కాంగోలో భారత ఆర్మీ అధికారి మృతి

12 Sep, 2019 19:07 IST|Sakshi

కిన్షాసా:  ఐక్యరాజ్యసమితి మిషన్‌లో భాగంగా డీఆర్‌ కాంగోలో విధులు నిర్వహిస్తున్న భారత ఆర్మీ అధికారి లెఫ్టినెంట్‌ కల్నల్‌ గౌరవ్‌ సోలంకి మృతిచెందారు. ఈ నెల 8న కయాకింగ్‌కు దగ్గర్లోని చెగెరా ద్వీపం వద్ద ఆయన కనిపించకుండా పోయారు. ఆయన కోసం తీవ్రంగా గాలించిన అధికారులు గురువారం కివూ నదిలో ఆయన మృతదేహాన్ని వెలికితీశారు. కాగా ఐక్యరాజ్యసమితి మిషన్‌లో భాగంగా డెమోక్రటిక్ రిపబ్లిక్ కాంగోలో మిలిటరీ స్టాఫ్ అధికారిగా పనిచేస్తున్న భారత ఆర్మీ అధికారి గత నాలుగు రోజుల నుంచి ఆర్మీ శిబిరంలో కనిపించకుండా పోయారని కాంగో ఆర్మీ అధికారులు ప్రకటించారు.

దీంతో అతని ఆచూకి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా తప్పిపోయిన అధికారి భారత్‌కు చెందిన లెఫ్టినెంట్ కల్నల్‌ గౌరవ్‌ సోలంకిగా గుర్తించారు. అయితే ఈ నెల 8న కాంగోలోని టెచెరా ద్వీపానికి సమీపంలో ఉన్న కివు సరస్సులోకి కాంగో ఆర్మీ బృందం బోటింగ్‌కు వెళ్లింది. ఆ బృందంలో గౌరవ్‌ సోలంకి కూడా ఉన్నారు. కివు సరస్సులో అధికారులంతా బోటింగ్‌ చేశారు. బోటింగ్‌ ముగిసిన అనంతరం ఆ ఆర్మీ అధికారుల బృందం తిరగి కాంగోకి చేరుకుంది. కానీ, శనివారం ఆర్మీ శిబిరంలో అధికారులకు సోలంకీ కనిపించకపోవడంతో ఆయన తప్పిపోయినట్లు అధికారులు ప్రకటించారు. 

అయితే బోటింగ్‌కు వెళ్లిన ప్రాంతంలోనే తప్పిపోయి ఉంటారని అధికారులు భావించి.. కివు సరస్సులో హెలికాప్టర్లు, స్పీడ్‌ బోట్లను ఉపయోగించి గాలింపు చర్యలు మొదలుపెట్టారు. దీంతో గురువారం ఉదయం పదకొండు గంటలకు టెచెరా ద్వీపంలోని కివు సరస్సులో సుమారు కిలోమీటరు దూరంలో సోలంకీ మృతదేమం లభ్యమైంది. దీంతో కాంగో ఆర్మీ అధికారులు సోలంకి మృతి చెందారని అధికారికంగా ప్రకటించారు. దాంతోపాటు భారత ఆర్మీ అధికారులకు సమాచారం అందించారు. 

మరిన్ని వార్తలు