తప్పుడు ప్రచారం చేయడం తగదు

5 Jul, 2020 01:58 IST|Sakshi

గల్వాన్‌ సైనికులకు చికిత్సపై భారత ఆర్మీ హితవు

న్యూఢిల్లీ: గల్వాన్‌ లోయలో జరిగిన ఘర్షణలో గాయపడిన భారత సైనికులకు సరైన చికిత్స అందించడం లేదన్న విమర్శలను భారత సైన్యం ఖండించింది. ఆధారాల్లేకుండా ఆరోపణలు చేయడం తగదని హితవు పలికింది. లేహ్‌లోని జనరల్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సైనికులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 3న పరామర్శించిన సంగతి తెలిసిందే. సంబంధిత ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ అక్కడ సరైన వసతులు లేవని, సైనికులను ఎవరూ పట్టించుకోవడం లేదంటూ కొందరు వ్యాఖ్యానాలు జోడిస్తున్నారు. దీనిపై భారత సైన్యం శనివారం స్పందించింది. ఒక ప్రకటన విడుదల చేసింది. తప్పుడు ప్రచారం చేయొద్దని కోరింది. వీర సైనికులకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలియజేసింది. లేహ్‌లోని జనరల్‌ హాస్పిటల్‌లో కొన్ని వార్డులను కరోనా ఐసోలేషన్‌ వార్డులుగా మార్చారని, అందుకే ఆడియో వీడియో ట్రైనింగ్‌ హాల్‌ను ప్రత్యేక వార్డుగా తీర్చిదిద్ది, సైనికులకు వైద్య సేవలు అందిస్తున్నట్లు వెల్లడించింది. అక్కడ సకల సదుపాయాలు ఉన్నాయని పేర్కొంది.

మరిన్ని వార్తలు