భారత్‌లో దాదాపు 1200 యూఆర్‌ఎల్స్‌ బ్లాక్‌

28 Apr, 2018 08:31 IST|Sakshi

నెట్‌ కూ తప్పని సర్కారీ సెన్సార్‌...!

ప్రభుత్వ వ్యతిరేక వార్తలు, వెబ్‌సైట్లూ నియంత్రణ 

గల్ఫ్‌దేశాల్లో అశ్లీల, అబార్షన్లు, లెస్బియన్,గే వంటి సైట్లు సెన్సార్‌

యూనివర్సిటీ ఆఫ్‌ టొరెంటో ‘సిటిజన్‌ ల్యాబ్‌’  తాజా పరిశోధనలో వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌ : ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్‌ వినియోగంలో  అవాంఛిత అంశాల నియంత్రణకు  స్కూళ్లు, గ్రంథాలయాలు, వ్యాపార,వాణిజ్ యసంస్థలు వంటివి   ‘ఫిల్టరింగ్‌ టెక్నాలజీ’  ఉపయోగించడం సాధారణంగా జరిగేదే. ప్రధానంగా అశ్లీలసైట్లు (పోర్నోగ్రఫీ),  సమాచారం దొంగిలించే పథకాలు (ఫిష్షింగ్‌ స్కీమ్స్‌), రెచ్చగొట్టే ప్రసంగాలు వంటి విభిన్న అంశాల నియంత్రణకు ఈ టెక్నాలజీ ఉపయోగిస్తున్నాయి. అయితే కొన్ని ప్రభుత్వాలు ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్ల ద్వారా దీనిని ఉపయోగించి ప్రభుత్వ వ్యతిరేక వార్తలు, అంశాలు నియంత్రిస్తున్నాయి.

ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యదేశమైన భారత్‌లో  దాదాపు 1200 ప్రత్యేక యూనిఫామ్‌ రిసోర్స్‌ లొకేటర్‌ (వెబ్‌అడ్రస్, వనరు గా పిలిచే యూఆర్‌ఎల్‌ ) బ్లాక్‌ అయినట్టు యూనివర్సిటీ ఆఫ్‌ టొరెంటోకు చెందిన  ‘సిటిజన్‌ ల్యాబ్‌’  తాజా పరిశోధనలో వెల్లడైంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఇంటర్నెట్‌ సెన్సారింగ్‌ అమలు తీరుపై జరిపిన విస్తృత అధ్యయనం ఆధారంగా ఈ నివేదిక రూపొందించింది.    భారత్‌లో ఏయే సైట్లు బ్లాక్‌ చేశారన్నది  సొంతంగా  పరిశీలించేందుకు సిటిజన్‌ల్యాబ్‌తో ముంబయికి చెందిన ఓ ఆంగ్ల దినపత్రిక  కలిసి పనిచేసింది.

ఇంటర్నెట్‌ను  సెన్సార్‌ చేస్తున్న దేశాల జాబితాలో భారత్‌ ఉండడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది.  ఇంటర్నెట్‌ను విస్తృతంగా వినియోగిస్తున్న ఇండియాలో ఇటువంటివి జరగడం ప్రజలను నిరుత్సాహపరుస్తుంది. గతంలో ప్రధానంగా పోర్న్, గేమింగ్‌ సైట్స్‌పై దృష్టి పెట్టినా, ఇప్పుడు జాతీయ భద్రతపైకి మళ్లింది. మానవహక్కుల బృందాలు, ప్రభుత్వేతర సంస్థల సైట్లు బ్లాకయ్యాయి. బ్లాకవుతున్నాయి’ అని ఆ పత్రిక ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్‌ రీతూ సరీన్‌ చెప్పారు.

