మిస్టరీ మహిళ కోసం వేట..!

7 May, 2016 09:34 IST|Sakshi
మిస్టరీ మహిళ కోసం వేట..!

న్యూఢిల్లీ: ఆమె వయసు ఇప్పుడు 32. పేరు క్రిస్టీన్ బ్రెడో స్ల్పీడ్. చిరునామా ఫ్లాట్ నంబర్ 3, 10 చాప్ స్టోవ్ రోడ్, లండన్. డీటెయిల్స్ ఇంత క్లియర్ గా ఉన్నా ఇప్పటికీ ఆమె మిస్టరీ మహిళే. ఎందుకంటే ఈ వివరాలు ఒరిజినలా? ఫేకా? ఇంకా తెలియాల్సిఉంది. ప్రస్తుతం భారత రాజకీయాలను కుదిపేస్తోన్న అగస్టా వెస్ట్ లాండ్ కుంభకోణంలో ఈ మిస్టరీ మహిళదే ప్రధాన పాత్ర పోషించినట్లు భారత దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. ఆమేరకు ఆమె గురించిన సమాచారాన్ని సేకరించేకొద్దీ క్రిస్టీన్.. వ్యవహారాలను చక్కబెట్టడంలో ఎంత నేర్పరో తెలుస్తోంది. ఇంతకీ ఆమె ఈ కుంభకోణంలోకి ఎలా ఎంటర్ అయిందంటే..

డెన్మార్క్ కు చెందిన క్రిస్టీన్ బ్రెడో చిన్నవయసులోనే వ్యాపార రంగంలోకి ప్రవేశించింది. 20 ఏళ్ల వయసులోనే బీటెల్ నట్ హోమ్ అనే బ్రిటిష్ కంపెనీలో షేర్ హోల్డర్ అయింది. ఈ సంస్థ యజమాని మరెవరోకాదు.. అగస్టా స్కామ్ లో భారత నేతలకు ముడుపులు ముట్టచెప్పడంలో ప్రధాన మధ్యవర్తిగా వ్యవహరించిన బ్రిటిష్ పౌరుడు క్రిస్టియన్ జేమ్స్ మిచెల్ ది. ఆయనకే చెందిన గ్లోబల్ సర్వీసెస్ సంస్థ(దీనిని దుబాయ్ కేంద్రంగా ఏర్పాటుచేశారు)లోనూ క్రిస్టీన్ ప్రధాన వాటాదారు. అలా వాళ్లిద్దరి మధ్య నెలకొన్న స్నేహమే క్రిస్టీన్ ను అగస్టా కుంభకోణంలోకి లాక్కొచ్చింది.

జేమ్స్ మిచెల్ కు అత్యంత నమ్మకమైన మనిషిగా క్రిస్టీన్.. ఆయన తరఫున భారత నేతలతో మాట్లాడేదని, వ్యక్తిగంగానూ నిందితులను కలుసుకుందని దర్యాప్తు సంస్థలు ఒక అంచనాకు వచ్చాయి. 12 హెలికాప్టర్ల కొనుగోలుకు సంబంధించిన డీల్ నిర్ణయం మొదలుకొని, పూర్తయ్యేవరకు ఆమె భారత్ కు పలుమార్లు వచ్చిపోవడం కూడా కుంభకోణంలో ఆమె పాత్రను నిర్ధారిస్తున్నాయి. భారత నేతల తరఫున మధ్యవర్తిత్వం వహించిన గౌతమ్ పారేఖ్ ను విచారించడం ద్వారా దర్యాప్తు సంస్థలు క్రిస్టీన్ కు సంబంధించిన వివరాలు సేకరించారు.

2010 ఫిబ్రవరిలో క్రిస్టీన్ ఇండియాకు వచ్చారు. అదేనెల 8న అగస్టా డీల్ కు సంబంధించిన ఒప్పందాలపై సంతకాలయ్యాయి. 15న ఇండియా నుంచి దుబాయ్ వెళ్లిన క్రిస్టీన్ అక్కడేఉన్న క్రిస్టియన్ మిచెల్ ని కలుసుకుంది. మళ్లీ 24న భారత్ కు వచ్చి బ్యాలెన్స్ వ్యవహారలు చక్కబెట్టింది. ఈ వ్యవహారానికి సంబంధించి ఇటలీ కోర్టు 2012లో విచారణకు ఆదేశించింది. దీంతో అదే ఏడాది డిసెంబర్ 30న క్రిస్టీన్ మరోసారి ఇండియాకు వచ్చి నిందితులను కలుసుకుంది. 2013 జనవరిలో దుబాయ్ వెళ్లి మిచెల్ కు ఇక్కడి(భారత్) వ్యవహారాలను తెలిపింది.

3,600 కోట్ల డీల్ ను కుదిర్చినందుకుగానూ ఫిన్ మెకానికా (అగస్టా వెస్ట్ లాండ్ బ్రాండ్ హెలికాప్టర్ల తయారీ సంస్థ) జాన్ మిచెల్ కు 26 మిలియన్ పౌండ్లు చెల్లించుకుంది. అందులో భారీ మొత్తం క్రీస్టీనాకు దక్కి ఉండొచ్చని అనుమానం. అయితే ఈ చెల్లింపుల వ్యవహారం, భారత నేతలకు లంచాలు ఇవ్వజూపడాన్ని నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. గాంధీ కుటుంబానికి సంబంధించిన నేతల పేర్లు చెప్పాలని సీబీఐ తనను ఒత్తిడి చేస్తున్నట్లు ఆరోపించారు. దర్యాప్తు సంస్థ మాత్రం మిచెల్ చెప్పేవన్నీ అబద్ధాలని కొట్టిపారేస్తోంది. క్రిస్టీన్ ను విచారించగలిగితే మరిన్ని చీకటి కోణాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉండటంతో ఆమె కోసం వేట మొదలైంది.

వీవీఐపీలు వినియోగించేందుకు 12 హెలికాప్టర్లు కొనాలనుకున్న భారత ప్రభుత్వం.. రోమ్ కేంద్రంగా పనిచేస్తోన్న ఆంగ్లో-ఇటాలియన్ కంపెనీ అగస్టా వెస్ట్ లాండ్ కు 3,600 కోట్ల కాంట్రాక్టును అప్పచెప్పింది. అయితే అసలు విలువలో భారీ మొత్తాన్ని లంచాల రూపంలో మింగేశారని, ఒప్పందం కుదుర్చుకునే విషయంలో మధ్యవర్తిత్వం చోటుచేసుకుందని, డీల్ మొత్తం అస్తవ్యస్తంగా ఉందంటూ ఇటాలియన్ కోర్టు దర్యాప్తునకు ఆదేశించడంతో అగస్టా కుంభకోణం వెలుగులోకి వచ్చింది. దీంతో భారత్ లోనూ రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి.

>
మరిన్ని వార్తలు