడించింది. అంతర్జాతీయ స్థాయిలో ప్రజాస్వామ్య విలువల పరిరక్షణకు అమెరికా వంటి పెద్ద దేశాల మద్దతు కొరవడడం కూడా ఈ పరిస్థితికి కారణమని అంచనా వేస్తున్నారు. 

‘ప్రజాస్వామ్య సంక్షోభం’– ఫ్రీడం ఇన్‌ది వరల్డ్‌ –2018 పేరిట విడుదల చేసిన ఈ నివేదికలో భారత్‌ చేస్తున్న కృషిని కొనియాడింది. మరింతగా ప్రజాస్వామ్య స్ఫూర్తి వ్యాపించేందుకు ప్రపంచ ప్రాధాన్య వేదికలను ఉపయోగించుకుంటున్న తీరును శ్లాఘించింది. గత పదేళ్లతో పోల్చితే  2017 లో ప్రపంచవ్యాప్తంగా రాజకీయ, పౌరహక్కులు మరింతగా దిగజారాయి. వ్యక్తిగత స్వాతంత్య్రం, స్వేచ్ఛ కోసం ప్రపంచస్థాయి పోరాటంలో అమెరికా నాయకత్వ స్థానం నుంచి వైదొలిగిందని పేర్కొంది. 

ఇదీ పరిశీలన...
మొత్తం 195 దేశాల్లో స్వేచ్ఛాస్వాతంత్య్రాలపై 25 అంశాల ఆధారంగా ఈ నివేదిక రూపొందించారు. ప్రభుత్వాలు, వాటి పనితీరు అధారంగా కాకుండా ఆయా దేశాల ప్రజలు వ్యక్తులుగా అనుభవిస్తున్న స్వాతంత్య్రం, వాస్తవంగా పొందుతున్న హక్కులను బట్టి ఆయా అంశాలపై అంచనాకు వచ్చారు. స్వాతంత్య్రం, స్వేచ్ఛ (ఫ్రీడం స్కోర్‌ రేటింగ్‌)కు సంబంధించిన సగటు రేటింగ్‌లో అమెరికా 8 స్థానాలు దిగజారినట్టు ఈ నివేదిక పేర్కొంది. 2008లో వందకు 94 పాయింట్లు ఉన్నది కాస్తా, 2017లో 86కు పడిపోయింది. ఇందులో భారత్‌ 77 పాయింట్లు సాధించింది. పలు దేశాల స్కోరు 90 పాయింట్లు, ఆపైనే ఉన్నా అవన్నీ కూడా చిన్న దేశాలే. ప్రపంచ స్థాయిలో ప్రజాస్వామ్య పరిరక్షణ లేదా నాయకత్వ బాధ్యతలు చేపట్టే స్థాయి లేని దేశాలు. ప్రజాస్వామ్యం, ఇతరత్రా అంశాలపై గతంలో నిర్వహించిన పాత్ర నుంచి అమెరికా తప్పుకుంటే వాటిని చేపట్ట గలిగేంత స్థోమత, బలం వీటికి లేదు. ఈ విషయాల్లో భారత్‌ మెరుగైన స్థితిలో ఉందని ఈ పరిశీలన అంచనా వేస్తోంది. 

భారత్‌ పురోగతి...
దేశంలో ప్రజాస్వామ్యాన్ని మరింత పరిపుష్టం చేసేందుకు తీసుకుంటున్న చర్యలతో పాటు దేశాభివద్ధికి అంతర్జాతీయ సహకారాన్ని, సమ్మిళిత భాగస్వామ్యాన్ని భారత్‌ కోరడం ఇందుకు ఉపకరిస్తుంది. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు అనువైనదనే ప్రచారం కూడా లాభిస్తోంది. అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ హయాంలో అమెరికా ఇందుకు విరుద్ధంగా స్వీయరక్షణ ఆర్థిక విధానాలు అవలంబిస్తోంది. ముఖ్యమైన అంశాలపై ప్రపంచదేశాలను భాగస్వాములను చేయడంలో భారత్‌ అనుసరిస్తున్న సానుకూల, నిర్మాణాత్మక వైఖరి మున్ముందు నాయకత్వ స్థానానికి ఎదిగేందుకు ఉపయోగపడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

మరో అధ్యయనంలో అగ్రస్థానం...
ప్రపంచంలోని ప్రజాస్వామ్య వ్యవస్థల పరిస్థితిపై వరల్డ్‌ ఎలక్టోరల్‌ ఫ్రీడం ఇండెక్స్‌ 2018 నిర్వహించిన అధ్యయనంలో కూడా భారత్‌కు అగ్రస్థానం లభించింది. యాక్టివ్‌ సఫ్రెజ్‌ ఫ్రీడం ఇండెక్స్‌ (ఏఎస్‌ఎఫ్‌ఐ)లో భారత్‌ 87.15 పాయింట్లు సాధించింది. హంగేరి–83.86, యూకే–83.78, న్యూజిలాండ్‌–83.71, ఆస్ట్రేలియా–82.88, రష్యా–82.44 పాయింట్లతో తర్వాతి స్థానాల్లో నిలిచాయి. అమెరికా మాత్రం 79.35 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో, ఫ్రాన్స్‌–79.26 పాయింట్లతో పదో స్థానంలో నిలిచాయి.

–సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా