దేనికైనా సిద్ధం..

1 Mar, 2019 03:50 IST|Sakshi
గురువారం పాకిస్తాన్‌కు చెందిన అమ్రామ్‌ క్షిçపణి శకలాన్ని మీడియాకు చూపిస్తున్న రక్షణ అధికారులు 

దుస్సాహసానికి పాల్పడితే భారీ మూల్యం తప్పదు

పాకిస్తాన్‌ను ఘాటుగా హెచ్చరించిన త్రివిధ దళాలు

ఎఫ్‌–16లను భారత్‌పైకి పంపారు.. ఇవిగో సాక్ష్యాలు

సరిహద్దులో ఉద్రిక్తత ఇంకా తగ్గలేదు. పాకిస్తాన్‌ తన కవ్వింపు చర్యలను గురువారం కూడా కొనసాగించింది. కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచి వరుసగా ఏడోరోజూ తన కపట బుద్ధిని మరోమారు చాటింది. అయితే, దాయాది దేశం చేపట్టే ఎలాంటి దుందుడుకు చర్యలనైనా దీటుగా తిప్పికొడతామని భారత్‌ స్పష్టంచేసింది. బుధవారం దాడిపై పాక్‌ చేసినదానికి, చెప్పినదానికి పొంతనలేకపోవడాన్ని ఎండగట్టింది. భారత త్రివిధ దళాల ప్రతినిధులు సంయుక్తంగా మీడియా సమావేశం పెట్టి పాక్‌ దుర్నీతిని కళ్లకు కట్టారు. ఎఫ్‌–16 యుద్ధ విమానాలను భారత గగనతలంలోకి పంపలేదన్న అబద్ధాలను తేటతెల్లం చేస్తూ విమాన శకలాలను ప్రపంచానికి చూపారు.

వర్ధమాన్‌ఒక ఎఫ్‌–16ను కూల్చేశారు.. 
భారత సైనిక స్థావరాలపై బుధవారం చేసిన దాడిలో పాకిస్తాన్‌ అత్యాధునిక ఎఫ్‌–16 యుద్ధవిమానాలను వినియోగించిందని ఐఏఎఫ్‌ ఎయిర్‌చీఫ్‌ మార్షల్‌ ఆర్జీకే కపూర్‌ తెలిపారు. ‘పాక్‌ చెరలోని వింగ్‌ కమాండర్‌ వర్ధమాన్‌ అభినందన్‌ విడుదల కానుండటంపై మేం చాలా సంతోషంగా ఉన్నాం. ఆయన రాకకోసం ఎదురుచూస్తున్నాం. పాక్‌ యుద్ధ విమానాలు భారత గగనతల ఉల్లంఘనకు పాల్పడటంతో భారత ఫైటర్‌జెట్లు రంగంలోకి దిగాయి. ఈ సందర్భంగా పాక్‌కు చెందిన ఓ ఎఫ్‌–16 యుద్ధ విమానాన్ని తన మిగ్‌–21 బైసన్‌ ఫైటర్‌ జెట్‌తో వర్ధమాన్‌ నేలకూల్చారు. అనంతరం ప్రమాదానికి గురైన విమానం నుంచి ప్యారాచూట్‌ ద్వారా తప్పించుకున్న వర్ధమాన్‌ను పాక్‌ సైన్యం అరెస్ట్‌ చేసింది’అని తెలిపారు.

గురువారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతున్న ఎయిర్‌ వైస్‌ మార్షల్‌ ఆర్‌.జి.వి. కపూర్,నేవీ రేర్‌ అడ్మిరల్‌ డీఎస్‌ గుజ్రాల్, ఆర్మీ మేజర్‌ జనరల్‌ సురిందర్‌సింగ్‌ మహల్‌

భారత ఆర్మీ స్థావరాలు సేఫ్‌
భారత సైనిక స్థావరాలపై దాడికి తాము ఎఫ్‌–16 ఫైటర్‌ జెట్లను వాడలేదని పాకిస్తాన్‌ బుకాయించడంపై కపూర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘జమ్మూకశ్మీర్‌లోని రాజౌరి జిల్లాలో భారత ఫైటర్‌జెట్లు నేలకూల్చిన యుద్ధవిమానం నుంచి అమ్రాన్‌ క్షిపణుల శకలాలను స్వాధీనం చేసుకున్నాం. ఈ మిస్సైళ్లను పాకిస్తాన్‌ ఎఫ్‌–16 యుద్ధవిమానాల్లో వాడుతోంది. ఈ దాడిలో భారత ఆర్మీ స్థావరాలకు నష్టం చేకూర్చడంలో పాక్‌ వైమానిక దళం విఫలమైంది. తాము రెండు భారత యుద్ధవిమానాలను కూల్చివేశామని పాక్‌ అబద్ధాలు చెబుతోంది. నిజానికి పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో రెండు ప్యారాచూట్‌ల ద్వారా కిందకు దిగింది ఎఫ్‌–16 యుద్ధ విమానాల పైలట్లే. ఈ రెండు ఫైటర్‌జెట్లను భారత్‌కు చెందిన మిగ్‌–21 బైసన్‌ యుద్ధవిమానం కుప్పకూల్చింది. తొలుత ఇద్దరు భారత పైలట్లు తమ కస్టడీలో ఉన్నారన్న పాక్‌ ఆ తర్వాత మాట మార్చింది’అని విమర్శించారు. ఈ సందర్భంగా పాక్‌ ఎఫ్‌–16 యుద్ధవిమానాల్లో వాడిన అమ్రాన్‌ క్షిపణుల శకలాలను మీడియా ముందు ప్రదర్శించారు. 