ఇదీ పరిశోధన...!
కెనడాకు చెందిన వాటర్‌లూ సంస్థ  నెట్‌స్వీపర్‌  ‘ఇంటర్నెట్‌ ఫిల్టరింగ్‌ టెక్నాలజీ’ సహాయంతో భారత్‌తో సహా పాకిస్థాన్, అప్గనిస్తాన్, బహ్రెయిన్,కువైట్, ఖతార్, సుడాన్, యూఏఈ, యెమన్, సోమాలియా నెట్‌స్వీపర్‌ టెక్నాలజీని ఉపయోగిస్తున్నాయి. ఈ పది దేశాలు కొన్ని ఇంటర్నెట్‌ సేవలు అందుబాటులో లేకుండా ‘సెన్సార్‌’ చేస్తున్నట్టు తాజాగా తమకు ఆధారాలు దొరికాయని  పరిశోధకులు తెలిపారు. ముఖ్యంగా వార్తలు, మతపరమైన, రాజకీయ విమర్శలు, వ్యతిరేక ప్రచారాంశాలు, లెస్బియన్, గే, బై సెక్పువల్, ట్రాన్స్‌జెండర్స్, క్వీర్‌ (ఎల్‌జీబీటీక్యూ)ల వనరులు, వంటి విషయాలపై ఇంటర్నెట్‌ సెన్సార్‌ అమలవుతున్నట్టు పేర్కొన్నారు. 

వెల్లడైన అంశాలు...

  • గూగుల్‌ సెర్చ్‌లో గే, లెస్బియన్‌ అనే కీ వర్డ్‌లను యూఏఈ, బహ్రెయిన్, యెమన్‌ బ్లాక్‌చేశాయి
  • అబార్షన్లు అనే కేటగిరి కింద ఉన్న వెబ్‌సైట్లన్నింటిని కువైట్‌ పూర్తిగా బ్లాక్‌ చేసింది
  • ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ)ను యూఏఈ, కువైట్‌లలో పోర్నోగ్రఫీ కింద వర్గీకరించాయి
  • రాజకీయవార్తలు, అభిప్రాయాలు, విమర్శలకు వేదికలుగా ఉన్న వెబ్‌సైట్లను బహ్రెయిన్, ఖతార్, సుడాన్, సోమాలియా బ్లాక్‌ చేశాయి
  • యెమన్‌లో అంతర్యుద్ధానికి సంబంధించి ఇంటర్నెట్‌లో  సరైన సమాచారం అందకుండా హౌతి తిరుగుబాటుదారులపై నియంత్రణ ఉంది
  • భారత్‌లో శరణార్థుల సంక్షోభంపై ఫేస్‌బుక్‌ గ్రూపుల్లో చర్చ, అల్‌జజీర, యూకే టెలిగ్రాఫ్‌ కథనాలు, యూట్యూబ్, ట్విటర్, ఫేస్‌బుక్‌లలో ప్రత్యేక అంశాలపై చర్చను  బ్లాక్‌ చేస్తున్నారు
  • కువైట్‌లో అబార్షన్, సెక్స్‌ ఎడ్యుకేషన్, అల్కహాల్‌ సంబంధిత అన్ని సైట్స్‌ సెన్సార్‌
  • బహ్రెయిన్‌లో రాజకీయ, మానవహక్కుల గ్రూపుల, గూగుల్‌లో గే, లెస్బియన్‌ సెర్చ్‌లపై నియంత్రణ
  • యూఏఈలో రాజకీయ,మానవహక్కులసంఘాలతో పాటు గ్రీన్‌పీస్‌ వార్తలు,ప్రత్యామ్నాయ జీవనశైలి (ఎల్‌జీబీటీక్యూ)పై సెన్సార్‌
  • యెమన్‌లో ఇంటర్నెట్‌ ప్రైవేసీ టూల్స్, ప్రతిపక్షరాజకీయపార్టీలు, ప్రతిపక్షాల వార్తలపై ఆంక్షలు   – సాక్షి నాలెడ్జ్‌ సెంటర్
మరిన్ని వార్తలు