సరిలేరు.. మీకెవ్వరు..

15 Jan, 2020 14:19 IST|Sakshi

శ్రీనగర్‌ : జమ్మూకశ్మీర్‌లోని చాలా ప్రాంతాలను మంచు కమ్మేసింది. ఓ వైపు ఎడతెరిపి లేని మంచు వర్షం.. మరోవైపు గడ్డకట్టించే చలితో జనజీవనం స్తంభించింది. అలాంటి సమయంలో కశ్మీర్‌ లోయలో ఓ గర్బిణికి పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. ఎటు చూసినా అడుగుల మేర మంచు పేరుకుపోవడంతో.. బయట అడుగుపెట్టలేని పరిస్థితి. దీంతో ఆమె కుటుంబసభ్యులు ఆందోళన చెందారు. అంతా ఆశలు వదిలేసుకున్నారు. ఆ సమయంలోనే మేమున్నాము అంటూ భారత ఆర్మీ ముందుకు వచ్చింది. 

దాదాపు 100 మంది సైనికులు నాలుగు గంటల పాటు శ్రమించి.. స్ట్రెచర్‌లో ఆస్పత్రిలో చేర్పించారు. విపరీతమైన మంచు కురుస్తున్నా లెక్కచేయకుండా ఆ గర్భిణికి సాయం చేశారు. 30 మంది పౌరులు కూడా సైనికులతో పాటు ముందుకు సాగారు. కాగా, ఆ గర్భిణి ఆస్పత్రిలో పండంటి బిడ్డకు జన్మనిచ్చారు.  ఇందుకు సంబంధించిన వీడియోను చినార్‌ కార్ప్స్‌ ట్విటర్‌లో షేర్‌ చేశారు. ‘మన ఆర్మీ శౌర్యానికి, వృత్తి నైపుణ్యానికి మారుపేరు. ప్రజలకు సహాయం అవసరమైనప్పుడు మన సైన్యం ఎలా స్పందిస్తుందో.. మరోసారి రుజువైంది. ఇది మానవతా స్ఫూర్తికి గర్వకారణం. మన ఆర్మీని చూస్తే గర్వంగా ఉంది’ అని ట్విటర్‌లో పేర్కొన్నారు. మరీ ముఖ్యంగా బుధవారం భారత ఆర్మీ డే కావడం.. ఈ వీడియో బయటకు రావడంతో ప్రౌడ్‌ ఆఫ్‌ ఆర్మీ అంటూ నెటిజన్లు సెల్యూట్‌ చేస్తున్నారు.  
 

మరిన్ని వార్తలు