రూ.200లకే చిట్స్‌.. మాస్‌ కాపీయింగ్‌

24 May, 2017 15:50 IST|Sakshi
రూ.200లకే చిట్స్‌.. మాస్‌ కాపీయింగ్‌

ఉత్తరప్రదేశ్‌లోని ఘాజిపూర్‌లో డిగ్రీ మూడో సంవత్సర పరీక్షల్లో భారీ స్కాం బయటపడింది. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల నుంచి రూ.200 కలెక్ట్ చేస్తున్న ఓ వ్యక్తి వారికి జవాబు పత్రాలు అందిస్తున్నాడు. ఈ స్కాంపై స్టింగ్‌ ఆపరేషన్‌ నిర్వహించిన మెయిల్‌ టుడే ఓ వీడియోను విడుదల చేసింది. ఘాజీపూర్‌లోని స్వామి సహజానంద పీజీ కళాశాలలో ఈ నెల 10వ తేదీన జరిగిన బీఏ మూడో సంవత్సర పరీక్షల్లో మాస్‌ కాపీయింగ్‌ జరిగింది. వెంట తెచ్చుకున్న చిట్స్‌, డబ్బులు ఇచ్చిన వ్యక్తి అందించిన పత్రాలతోనూ విద్యార్థులు కాపీయింగ్‌కు పాల్పడ్డారు.

ఈ కళాశాలలో మాస్‌కాపీయింగ్‌ కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నట్లు మెయిల్‌ టుడే పేర్కొంది. అయినా అధికారులు మొద్దు నిద్ర మానుకోవడం లేదని విమర్శించింది. ఏటా విద్యార్థుల నుంచి వసూలు చేసే డబ్బు మాత్రం పెరుగుతోందని చెప్పింది. పరీక్ష హాల్లో విద్యార్థుల వద్దకు వచ్చే బంట్రోతు డబ్బును కలెక్ట్‌ చేస్తాడని వివరించింది. మాస్‌ కాపీయింగ్‌పై ప్యూన్‌ను ప్రశ్నించేందుకు మెయిల్‌ టుడే ప్రయత్నించగా అతను తప్పించుకుని వెళ్లిపోయాడు.

ఈ ఘటనపై విచారణకు ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిసింది. కాగా, కళాశాల పరిపాలన వ్యవస్ధలో పనిచేసే ఓ వ్యక్తి చెప్పిన వివరాల ప్రకారం.. కొద్ది సంవత్సరాల నుంచి డిగ్రీ పరీక్షల్లో ఇదే తంతు జరుగుతోంది. అలాగే కాపీయింగ్‌ చేయడానికి విద్యార్థులు ఇన్విజిలేటర్లకు డబ్బులు ఇవ్వడం కూడా ఆనవాయితీగా సాగుతోందని చెప్పారు. తాజా స్టింగ్‌ ఆపరేషన్‌ ఏళ్లుగా ఉత్తరప్రదేశ్‌లో ఉన్న విద్యా వ్యవస్ధ పరిస్ధితి ఇంకా మరలేదనడానికి నిదర్శనంగా మారింది.

మాస్‌ కాపీయింగ్‌పై ఉత్తరప్రదేశ్‌ విద్యాశాఖ మంత్రి దినేశ్‌ శర్మను ఫోన్‌లో సంప్రదించడానికి ప్రయత్నించగా ఆయన ఫోన్‌ ఆన్సర్‌ చేయలేదు. ఈ ఘటనపై మాట్లాడిన బీజేపీ అధికార ప్రతినిధి మనీష్‌ శుక్లా.. పాత ప్రభుత్వాలపై నిందను తోసేశారు. కూనారిల్లిన వ్యవస్ధను తాము ఇప్పుడిప్పుడే నిర్మిస్తున్నామని అన్నారు. కేవలం విద్యా వ్యవస్ధే కాకుండా మిగిలిన అన్ని వ్యవస్ధల్లోనూ త్వరలో మార్పు తీసుకువస్తామని చెప్పారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు