2021 డిసెంబర్‌లో గగన్‌యాన్‌

30 Aug, 2018 03:24 IST|Sakshi

సాక్షి బెంగళూరు: భారతీయులను సొంత సాంకేతిక పరిజ్ఞానంతో అంతరిక్షంలోకి పంపే ‘గగన్‌యాన్‌’ ప్రయోగాన్ని 2021, డిసెంబర్‌లో నిర్వహిస్తామని ఇస్రో చైర్మన్‌ కె.శివన్‌ తెలిపారు. ఈ ప్రయోగాన్ని చేపట్టేముందు పలు పరీక్షలను నిర్వహించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. ఇందులో భాగంగా 2020లో ఓసారి, 2021లో మరోసారి మానవరహిత పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు. అలాగే క్రూ సపోర్ట్‌ సిస్టమ్స్, సర్వీస్‌ మాడ్యూల్, ఆర్బిటాల్‌ మాడ్యూల్‌ వంటి పలు సాంకేతికతలను ఇంకా అభివృద్ధి చేయాల్సిఉందని శివన్‌ పేర్కొన్నారు.

2022 నాటికి భారతీయులను సొంత సాంకేతిక పరిజ్ఞానంతో అంతరిక్షంలోకి పంపుతామని ప్రధాని మోదీ ఈఏడాది స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శివన్‌ మాట్లాడుతూ.. అంతరిక్ష యాత్రకు ఎంతమందిని పంపాలి? అక్కడ ఎన్నిరోజులు ఉండాలి? అన్న విషయాలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. గగన్‌యాన్‌లో పాల్గొనేందుకు వ్యోమగాములను ఇంకా ఎంపిక చేయలేదని వెల్లడించారు.

వ్యోమగాముల ఎంపిక ప్రక్రియ భారత వాయుసేన(ఐఏఎఫ్‌)స్వీకరించిందనీ, ఓసారి ఎంపిక పూర్తయితే 2 నుంచి 3 సంవత్సరాల పాటు వారికి శిక్షణ ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ముగ్గురు వ్యోమగాములను ఏడు రోజులపాటు అంతరిక్షంలోకి పంపే సామర్ధ్యం తమకుందని శివన్‌ చెప్పారు. ఈ ప్రయోగం చేపట్టేందుకు మిషన్‌ కంట్రోల్, ట్రాకింగ్, లాంచ్‌ప్యాడ్‌ నిర్మాణం వంటి పనుల్లో ప్రైవేటు రంగ సహకారం అవసరమని అభిప్రాయపడ్డారు. మానవసహిత యాత్రలో పాల్గొనే వ్యోమగాములకు శిక్షణ కోసం ఇతర దేశాల సాయం కూడా తీసుకుంటామని మరో ప్రశ్నకు శివన్‌ సమాధానమిచ్చారు.

మరిన్ని వార్తలు