హిమాలయాల్లో మంచుమనిషి.. యతి పాదముద్రలు లభ్యం!

30 Apr, 2019 15:09 IST|Sakshi

పాదముద్రలను గుర్తించినట్టు భారత ఆర్మీ ట్వీట్‌

అభినందనలు తెలిపిన బీజేపీ నేత.. గౌరవించాలంటూ సూచన

బీజేపీ నేతను ట్రోల్‌ చేస్తున్న నెటిజన్లు

న్యూఢిల్లీ: హిమాలయ పర్వతాల్లో తొలిసారిగా మంచుమనిషి ‘యతి’ పాదముద్రలను కనుగొన్నట్టు భారత సైన్యం సోమవారం ట్వీట్‌ చేసింది. ఈ నెల 9వ తేదీన హిమాలయాల్లోని మాకులా బేస్‌ క్యాంప్‌ సమీపంలో భారత ఆర్మీకి చెందిన పర్వతాధిరోహణ బృందం పౌరాణిక మృగంగా భావించే యతి పాదముద్రలు కనుగొన్నదని, యతీ పాదముద్రలు 32 అంగుళాల పొడవు, 15 అంగుళాల వెడల్పు ఉన్నాయని, మాకులా-బరూన్‌ జాతీయ పార్కు సమీపంలో అత్యంత అరుదుగా ఈ మంచుమనిషి కనిపించేదని ఆర్మీ తన అధికారిక ట్విటర్‌ ఖాతాలో ప్రకటించింది. భారత ఆర్మీ ప్రకటనపై బీజేపీ మాజీ ఎంపీ తరుణ్‌ విజయ్‌ హర్షం వ్యక్తం చేశారు. అయితే, యతీని ఆర్మీ మృగంగా ప్రకటించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘అభినందనలు. మిమ్మల్ని చూసి మేం గర్విస్తున్నాం. భారత ఆర్మీ పర్వతాధిరోహణ బృందానికి నా సెల్యూట్‌. కానీ, ఒక భారతీయుడిగా యతిని మృగంగా అభివర్ణించకండి. కావాలంటే మంచుమనిషి అని పేర్కొనండి’ అంటూ ఆయన ట్వీట్‌ చేశారు.

ప్రస్తుతం సోషల్‌ మీడియాలో యతీ పదం ట్రెండ్‌ అవుతోంది. ముఖ్యంగా బీజేపీ నేత తరుణ్‌ విజయ్‌ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు సెటైర్లు జోకులు వేస్తున్నారు. ‘సర్‌. యతీని స్నోపర్సన్‌గా పేర్కొనండి. ఎవరికీ తెలుసు. ఆర్మీ కనుగొన్న పాదముద్రలు యతీ భార్యవి కావొచ్చు. లింగభేదాన్ని గుర్తించాల్సిన అవసరముంది’ అని ఒకరు కామెంట్‌ చేయగా.. భారతీయ భాషలో రాయండి.. ఆంగ్లంలో రాసి యతీని అవమానించకండి అంటూ మరొకరు సెటైర్‌ వేశారు. మోడీజీకి ఓటు వేసేందుకు యతీ బయటకు వచ్చినట్టుందని ఒకరు కామెంట్‌ చేయగా.. ఆ పాదముద్రలు మంచులో మార్నింగ్‌ వాక్‌కు వెళ్లిన అమిత్‌ షావి అయ్యుండవచ్చునని మరొకరు చమత్కరించారు.

మరిన్ని వార్తలు