హైవేపై యుద్ధవిమానాల ల్యాండింగ్‌

25 Oct, 2017 01:21 IST|Sakshi

లక్నో–ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వేపై దిగిన మిరేజ్‌–2000, సుఖోయ్‌ 30, సీ–130జే

యుద్ధం, విపత్తుల సమయాల్లో సన్నద్ధతను పరీక్షించిన వైమానిక విభాగం

లక్నో: అత్యవసర సమయాల్లో జాతీయ రహదారులను రన్‌వేలుగా వాడుకునేం దుకు లక్నో–ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌వే పై భారతీయ వాయుసేన (ఐఏఎఫ్‌) నిర్వహించిన ‘టచ్‌ అండ్‌ గో’ కసరత్తులు కళ్లుచెదిరేలా సాగాయి. ఐఏఎఫ్‌ యుద్ధ, రవాణా విమానాలు మంగళవారం ఎక్స్‌ప్రెస్‌వేపై దిగి అనంతరం గాల్లోకి ఎగురుతూ తమ సామర్థ్యాన్ని చాటి చెప్పాయి.

లక్నోకు 65 కి.మీ. దూరంలోని ఉన్నావ్‌ జిల్లా బంగర్‌మౌ సమీపంలో చేపట్టిన కసరత్తుల్లో 12కు పైగా మిరేజ్‌–2000, సుఖోయ్‌ 30 యుద్ధ విమానాలతో పాటు 35 వేల కిలోల బరువైన సీ–130జే సూపర్‌ హెర్క్యులస్‌ విమానం పాలుపంచుకున్నాయి. విన్యా సాలు కొనసాగిన ప్రాంతానికి ఐఏఎఫ్‌ ప్రత్యేక బలగాలైన గరుడ్‌ కమాండోలు భద్రత కల్పించారు.

ఈ డ్రిల్‌లో ముందుగా సీ–130జే రవాణా విమానం తాత్కాలిక రన్‌వేపై దిగగా అందులో నుంచి గరుడ్‌ కమాండోలు తమ వాహనాలతో బయటకు వచ్చి హైవేకు ఇరువైపులా రక్షణ కవచంలా నిలబడ్డారు. అనంతరం ప్రధాన ఆకర్షణగా నిలిచిన సుఖోయ్‌ 30, మిరేజ్‌ 2000లు ఎక్స్‌ప్రెస్‌వేపై దిగుతూ కళ్లు చెదిరే వేగంతో గాల్లోకి ఎగిరాయి.

వరదలు, ఇతర ప్రకృతి విపత్తుల సమయంలో ప్రాణ రక్షణ, సహాయక చర్యల కోసం సీ–130జే విమానం సాయపడుతుందని రక్షణ శాఖ(సెంట్రల్‌ కమాండ్‌) పీఆర్వో గార్గి మాలిక్‌ సిన్హా చెప్పారు. ‘ఈ విమానం పెద్ద మొత్తంలో సహాయక సామగ్రిని మోసుకెళ్లగలదు. ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఉపయోగించవచ్చు’ అని ఆమె తెలిపారు. యుద్ధం, విపత్తుల సమయాల్లో వాయుసేన సన్నద్ధతను పరీక్షించేందుకు ఈ కసరత్తులు నిర్వహించినట్లు సిన్హా వెల్లడించారు.


ప్రధాన ఆకర్షణగా సీ–130జే
సీ–130జే విమానాలు 2010లో వాయుసేనకు అందుబాటులోకి రాగా.. ఎక్స్‌ప్రెస్‌ వేపై దిగడం మాత్రం ఇదే మొదటిసారి.. ఒకేసారి 200 మంది కమాండోలను తరలించే సామర్థ్యం దీని సొంతం. ధర దాదాపు రూ. 900 కోట్లు. ఇక 2015, 16ల్లో మిరేజ్‌–2000 విమానాలు యమునా ఎక్స్‌ప్రెస్‌ వేపై ‘టచ్‌ అండ్‌ గో’ డ్రిల్‌లో పాలుపంచుకోగా.. గత నవంబర్‌లో లక్నో–ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌ వేపై ఆరు సుఖోయ్‌–30 జెట్‌లు యుద్ధ సన్నద్ధతను చాటిచెప్పాయి.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు