మా పేరు ‘కరోనా’ కాదు.. మేం భారతీయులమే

26 Jun, 2020 13:02 IST|Sakshi

కోల్​కతా: చైనా ఈ పేరు వినగానే అమ్మో వాళ్లా! మొన్నటికి మొన్న ‘కరోనా’ తెచ్చారు. ఇప్పుడేమో భారత భూభాగం తమదేనంటున్నారు. వాళ్లను ఊరికే వదలకూడదు. చైనాతో వాణిజ్య సంబంధాలను తెంచేసుకోవాలి. ఆర్థికంగా కుంగదీసి గొంతు నులిమెయ్యాలి అంటూ చైనీయుల గురించి, వారి ఆహారపు అలవాట్ల గురించి కఠినంగా మాట్లాడుకుంటున్న వాళ్లు ఎందరో. ఇది నాణానికి ఓ వైపైతే.. మరోవైపు తామూ భారతీయులమేనంటూ, మమ్మల్ని వేరుగా చూడొద్దంటూ వేలాది భారతీయ చైనీయులు గళం విప్పుతున్నారు. మమ్మల్ని ‘కరోనా’ అని పిలుస్తుంటే మానసికంగా కుంగిపోతున్నామని, ఉన్న ఊరిని, పెంచుకున్న బంధాలను వదిలేసి ఎలా వెళ్లిపొమ్మంటారని ప్రశ్నిస్తున్నారు. పోలిక చైనీయులదే అయినా పాలు తాగి పెరిగింది భరతమాత గుండెలపైనేనంటున్నారు.

కోల్​కతా మహానగరం మన దేశంలో చైనీయులు సెటిల్ అయిన ప్రదేశం. ఇక్కడి చైనా టౌన్ లో ఐదు వేల మంది చైనా మూలాలు కలిగిన వారు నివసిస్తున్నారు. ఇండియాలో చైనా పుట్టుపూర్వోత్తరాలు కలిగిన వ్యక్తులు నివసిస్తున్న ఏకైక ప్రాంతం ఇదే. కోవిడ్–19 వచ్చిన తర్వాత వీళ్లను ఇరుగుపొరుగు వాళ్లు కరోనా అంటూ సూటిపోటి మాటలంటున్నారట. వాళ్ల రెస్టారెంట్ల వైపు కనీసం ఎవరూ కన్నెత్తి కూడా చూడటం లేదట.(125 రోజుల్లో 1.25 కోట్ల ఉద్యోగాలు!)

70 ఏళ్ల క్రితమే కోల్​కతాకు..
దాదాపు ఏడు దశకాల కిందట చైనా నుంచి వచ్చిన కొందరు కోల్​కతాలో నివసించడం మొదలుపెట్టారు. వారి తర్వాత మూడు తరాలు ఇక్కడే పుట్టి పెరిగారు. స్వేచ్ఛగా జీవిస్తూ, వ్యాపారాలు చేసుకుంటున్న వాళ్ల జీవితాలు కరోనా, గల్వాన్ ఘటనలతో తలకిందులయ్యాయి. జూన్ 15న గల్వాన్ ఘటనతో సగటు చైనా టౌన్ వాసి ఇళ్లలో నుంచి బయటకు రావడానికి వణికిపోయాడు. భారతీయులు తమపై దాడి చేస్తారని భావించి ఇళ్లకే పరిమితమయ్యారు. 

‘మేము ఇక్కడ ఓటు వేస్తున్నాం. ఇక్కడే పుట్టాం. పెరిగాం. కానీ కొందరు చదువుకోని, చరిత్ర తెలియని మూర్ఖులు మమ్మల్ని వెటకారంగా పిలుస్తూ అవమానిస్తున్నారు. మమ్మల్ని తిరిగి వెనక్కి వెళ్లిపోవాలంటూ వీధుల్లో తిరుగుతూ కేకలు పెడుతున్నారు’ అని చైనా టౌన్ లో జీవిస్తున్న 65 ఏళ్ల లీ యావో సియన్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘భారతీయ చైనీయులు ఎప్పటినుంచో ఇండియాలో జీవిస్తున్నారు. మాకు భారతీయులతో ఎనలేని అనుబంధం ఉంది. మమ్మల్ని వేరు చేసి చూడొద్దు’ అని చైనా టౌన్ లో ఓ రెస్టారెంట్ ను నడుపుతున్న ఫ్రెడ్డీ లావో కోరారు. (నేను ఇందిరా మనువరాలిని..)

కోల్ కతా చైనా టౌన్ ప్రఖ్యాత చైనా వంటకాలతో పాటు చైనా లెదర్ ఉత్పత్తులకు బాగా ప్రసిద్ధి. ఇక్కడ దాదాపు 40 రెస్టారెంట్లు, చిరుతిళ్ల బండ్లు, ఫ్యాక్టరీలు ఉన్నాయి. లెదర్ ను ప్రాసెస్ చేసే 350 యూనిట్లను కోల్​కతా లెదర్ కాంప్లెక్స్​కు ఇటీవల మార్చారు. తమ షిప్ మెంట్లను కస్టమ్ ఆఫీసర్లు అడ్డుకుంటున్నారని లెదర్ కంపెనీల యజమానులు వాపోతుండగా, అలాంటిదేమీ లేదని ఆఫీసర్లు చెబుతున్నారు.

