ఆగస్టు 15 నాటికి కరోనా టీకా!

4 Jul, 2020 05:44 IST|Sakshi

సిద్ధమవుతున్న భారత వైద్య పరిశోధన మండలి

క్లినికల్‌ ట్రయల్‌ జాబితాలో తెలుగురాష్ట్రాల్లోని రెండు ఆస్పత్రులు.

న్యూఢిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ అంతు చూసే వ్యాక్సిన్‌ను ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీ నాటికి తయారు చేయాలని భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌) భావిస్తోంది. వ్యాక్సిన్‌ అభివృద్ధి విషయంలో హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్, పుణేలోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీతో(ఎన్‌ఐవీ) కలిసి పనిచేస్తున్న సంగతి తెలిసిందే. కరోనా నిర్మూలనకు భారత్‌ బయోటెక్‌ తయారు చేసిన కోవాక్సిన్‌ను మనుషులపై ప్రయోగించేందుకు ఇటీవల డీసీజీఐ అనుమతి మంజూరు చేసింది. ఈ క్లినికల్‌ ట్రయల్స్‌ను దేశంలో 12 ప్రాంతాల్లో నిర్వహించాలని ఐసీఎంఆర్‌ నిర్ణయించింది. ఈ జాబితాలో విశాఖలోని కేజీహెచ్, హైదరాబాద్‌లోని నిమ్స్‌ ఉన్నాయి. ఈ మేరకు ఎంపిక చేసిన వైద్య సంస్థలు, హాస్పిటళ్లకు తాజాగా లేఖ రాసింది. జూలై 7వ తేదీలోగా ఎన్‌రోల్‌మెంట్‌ పూర్తి చేయాలని కోరింది. భారత్‌లో దేశీయంగానే తయారు చేస్తున్న తొలి వ్యాక్సిన్‌ ఇదేనని ఐసీఎంఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ బలరామ్‌ భార్గవ ఈ లేఖలో పేర్కొన్నారు.

ఆ సమయానికి సాధ్యమా?: భారత్‌లో కోవాక్సిన్‌ మానవ ప్రయోగాలు ఇంకా మొదలుకాలేదు. దీంతో ఆగస్టు 15లోగా టీకా రావటం దాదాపు అసాధ్యమన్నది నిపుణుల మాట. ఎందుకంటే ఏ టీకా తయారీ అయినా మూడు దశల మానవ ప్రయోగాలను పూర్తి చేసుకోవాలి. ఒక్కో దశకు ఏడు నెలల వరకు సమయం పట్టొచ్చు. భారత్‌ బయోటెక్‌కు కోవాక్సిన్‌ విషయంలో తొలి రెండు దశలను ఏకకాలంలో నిర్వహించేందుకు అనుమతులు లభించాయి. అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ఇవి త్వరగా ముగిసినా మూడో దశ ట్రయల్స్‌ పెద్ద ఎత్తున చేయాల్సి ఉంటుంది. అన్నీ పూర్తయ్యాక సమాచారాన్ని ఫైలింగ్‌ చేసి... వివిధ నియంత్రణ సంస్థల నుంచి అనుమతులు పొంది, మందు భారీగా ఉత్పత్తి చేయటానికి మరికొంత సమయం పడుతుందన్నది విశ్లేషకుల మాట. అన్నీ సవ్యంగా... వేగంగా జరిగితే నవంబర్‌– డిసెంబర్‌ నాటికి కోవాక్సిన్‌ అందుబాటులోకి రావచ్చన్నది ఆశావహుల మాట. (రికార్డు స్థాయిలో రికవరీ)

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు