పటేల్ తొలి ప్రధాని అయివుంటే ...

31 Oct, 2014 12:50 IST|Sakshi
పటేల్ తొలి ప్రధాని అయివుంటే ...

న్యూఢిల్లీ : దేశానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ తొలి ప్రధానమంత్రి అయ్యి ఉంటే దేశ పరిస్థితి మరో విధంగా ఉండేదని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు.  సర్దార్ పటేల్ జయంతి సందర్భంగా ఢిల్లీలోని విజయ్‌చౌక్ వద్ద ఏర్పాటు చేసిన జాతీయ ఐక్యత పరుగులో ఆయన శుక్రవారం పాల్గొన్నారు.

 

ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ పటేల్ దేశ స్వాతంత్ర్యం కోసం త్యాగం చేసిన నేతల్లో మొట్ట మొదటి వ్యక్తి అన్నారు. మహాత్మాగాంధీకి నెహ్రు, పటేల్ రెండు కళ్లు, చెవుల్లా వ్యవహరించేవారన్నారు. అయితే గాంధీ మరణాంతరం పటేల్ను విస్మరించారని వెంకయ్య విమర్శించారు. దేశవ్యాప్తంగా జాతీయ ఐక్యతా పరుగు నిర్వహించి పటేల్ను మనం ఘనంగా స్మరించుకున్నామని ఆయన అన్నారు.

మరోవైపు సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి, ఇందిరాగాంధీ వర్థంతిపై కాంగ్రెస్, బీజేపీల మధ్య విమర్శల పర్వం కొనసాగుతోంది. పటేల్ జయంతిని జాతీయ ఏకతా దినోత్సవంగా ఘనంగా నిర్వహిస్తున్న కేంద్ర ప్రభుత్వం మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని మాత్రం విస్మరించిందని కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు