ఎయిర్ ఫోర్స్ విమానం అదృశ్యం

22 Jul, 2016 14:35 IST|Sakshi
ఎయిర్ ఫోర్స్ విమానం అదృశ్యం

చెన్నె: తమిళనాడులోని తాంబరం నుంచి పోర్ట్ బ్లెయిర్ వెళుతున్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం గల్లంతయింది. విమానంలో ఆరుగురు క్రూ సిబ్బందితో సహా 29 మంది ఉన్నట్టు సమాచారం. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన ఏఎన్-32 విమానం శుక్రవారం గగనతలంలో అదృశ్యమైంది. ఉదయం 8.30 గంటలకు గాల్లోకి ఎగిరిన 16 నిమిషాల తర్వాత విమానం.. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో సంబంధాలు కోల్పోయింది.

ఎయిర్‌పోర్టు వర్గాలు వెంటనే ఈ విషయాన్ని వాయుసేన అధికారులకు తెలిపారు. విమానంలో సాంకేతిక లోపం తలెత్తి ఉండొచ్చని భావిస్తున్నారు. కనబడకుండా పోయిన విమానం ఆచూకీ కనిపెట్టేందుకు ఎయిర్ ఫోర్స్, నావికా దళం సేనలు రంగంలోకి దిగాయి. విమానం అదృశ్యమై ఇప్పటికి ఆరు గంటలు దాటడంతో అధికారులు విచారణ ప్రారంభించారు. కోస్ట్ గార్డ్ బృందాలు కూడా దీనికోసం గాలింపు జరుపుతున్నాయి. బంగాళా ఖాతంలోని పలు ప్రాంతాల్లో గాలిస్తున్నారు. ఈ విమానాన్ని రష్యా నుంచి కొనుగోలు చేశారు. గతంలో ఇదే తరహా విమానం ఒకటి అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతంలో కూలిపోయింది. అప్పట్లో దానికి కారణం సాంకేతిక సమస్య అని చెప్పారు. ఇప్పుడు ఈ విమానం అదృశ్యం కావడం వెనుక సాంకేతిక కారణాలే ఉన్నాయా, మరేదైనా సమస్య ఉందా అని విచారణ జరపాల్సి ఉంది. మరికొద్ది సేపట్లో దీనికి సంబంధించిన వివరాలు తెలిసే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు