పాకిస్తాన్ తీరుపై ఆర్మీ చీఫ్‌ ఆగ్రహం

4 May, 2020 17:19 IST|Sakshi

న్యూఢిల్లీ: పాకిస్తాన్‌ దుస్సాహసానికి భారత సైన్యం ఎల్లప్పుడు దీటుగా బదులిస్తుందని ఆర్మీ చీఫ్‌  మనోజ్‌ ముకుంద్‌ నరవాణే అన్నారు. భారత్‌లో పదే పదే అక్రమ చొరబాట్లకు ప్రయత్నిస్తున్న పాకిస్తాన్‌కు సరైన బుద్ధి చెబుతామన్నారు. సోమవారం పీటీఐతో మాట్లాడిన ఎంఎం నరవాణే.. హంద్వారా ఎదురుకాల్పుల్లో వీర మరణం పొందిన కల్నల్‌, భద్రతా సిబ్బంది, పోలీసులు, సైనికుల త్యాగాన్ని కీర్తించారు. గ్రామస్తులు, బందీలకు ఎటువంటి గాయాలు కాకుండా కమాండింగ్‌ ఆఫీసర్‌ కల్నల్‌ అశుతోశ్‌ శర్మ ఆధ్వర్యంలో చేపట్టిన ఆపరేషన్‌ను సమర్థవంతంగా పూర్తి చేశారని పేర్కొన్నారు. అదే విధంగా దేశంలోకి అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నిస్తున్న దాయాది దేశం తీరుపై ఎంఎం నరవాణే మండిపడ్డారు. (భారత్‌ మందులు ఎగుమతి చేస్తుంటే.. పాక్‌..)

‘‘ప్రస్తుత పరిణామాలన్నింటినీ చూస్తుంటే కోవిడ్‌-19 వల్ల తలెత్తిన సంక్షోభం నుంచి గట్టెక్కడం కంటే పొరుగు దేశంలో చొరబడేందుకే పాకిస్తాన్‌కు ఎక్కువ ఆసక్తి ఉన్నట్లు అనిపిస్తోంది. కశ్మీరీల స్నేహితుడిని అంటూ పాక్‌ పదే పదే ప్రగల్భాలు పలుకుతుంది కదా. మారణకాండ, ఉగ్రదాడులు సాగించడమేనా స్నేహం అంటే. పాకిస్తాన్‌ ఉగ్రవాదాన్ని, ఉగ్రవాదులను ప్రోత్సహించే గుణాన్ని త్యజించనంత వరకు.. భారత్‌ వాళ్లకు సరైన రీతిలో బదులు ఇస్తూనే ఉంటుంది’’అని హెచ్చరికలు జారీ చేశారు. కోవిడ్‌-19పై సార్క్‌ దేశాల వీడియో కాన్ఫరెన్స్‌లో కశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందంటూ పాకిస్తాన్‌ ఆ వేదికపై తన సంకుచిత బుద్ధిని బయటపెట్టుకుందని ఈ సందర్భంగా నరవాణే విమర్శించారు. కరోనాపై పోరాటం చేసేందుకు ఆ దేశం సుముఖంగా ఉన్నట్లు కనిపించడం లేదన్నారు.(కల్నల్‌ సహా ఐదుగురు జవాన్ల వీరమరణం)

కాగా చంగీముల్లా గ్రామానికి చెందిన మహిళలు, చిన్నారులు సహా సుమారు 11 మందిని ఉగ్రవాదులు ఓ ఇంట్లో బందీలు చేసినట్లు సమాచారం అందించిన వెంటనే.. కల్నల్‌ శర్మ, పోలీస్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఖాజీ నేతృత్వంలో సైన్యం, పోలీసులు సంయుక్త ఆపరేషన్‌ చేపట్టి వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రెండు వర్గాల మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకోవడంతో.. కల్నల్, మేజర్‌ స్థాయి అధికారులు, ఇద్దరు జవాన్లతోపాటు పోలీస్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ అమరులయ్యారు.  కశ్మీర్‌లోని కుప్వారా జిల్లా హంద్వారా ప్రాంతంలో శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.(ఓ వీర సైనికా నీకు వందనం)

>
మరిన్ని వార్తలు