60వేల తేనెటీగలు.. దాదాపు 4గంటలకు పైగా..

20 Jun, 2020 08:35 IST|Sakshi

తిరువనంతపురం: తేనె మానవులకు అత్యంత ఇష్టమైన, మధురమైన పదార్ధం. తేనెను ఇష్టపడని వారుండరు అంటే కూడా అతిశయోక్తి కాదేమో.. కానీ తేనెటీగలను చూస్తే మాత్రం కాసింత దూరం వెళ్లాల్సిందే. కానీ కేరళకు చెందిన ఓ యువకుడు మాత్రం తేనెటీగలు తన స్నేహితులంటూ వాటిని రక్షించడం నా కర్తవ్యం అంటూ చెప్పుకొస్తున్నాడు. వివరాల్లోకెళ్తే.. కేరళకు చెందిన సంజయ్‌కుమార్‌ ఒక తేనెటీగల పెంపకందారుడు. తేనెను తయారుచేస్తూ అమ్ముకొని జీవనం సాగిస్తూ ఉంటాడు. నేచర్‌ ఎమ్‌ఎస్‌గా పిలవబడే 24 ఏళ్ల ఆయన కుమారుడు తన చిన్ననాటి నుంచే తేనెటీగల పెంపకాన్ని చూస్తూ వాటిని బాగా మచ్చిక చేసుకున్నాడు. తేనెటీగలు కుట్టడం ప్రమాదకరమని తెలిసినా.. వాటితో ఒక ప్రత్యేక బంధాన్ని ఏర్పరచుకున్నాడు. చదవండి: వైరల్‌: పాము నీళ్లు తాగడం చూశారా?

ఏడు సంవత్సరాల వయసు నుంచే వందలాది తేనెటీగలను తన ముఖం మీద, చేతుల మీద వాటిని ఉంచుకోవడం తన స్నేహితులను ఆశ్చర్యానికి గురిచేసేది. తర్వాతి కాలంలో దాదాపు 4 గంటల 10 నిమిషాల పాటు 60వేల తేనెటీగలను తన మొహంపై ఉంచుకొని గిన్నిస్‌ రికార్డును కూడా నెలకొల్పారు. అనుభవజ్ఞులైన తేనెటీగల పెంపకందారులు కూడా ఇటువంటి చర్యలకు బయపడతారు. కానీ అతను మాత్రం కనురెప్పలు, పెదాల మీద ఉంచుకొని వాటితో ప్రశాంతంగా ఉండాలని.. స్నేహితుడిలా.. సోదరుడిలా చూసుకోవాలని సలహా ఇస్తున్నాడు. చదవండి: చైనా సైనిక మరణాలపై అంతా గందరగోళం

కాగా దీనిపై ఆయనను వివరణ కోరగా.. మొదట్లో ఇది అంత సులభం కాదు. కొద్దిరోజులకు అలవాటుపడ్డాను. దీనిని నేను ఎప్పుడూ ఇబ్బందికరంగా భావించలేదు. వాటిని ముఖం మీద ఉంచుకున్నప్పుడు కూడా నేను ప్రతిదీ చూడగలిగాను. నడవగలిగాను. డ్యాన్స్‌ కూడా చేశాను. తేనెటీగ ప్రమాదకరం అని తెలుసుకోకముందే వాటితో నాకు ఒక ప్రత్యేక బంధం ఏర్పడింది. ఆ అభిమానమే ఎపీకల్చర్‌లో బెంగళూర్‌లో మాస్టర్స్‌ డిగ్రీ చదవడానికి ప్రేరేపించింది. త్వరలోనే తేనెటీగల గురించి అధ్యయనం చేసి డాక్టరేట్‌ కూడా పొందాలని కలలు కంటున్నట్లు' తెలిపాడు.    

మరిన్ని వార్తలు