ఇటాలియన్‌ మెరైన్స్‌‌ కేసు: భారత్‌కు అనుకూలంగా..

2 Jul, 2020 19:44 IST|Sakshi

2012 నాటి కేసులో కీలక పరిణామం

న్యూఢిల్లీ‌: కేరళకు చెందిన మత్స్యకారులను కాల్చి చంపిన ఇటలీ నావికాదళ అధికారులకు అంతర్జాతీయ ట్రిబ్యునల్‌లో ఎదురుదెబ్బ తగిలింది. 2012 నాటి ‘ఇటాలియన్‌ మెరైన్‌ కేసు’లో భారత్‌కు అనుకూలంగా ట్రిబ్యునల్‌ కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ గురువారం వెల్లడించింది. ఇటలీ మిలిటరీ చర్యలు భారత పౌరుల హక్కుకు భంగం కలిగించి, నిబంధనలు ఉల్లంఘించాయన్న ట్రిబ్యునల్.. ఈ కేసులో భారత్‌ వాదనను సమర్థించినట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రాణ నష్టానికి బదులుగా పరిహారం పొందేందుకు భారత్‌ అర్హత సాధించిందని తెలిపింది. అంతేగాకుండా తమ అధికారులను బంధించినందుకు భారత్‌ పరిహారం చెల్లించాలన్న ఇటలీ వాదనను ట్రిబ్యునల్‌ తోసిపుచ్చినట్లు పేర్కొంది. అయితే నిందితులు ప్రభుత్వాధికారులు అయినందున వారిని భారత్‌లో విచారించే అవకాశం లేదని పేర్కొన్నట్లు తెలిపింది. కాగా 2012, ఫిబ్రవరి 15న సాల్వేటోర్‌ గిరోనే, మాసిమిలియానో లాటోరే ఇద్దరు ఇటలీ నావికదళాధికారులు దక్షిణ కేరళ తీరంలో ఇద్దరు మత్స్సకారులపై కాల్పులు జరపగా.. వారు మరణించారు. దీంతో ఫిబ్రవరి 19న కేరళ పోలీసులు ఇటలీ అధికారులను అరెస్టు చేశారు.(ఎస్‌ఆర్‌ఎస్‌ నివేదికలో షాకింగ్‌ విషయాలు

ఈ నేపథ్యంలో మే నెలలో కేరళ హైకోర్టు వారికి షరతులతో కూడిన బెయిలు మంజూరు చేసింది. కొచ్చిని వీడి బయటకు వెళ్లకూడదని ఆదేశించింది. అయితే ఇటలీ సాధారణ ఎన్నికల్లో ఓటు వేసేందుకు తమను అనుమతించాల్సిందిగా వారు భారత సర్వోన్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించడంతో.. కోర్టు ఇందుకు సానుకూలంగా స్పందించింది. బెయిల్‌ షరతులు సడలించి.. వారు స్వదేశానికి వెళ్లేందుకు అనుమతినిచ్చింది. ఇక ఆ తర్వాత వారిద్దరిని తిరిగి భారత్‌కు పంపించేందుకు ఇటలీ నిరాకరించింది.

దీంతో భారత్‌- ఇటలీ మధ్య వివాదం తలెత్తింది. ఈ నేపథ్యంలో ఘటన జరిగింది తమ జ్యురిడిక్షన్‌ పరిధిలోనే కాబట్టి.. విచారణ ఇక్కడే జరగాలని భారత్‌ పట్టుబట్టగా.. భారత సముద్ర జలాలకు ఆవల కాల్పులు జరిగాయి కాబట్టి అక్కడ తమ అధికారులను విచారించేందుకు వీల్లేదని ఇటలీ పేర్కొంది. తమ ఆయిల్‌ ట్యాంకర్లకు ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలోనే తమ అధికారులు కాల్పులు జరిపారని వాదనకు దిగింది. దీంతో 2015లో నెదర్లాండ్స్‌లోని ది హేగ్‌లోని పర్మినెంట్‌ కోర్ట్‌ ఆఫ్‌ ఆర్బిట్రేషన్‌కు ఈ వ్యవహారం చేరుకుంది. అదే విధంగా రాజకీయ దుమారానికి తెరతీసింది.

ఇటలీ హంతకులకు ఎవరు అండగా నిలిచారు?
ఈ నేపథ్యంలో 2014 ఎన్నికల్లో బీజేపీ ప్రధాన మంత్రి అభ్యర్థిగా బరిలో దిగిన నరేంద్ర మోదీ.. అరుణాచల్‌ ప్రదేశ్‌లోని ఇటానగర్‌లో నిర్వహించిన ప్రచారంలో మాట్లాడుతూ.. ‘‘ఇటలీ హంతకులు ఇటలీకి వెళ్లడానికి బాటలు వేసింది ఎవరు? ఎవరి ఆదేశాలతో వారు అక్కడే ఉండిపోయారు? వారిని భారత్‌ వచ్చేందుకు ఏ శక్తులు అడ్డగించాయి?’’అంటూ కాంగ్రెస్‌ పార్టీని విమర్శించారు. ‘‘బాధితులైన అజీశ్‌ బింకి, జలాస్టిన్‌లకు న్యాయం జరిగేంత వరకు పోరాడతా. బాధితుల హక్కులను కాపాడతాను. కేరళ మత్స్యకారుల కోసం ఎవరితోనైనా యుద్ధం చేయడానికి నేను సిద్ధం’’ అంటూ వాగ్దానం చేశారు.

ఈ క్రమంలో 2014లో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించడంతో ప్రధానిగా మోదీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. ఇటలీ అధికారులు మరోసారి సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశారు. అనారోగ్య కారణాలు చూపి వెసలుబాటు కల్పించాలని కోరారు. ఇక అప్పుడు విదేశాంగ మంత్రిగా ఉన్న దివంగత నేత సుష్మా స్వరాజ్‌ తమకు ఈ విషయంలో అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. దీంతో ఈ అంశం మరోసారి రాజకీయ విమర్శలకు దారితీసింది.

 
 

మరిన్ని వార్తలు