'రికార్డు' కష్టాలు..!

28 Jan, 2016 19:01 IST|Sakshi
'రికార్డు' కష్టాలు..!

ప్రపంచరికార్డు తెచ్చిపెట్టిన ఆ వేళ్లే ఇప్పుడు అతడికి సమస్యగా మారాయి. అదృష్టంతో పాటు.. సమస్యనూ తెస్తున్నాయి. కార్పెంటర్ వృత్తితో కాలం గడుపుదామనుకున్న అతడికి అధికంగా ఉన్న వేళ్లు ఇబ్బంది పెడుతున్నాయి. మనిషికి సహజంగా ఉండాల్సిన వాటి కన్నా 8 వేళ్లు ఎక్కువ ఉండటం ప్రత్యేక గుర్తింపు తెచ్చినా...వృత్తి  జీవితానికి మాత్రం ఇబ్బందిగానే మారింది.

గుజరాత్‌లోని హిమ్మత్ సాగర్ కు చెందిన దేవేంద్ర సుథార్.. ప్రపంచంలోనే ఎవ్వరికీ లేనన్ని వేళ్లతో ఏకంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కాడు. రెండు చేతులకూ కలిపి 4, రెండు కాళ్లకు కలిపి 4 అధికంగా ఉన్న వేళ్లతో మొత్తం 28 వేళ్లు ఉన్నాయి. 43 ఏళ్ల వయసున్న దేవేంద్ర కార్పెంటర్ పనిచేస్తూ జీవనాన్నిగడుపుతున్నాడు. చాలా అరుదుగా కనిపించే ఈ ప్రత్యేకత (పోలిడాక్టిలిజమ్) అతడి జీవనోపాధికి అడ్డంకిగా మారింది. కార్పెంటర్ పని చేసేటప్పుడు అధికంగా ఉన్న వేళ్లు అడ్డు వస్తుండటంతో అవి తెగిపోకుండా పని చేయడం కష్టమౌతోంది.

ఇప్పుడు రికార్డు తెచ్చిపెట్టిన సంతోషం కన్నా వేళ్ళతో ఇబ్బందే అతడికి ఎక్కువగా ఉంది. ఎక్కువగా ఉన్న వేళ్లు తనను సెలబ్రిటీని చేశాయని,  అందరూ తనను చూసేందుకు  వస్తుంటే ఎంతో ఆనందంగా ఉందని దేవేంద్ర చెప్తున్నాడు. కానీ అవే వేళ్లు తన జీవన గమనానికి అడ్డంకిగా మారాయని, కార్పెంటర్ పనిచేయడం ఎంతో కష్టంగా ఉందని అంటున్నాడు. ఎక్కువ వేళ్లు ఉండటంతో ఎంతో అధికంగా శ్రమపడాల్సి వస్తోందని చెబుతున్నాడు. తన సమస్యకు పరిష్కారం ఏంటో అర్థం కాక ఆందోళన చెందుతున్నాడు. అటు రికార్డును తెచ్చిపెట్టిన వేళ్లను ఏమీ చేయలేక, ఇటు రోజువారీ జీవనంలో కష్టాలు పడలేక సతమతమౌతున్నాడు.

మరిన్ని వార్తలు