‘జెనీవా’ మేరకే వర్ధమాన్‌ విడుదల
బాలాకోట్‌లోని జైషే ఉగ్రవాద స్థావరంపై ఐఏఎఫ్‌ దాడులకు సంబంధించి సాక్ష్యాలను ఎప్పుడు, ఎలా విడుదల చేయాలన్నది కేంద్ర ప్రభుత్వ ఇష్టమని కపూర్‌ అభిప్రాయపడ్డారు. çసుహృద్భావ చర్యల్లో భాగంగా భారత పైలట్‌ వర్ధమాన్‌ అభినందన్‌ను విడుదల చేస్తున్నామని పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ చెప్పడంపై స్పందిస్తూ..‘దీన్ని మేం సుహృద్భావ చర్యగా పరిగణించడం లేదు. జెనీవా నిబంధనల ప్రకారమే వర్ధమాన్‌ను విడుదల చేస్తున్నారు. బాలాకోట్‌ దాడుల్లో ఉగ్రవాదులకు తీవ్రనష్టం చేకూర్చినట్లు మా దగ్గర పక్కా సాక్ష్యాలు, ఆధారాలు ఉన్నాయి. వైమానిక దాడిలో భాగంగా మేం సరైన లక్ష్యాలనే ఛేదించాం. ఈ దాడుల్లో జరిగిన నష్టం, చనిపోయిన ఉగ్రవాదుల సంఖ్యపై ఇప్పటికిప్పుడు ఓ అంచనాకు రావడం సరికాదు’అని వ్యాఖ్యానించారు. 

ఎలాంటి దాడినైనా తిప్పికొడతాం: ఆర్మీ
సరిహద్దులో ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఎదుర్కొనేందుకు ఆర్మీ సర్వసన్నద్ధంగా ఉందని ఆర్మీ మేజర్‌ జనరల్‌ ఎస్‌.ఎస్‌.మహల్‌ తెలిపారు. ‘భద్రతాపరంగా ఎలాంటి సవాళ్లు ఎదురైనాఎదుర్కొనేందుకు సాయుధ బలగాలను సిద్ధంగా ఉంచాం. భారత్‌–పాక్‌ల మధ్య ఉన్న అంతర్జాతీయ సరిహద్దుతో పాటు నియంత్రణ రేఖ(ఎల్వోసీ) వెంట గగనతల రక్షణ వ్యవస్థల ను ఏర్పాటు చేశాం. అలాగే ఆర్మీని హై అలర్ట్‌లో ఉంచాం. ప్రస్తుతం భారత్‌ పూర్తి సన్నద్ధతతో ఉంది. పాక్‌ నుంచి ఎలాంటి కవ్వింపు చర్య ఎదురైనా తిప్పికొడతాం’అని హెచ్చరించారు. 

పాక్‌కు దిమ్మతిరిగేలా జవాబిస్తాం: నేవీ 
సముద్ర జలాల్లో పాక్‌ దుస్సాహసానికి పాల్పడితే దీటుగా తిప్పికొడతామని భారత నేవీ రేర్‌ అడ్మిరల్‌ దల్బీర్‌సింగ్‌ గుజ్రాల్‌ తెలిపారు. ‘భూ, వాయు, జల మార్గాల్లో దేశానికి ఎదురయ్యే ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొనేందుకు త్రివిధ దళాలు సిద్ధంగా ఉన్నాయి. పాక్‌ ఒకవేళ కవ్వింపు చర్యలకు దిగితే త్వరితగతిన, ఊహకందని రీతిలో జవాబిస్తాం. భూ, వాయు, జలమార్గాల్లో పాక్‌ దాడిని తిప్పికొట్టేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నాం. త్రివిధ దళాలైన మేం దేశం, దేశప్రజల రక్షణకు కట్టుబడి ఉన్నాం’ అని పేర్కొన్నారు.
 
బాలాకోట్‌ పైలట్‌ ప్రాజెక్టే..
పాకిస్తాన్‌లో జైషే ఉగ్రవాదులు లక్ష్యంగా భారత వాయుసేన(ఐఏఎఫ్‌) చేసిన దాడిపై ప్రధాని మోదీ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. బాలాకోట్‌లో జరిగింది ‘పైలట్‌ ప్రాజెక్టు’ మాత్రమేననీ, నిజమైన ప్రాజెక్టును ఇప్పుడు చేపట్టాల్సి ఉందని తెలిపారు. ఢిల్లీలో గురువారం జరిగిన ఓ కార్యక్రమంలో శాస్త్రవేత్తలకు అవార్డుల ప్రదానోత్సవం అనంతరం మాట్లాడుతూ..‘మీరంతా మీ జీవితాలను ల్యాబుల్లోనే గడుపుతారు. తొలుత పైలట్‌ ప్రాజెక్టును చేపట్టడం మీ అలవాటు. అనంతరం దాన్ని క్రమంగా విస్తరిస్తారు. ఇటీవల ఓ పైలట్‌ ప్రాజెక్టు(బాలాకోట్‌) జరిగింది. ఇప్పుడు నిజమైన ప్రాజెక్టును చేపట్టాలి. ఇంతకుముందు చేసింది ప్రాక్టీస్‌ మాత్రమే’ అని మోదీ పేర్కొన్నారు. దీంతో సభికులు ఒక్కసారిగా పెద్దఎత్తున కరతాళధ్వనులతో తమ హర్షాన్ని తెలియజేశారు. 

మరిన్ని వార్తలు