‘మేమూ భారతీయులమే’
‘కరోనా వల్ల మేం ఆర్థికంగానే నష్టపోయాం. కానీ, ఇండియా–చైనా వివాదం వల్ల అభద్రతకు గురవుతున్నాం. మీలా మేం కూడా భారతీయులమే. మమ్మల్ని ఎక్కడికి వెళ్లమంటారు’ అని చైనా టౌన్ లోని ఇండో చైనీయులు వాపోతున్నారు. 

2017లో డొక్లాం ఉద్రిక్తల సమయంలో వారు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొలేదని లెదర్ యూనిట్లను నడుపుతున్న లీ చెప్పారు. 1962 యుద్ధ సమయంలో మాత్రం ఇండియాలో ఉన్న చైనీయులందరినీ రాజస్థాన్ లోని డియోలిలో ఏర్పాటు చేసిన డిటెన్షన్ సెంటర్ కు తరలించారని వెల్లడించారు.

చైనాలో టౌన్ లో ఫేమస్ రెస్టారెంట్లు బీజింగ్, గోల్డెన్ ఎంపైర్. బీజింగ్ ను ఇంకా తెరవక పోగా, నాలుగు రోజుల క్రితం తెరిచిన గోల్డెన్ ఎంపైర్ నుంచి ఆహారం కొనే వాళ్లు కరువయ్యారు. ‘మేం కొంతమంది రెగ్యులర్ కస్టమర్లకు ఫోన్ చేసి మాట్లాడాం. అన్ని జాగ్రత్తలతో ఆహారం తయారు చేస్తున్నామని చెప్పాం. కానీ వాళ్లు మీరు చైనీయులు కదా, మీ రెస్టారెంట్ నుంచే కరోనా వస్తుంది. మాకు ఫుడ్ వద్దు’అని చెప్పారని హోటల్ యజమాని హెన్రీ చెప్పారు.

‘నేను, మా నాన్న ఇక్కడే పుట్టాం. మా తాతగారు 1947కి ముందు కోల్​కతా వచ్చి స్థిరపడ్డారు. మా ముఖాలు చైనీయుల్లా కనిపిస్తున్నా మేం కూడా భారతీయులమే. ప్రస్తుతం మా పిల్లలు ఇళ్లు వదిలి బయటకు వెళ్లలేని స్థితి నెలకొంది. కేవలం చైనీయుల కోసం కట్టించిన పార్కుకి మాత్రమే వాళ్లు వెళ్తున్నారు’ అని హెన్రీ ఆవేదన చెందారు.

చైనా టౌన్ లో చైనా వస్తువులు తగలబెడుతూ నిరసనలు తెలిపేందుకు పలువురు చేసిన ప్రయత్నాలను ఇండో చైనీయులు తృణమూల్ నేతల సాయంతో అతి కష్టం మీద ఆపించారు. ‘వాళ్లు అభద్రత, భయంతో బాధపడుతున్నారు. మమ్మల్ని కలిసి వాళ్ల పరిస్థితిని వివరించారు. దాంతో చైనా టౌన్ లో అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాం. పోలీసులతో పహారా కాయిస్తున్నాం. అక్కడ ఉంటున్న వారిలో దాదాపు 5 వేల మంది ఓటు హక్కును కలిగివున్నారు. కాబట్టి, వాళ్లందరూ భారతీయులే’ అని తృణమూల్ కౌన్సిలర్ ఫయాజ్ ఖాన్ పేర్కొన్నారు.

చైనా నుంచి ఆగిన రవాణా
చైనా టౌన్ లో తయారవుతున్న చాలా వస్తువులకు చైనా దేశం నుంచి ముడి సరుకు అవసరం. అక్కడి నుంచి వందల సంఖ్యలో కన్​సైన్​మెంట్లు వస్తుంటాయి. కానీ, వీటిని అధికారులు అడ్డుకుంటున్నారని భారతీయ చైనీయులు ఆరోపిస్తున్నారు. బాయ్ కాట్ చైనాలో భాగంగానే ఇదంతా చేస్తున్నారని అంటున్నారు. దీనిపై స్పందించిన ఓ సీనియర్ కస్టమ్స్ ఆఫీసర్ చైనా కార్గోలను ఆపాలనే ఆదేశాలేవీ రాలేదని పేర్కొన్నారు. కరోనా వల్ల తక్కువ స్టాఫ్ తో విధులు నిర్వహిస్తున్నామని అందుకే కొంచెం ఆలస్యమవుతోందని చెప్పారు.

కార్గోల అడ్డగింతపై వ్యవస్థాగత ఆర్డర్ పాస్ చేసి ఉండొచ్చని కోల్​కతా లెదర్ అసోసియేషన్ సెక్రటరీ ఇమ్రాన్ ఖాన్ అనుమానం వ్యక్తం చేశారు. అందుకే వారాల తరబడి కార్గోలు ఎయిర్ పోర్టుల్లో ఆగిపోయాయన్నారు.

>
మరిన్ని వార్తలు