అమెరికా మీడియా కంటే మనం ఎంతో బెటర్‌!

4 Aug, 2018 18:33 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తనకు మీడియా ప్రతికూలంగా వ్యవహరిస్తోందని భావిస్తున్నారు. ఈ కారణంగానే ఆయన పలు సందర్భాల్లో మీడియాను విసుక్కున్నారు. వాస్తవానికి మీడియా ఆయన ఎన్నికల ప్రచారానికి, విదేశీ పర్యటలనలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తూ వచ్చింది. దేశంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ ప్రభుత్వాన్ని తూలనాత్మక దష్టితో చూడడం, ఆ ప్రభుత్వ విధానాలను విశ్లేషణాత్మక దష్టితో విమర్శించడం మీడియాకు ఆది నుంచి ఉన్న అలవాటే. మీడియాలో కొంత భాగం మాత్రమే తటస్థ వైఖరిని అవలంబిస్తూ వస్తోంది. ఎమర్జెన్సీ కాలాన్ని వదిలేసి నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే వరకు మీడియా ఈ పంథానే అనుసరించింది. మోదీ అధికారంలోకి వచ్చాక సోషల్‌ మీడియా ప్రాధాన్యత పెరగడం, ఆయన దాన్ని తనకు అనుగుణంగా మలచుకోవడం వల్ల ప్రధాన పత్రికా మీడియా కూడా మోదీ ప్రభుత్వ ప్రచారానికే ప్రాధాన్యత ఇస్తూ వచ్చింది.

ఒక్క పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని మినహా ప్రతిపక్ష మీడియా మోదీ ప్రభుత్వాన్ని 2016 వరకు వెనకేసుకొనే వచ్చింది. ఆ తర్వాత దేశంలో రైతుల ఆందోళనలు పెల్లుబుకడం, రిజర్వేషన్ల కోసం పటేళ్లు, మరాఠాలు జరిపిన ఆందోళనల్లో విధ్వంసం చోటు చేసుకోవడం, గోరక్షణ పేరిట మూక హత్యలు పెరగడం, పశ్చిమ బెంగాల్‌లో మతోన్మాదాన్ని రెచ్చగొట్టేందుకు నకిలీ వార్తలు ప్రచారం కావడం, నకిలీ వార్తల కారణంగా పిల్లల కిడ్నాపర్లనుకొని మూక దాడుల్లో అమాయకులు మరణించడం, ప్రశాంతంగా ఉన్న యూనివర్శిటీల్లో ఏబీవీపీ లాంటి సంస్థలు అలజడి రేకెత్తించడం, ముఖ్యంగా మహిళలపై, పసిపిల్లలపై అత్యాచారాలు పెరగడం, మొత్తంగానే సమాజంలోనే అభద్రతా భావం పెరగడం వల్ల మీడియా ఇలాంటి వాటికి ప్రాధాన్యతను ఇవ్వాల్సి వచ్చింది.

పైగా బీజేపీ నాయకులే మహిళల అత్యాచారాలకు సంబంధించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి, గోరక్షణ పేరిట దాడులు జరిపిన గూండాలను సత్కరించి తమంతట తాము పరువు తీసుకున్నారు. అధికారంలోకి వచ్చాక విదేశాల్లో మూలుగుతున్న నల్లడబ్బును వంద రోజుల్లో వెనక్కి తీసుకొస్తామని చెప్పి ఇప్పటి వరకు ఒక్క పైసా తీసుకరాకపోవడం, ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు యువతకు కల్పిస్తామని ఏటా అందులో నాలుగోవంతు ఉద్యోగాలు కూడా కల్పించక పోవడం, కేంద్ర రైల్వే శాఖలో 2014 నుంచి పాతికవేల ఉద్యోగాలు భర్తీకాకుండా అలాగే ఉండిపోవడం, ఆర్థిక వ్యవస్థ అంతంత మాత్రంగానే కొనసాగడం, వేల కోట్ల రూపాయల బ్యాంకుల అప్పులను ఎగవేసిన విజయ్‌ మాల్యా, నీరవ్‌ మోదీ, మెహుల్‌ చోక్సీలు దేశం విడిచి పారిపోవడం లాంటి సంఘటలకు మీడియా ప్రాధాన్యత ఇవ్వడం మోదీకి మీడియా తనకు వ్యతిరేకమనిపించవచ్చు. పలు సందర్భాల్లో చారిత్రక అంశాల గురించి తప్పుగా మాట్లాడి మోదీనే పరువు తీసుకున్నారు. 

ఒక్కసారి అమెరికా మీడియాతో పోల్చుకుంటే భారత్‌ మీడియా అధికార పక్షంతో ఎలా వ్యవహరిస్తుందో అర్థం అవుతుంది. హార్వర్డ్‌ యూనివర్శిటీ పరిశోధకులు ఇటీవల వెల్లడించిన ఓ అధ్యయనం ప్రకారం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌కు వ్యతిరేకంగా సీఎన్‌ఎన్‌ కవరేజ్‌ 93 శాతం వ్యతిరేకంగా ఉండగా, ఏడు శాతం మాత్రమే అనుకూలంగా ఉంది. ఎన్‌బీసీ కవరేజ్‌ కూడా అలాగే ఉంది. సీబీఎస్‌ కవరేజ్‌ 91 శాతం వ్యతిరేకంగా, 9 శాతం అనుకూలంగా, ది న్యూయార్క్‌ టైమ్స్‌ కవరేజ్‌ 87 శాతం వ్యతిరేకంగా, 13 శాతం అనుకూలంగా, ది వాషింగ్టన్‌ పోస్ట్‌ కవరేజ్‌ 83 శాతం వ్యతిరేకంగా 17 శాతం అనుకూలంగా ఉంది. స్వదేశీ మీడియాతోపాటు విదేశీ మీడియా కూడా ట్రంప్‌ను ఓ మూర్ఖుడిగా భావిస్తున్నప్పటికీ మీడియా కట్టడికి ఆయన ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఆయన ఒత్తిడి కారణంగా అక్కడ జర్నలిస్టుల ఉద్యోగాలు పోవడం లేదు.

మరిన్ని వార్తలు