ఇండియా ‘జార్జి ఫ్లాయిడ్‌’లు

28 Jun, 2020 04:58 IST|Sakshi

తమిళనాట పోలీసు రిమాండ్‌లో తండ్రీ తనయుల మృతి

చెన్నై: తమిళనాడు పోలీసుల రాక్షసత్వంపై దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించారన్న కారణంతో తండ్రీకొడుకుల్ని హింసించి చంపడంపై జనం మండిపడుతున్నారు. వీరిని ఇండియన్‌ ‘జార్జ్‌ ఫ్లాయిడ్‌’లు అంటూ నెటిజన్లు  సోషల్‌మీడియాలో వ్యాఖ్యాని స్తున్నారు. తమిళనాడులోని శాంతాకులం ప్రాంతానికి పి.జయరాజ్‌ (62) జూన్‌ 19న తన దుకాణాన్ని లాక్‌డౌన్‌ నిబంధనల ప్రకారం సాయంత్రం 7 గంటలకు మూసివేయకపోవడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. తండ్రి గురించి కనుక్కోవడానికి వెళ్లిన జయరాజ్‌ కొడుకు బెనిక్స్‌నూ అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం తెలిసి వారి బంధువులు 20న స్టేషన్‌కెళ్లారు. అప్పుడే వారిద్దరి నడుము భాగాల కింద తీవ్రంగా రక్తస్రావం అవుతుండడాన్ని గుర్తించారు. 21న  వీరిద్దరూ రిమాండ్‌లోనే కన్నుమూశారు.  

ప్రైవేటు భాగాల్లోకి లాఠీలు దూర్చారు  
19న రాత్రంతా పోలీసులు వీరిద్దరిని తీవ్రంగా హింసించారని ఈ ఘటనపై విచారణ చేపట్టిన అధికారులు చెప్పారు. వారి ప్రైవేటు భాగాల్లోకి లాఠీలు దూర్చారని తెలిపారు. ఈ ఘటనను సుమోటోగా తీసుకొని విచారించనున్నట్లు తమిళనాడు హైకోర్టు ప్రకటించింది. తమిళనాడు పోలీసుల అమానుషత్వాన్ని అమెరికాలో నల్లజాతీయుడు జార్జి ఫ్లాయిడ్‌ ఉదంతంతో పోలుస్తూ గుజరాత్‌ ఎమ్మెల్యే జిగ్నేశ్‌ మేవానీ ట్వీట్‌ చేశారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు